Home తాజా వార్తలు ప్రగతి జనసంద్రం

ప్రగతి జనసంద్రం

కిక్కిరిసిన రోడ్లు.. పలుచోట్ల ట్రాఫిక్ జాం
గులాబీమయమైన కొంగరకలాన్ సభా ప్రాంగణం
20 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు
సాంస్కృతిక కార్యక్రమాలతో దద్దరిల్లిన సభ

Pragati-Nivedana-Sabha

మన తెలంగాణ/రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం కొంగరకలాన్‌లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రగతి నివేదన సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభ జనసంద్రమైంది. లక్షలాది మంది ప్రజలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలిరావడంతో సభా ప్రాంగణం జనసందోహంతో కిక్కిరిసిపోయింది. శనివారం రాత్రికి రాత్రే వివిధ జిల్లాల నుండి పార్టీ కార్యకర్తలు, ట్రాక్టర్లలో రైతులు పెద్ద మొత్తంలో ఔటర్‌రింగ్ సమీపంలో గుడారాలు వేసుకొని బస చేశారు. సాయంత్రం ప్రారంభం కానున్నప్పటికీ ఉదయం నుంచే ప్రగతి నివేదన సభ వద్ద చేరుకొని ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదరురు చూశారు.

ముఖ్యంగా సభ ప్రాంగణానికి ముందు వరుసలో ప్రముఖ గాయని మంగ్లీ లంబాడీల నృత్యప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. అలాగే డోల్ వాయిద్యాలతో అనేక రకాల విన్యాసాలు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సాంస్కృతిక విభాగం తరఫున, మంగ్లీ బతుకమ్మ ఆటపాటలతో, తెలంగాణ ఉద్యమ రథ సారథి కెసిఆర్‌పై ఆట పాటలతో మార్మోగించారు. సాయంత్రం 5 గంటలకు సభ ప్రాంగణం వెనుక భాగంలో ఉన్న హెలీప్యాడ్ వద్ద హెలికాప్టర్ చక్కర్లు కొట్టడంతో కెసిఆర్ వస్తుండని గులాబీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సెల్ఫీలతో పొటోలకు పోజులిస్తూ జై కెసిఆర్ అంటూ నినాదాలు చేశారు. ప్రాంగణంలో మహిళలు ఉన్న చోట నృత్య ప్రదర్శనలు చేస్తు ప్రజలను మంత్రముగ్దులను చేశారు. అంతేకాకుండా రోడ్లపై జనం కిక్కిరిసిపోయారు. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రోడ్లన్నీ నిండిపోయాయి. ముఖ్యంగా బొంగులూరు జంక్షన్ వద్ద వాహనాలతో ట్రాఫిక్ జాం అయ్యింది. ఏ వాహనం ఎక్కడికి పోవాలో అర్థం కాక పోలీసులను సంప్రదించి వారు సర్ది చెప్పే పనిలో పడ్డారు. మహిళలు మూత్రశాలలకు ఇబ్బందిగా మారింది.

వాలంటీర్లుగా ఎంకెఆర్ ఫౌండేషన్ సభ్యులు

ప్రగతి నివేదన సభ కోసం యువకులే కాకుండా మహిళా వాలంటీర్లను ఎంపిక చేసి పలు ప్రాంతాలలో ప్రజలను సభ ప్రాంగణం చుట్టు ఏర్పాటు చేసి వారిని సభలో పంపించే విధంగా కృషి చేశారు. ముఖ్యంగా మహిళలు జట్టుగా ఏర్పడి జనాన్ని సభ వేదిక వద్ద పంపించేందుకు కృషి చేశారు.

వాహనాలతో కిక్కిరిసిపోయిన ఔటర్ రింగ్ రోడ్డు

సాయంత్రం 5 గంటల వరకు సభ ప్రాంగణం నిండిపోవడంతో సభకు వచ్చే వాహనాల రద్దీతో ఔటర్‌రింగ్ కిక్కిరిసిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడనే నిలిచిపోయి చా మంది సభ ప్రాంగణానికి చేరుకోలేక పోయారు.

ఆకట్టుకున్న కెసిఆర్ ఫొటో ఎగ్జిబిషన్

సభ ప్రాంగణం నిండి పోవడంతో జనం అక్కడికి వెళ్లలేక సిఎం కెసిఆర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సందర్భంలో ఆయన అనేక ఫొటోలు సభ ప్రాంగణం ముందు వరుసలో కెసిఆర్ పొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దీని చూసేందుకు జనం ఎగబడ్డారు.

ఎంపి ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం

సభకు వచ్చిన కొంత మంది నల్గొండ జిల్లాకు చెందిన వారు మా ప్రియతమ నాయకుడు పార్లమెంటు సభ్యులు ఎంపి బూర నర్సయ్యగౌడ్ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారని తెలిసి నల్గొండ ప్రాంగానికి చెందిన వారు, ప్రజలు ఉచిత వైద్యశిబిరానికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఏదిఏమైనా కొంగరకలాన్‌లో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభ అనుకున్న విధంగా కార్యకర్తలకు రెట్టింపు ఉత్సాహానికి దారి తీసిందని పలువులు చర్చించుకున్నారు. ఈ సభలో ముందస్తుగానే సార్వత్రిక ఎన్నికలకు పచ్చజెండా ఊపే ప్రయత్నం చేయవచ్చని పలువురు చర్చించుకున్నారు.