Home ఆఫ్ బీట్ కలల సాకారంలో విజయం

కలల సాకారంలో విజయం

కలలు కనండి… వాటిని సాకారం చేసుకోండి అన్న అబ్దుల్ కలాం మాటలను చక్కగా పాటిస్తున్నారు యువత. చిన్నప్పటి నుంచే ఉన్నత లక్షాలను ఏర్పరుచుకుని వాటిని సాధించడంలో ఏమాత్రం వెనుకంజ వేయకుండా కష్టపడుతున్నారు. అలాంటి కోవలోకి వస్తారు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఐటీబీపీ తొలి మహిళా అధికారిణి ప్రకృతి, జడ్జి కాబోతున్న పూనమ్‌లు.
భారతదేశ యువతీయువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కృషి ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని నిరూపించారు వీరిద్దరూ..

 ఐటీబీపీ తొలి మహిళా అధికారిణి ప్రకృతి

LIFE

ఇండో టిబెటన్ ఇండో సరిహద్దు పోలీస్ దళం (ఐటీబీపీ) తొలి మహిళా అధికారిణిగా అసిస్టెంట్ కమాండెంట్ హోదాలో బాధ్యతలు నిర్వహించబోతోంది పాతికేళ్ల ప్రకృతి. భద్రతా దళాల్లో మహిళా అధికారులను నియమించేందుకు 2016లో ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర సాయుధ పోలీసు దళాల పరీక్షలను నిర్వహించింది. ఆ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది ప్రకృతి. మొదటి ప్రయత్నంలోనే అనుకున్నది సాధించి శభాష్ అనిపించుకుంది. ప్రకృతి బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో పుట్టింది. అక్కడే విద్యాభ్యాసం పూర్తిచేసింది. ఆమెది మధ్య తరగతి కుటుంబం. తండ్రి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసేవాడు. తల్లి గృహిణి. చిన్నతనం నుంచీ చదువుల్లో ముందుండేది. సాయుధ పోలీస్ దళాల పరీక్ష రాయడానికి ముందు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పట్టా తీసుకుంది. తండ్రిని ప్రేరణగా తీసుకుంది. దేశానికి సేవచేసే రంగంలో ఉండాలని కలలుకన్నది. యూనిఫాం ధరించాలనే కోరికను పెంచుకుంది. ఓ ఆంగ్ల దినపత్రికలో ఓ రోజు ఐటీబీపీలో ఉద్యోగాల కోసం ప్రకటన చూసింది. అంతే ఆలస్యం చేయకుండా సవాళ్లతో కూడిన ఆ కొలువును ఎలాగైనా సాధించాలనుకుంది. దరఖాస్తు చేసింది. పరీక్ష రాసి ఫలితాల్లో విజయం సాధించింది. ప్రకృతి తన పేరుకుముందు ఇంటిపేరు పెట్టుకోవడాన్ని అస్సలు ఇష్టపడదు. కేవలం సర్టిఫికెట్లలో రాస్తుంది. కులమతాలకు అతీతంగా ఉండాలంటుంది. వివక్ష అంటే పడదు. ఇంట్లో కూడా అంతే కుటుంబ సభ్యులు తనను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోదు. ఐటీబీపీలోకి వెళ్లాలన్న ఆమె ఆలోచనకు మొదట్లో తల్లిదండ్రులు భయపడ్డారు. వద్దన్నారు. కానీ ఆమె వారిని ఒప్పించింది. ఆమెపై నమ్మకంతో ప్రోత్సహించారు. పిల్లలు తమ లక్షాన్ని అమ్మానాన్నలకు స్పష్టంగా చెప్పగలగాలి, వారికేమైనా అపోహలు ఉంటే తొలగించే ప్రయత్నం చేయాలి. అంతేకాని లక్షాన్ని వదులుకోకూడదని యువతకు చెప్తుంది. పేరెంట్స్‌కు ఇష్టం లేదని, చాలా మంది తమ ఆశల్ని చంపుకోవడం నేను చాలా మందిని చూశాను అంటుంది ప్రకృతి. పేరెంట్స్‌ను మెప్పించే బాధ్యత మనదే అంటుంది.
ప్రకృతి డెహ్రాడూన్‌లోని ఐటీబీపీకి చెందిన ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరనుంది. ఈ శిక్షణ పూర్తయ్యాక ఐటీబీపీ ఫస్ట్ ఆఫీసర్‌గా బాధ్యతలు తీసుకోనుంది. ప్రస్తుతం అక్కడ 83 వేల మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వారిలో కేవలం 15 వందల మంది మాత్రమే మహిళలున్నారు. అంటే 1.75శాతం అన్నమాట. వీరు కూడా ఇప్పుడక్కడ కానిస్టేబుల్ ర్యాంకులోనే పనిచేస్తున్నారు. ప్రకృతి ఏడాది కఠోర శిక్షణ అనంతరం తొలి మహిళా అసిస్టెంట్ కమాండెంట్ హోదాతో విధుల్లో చేరనుంది.

జడ్జిగా ఆటోవాలా కూతురు పూనమ్

lf

 ఉత్తరాఖండ్‌లో విడుదలైన ప్రొవిన్షియల్ సివిల్ సర్వీసెస్ (జుడీషియల్) 2016 ఫలితాలలో పూనమ్ టోడి రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. పూనమ్ తండ్రి అశోక్ టోడి ఆటో నడిపేవాడు. అతను సంపాదిస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి. అశోక్ కు ఇద్దరమ్మాయిలు, ఇద్దరబ్బాయిలు. వాళ్లను చదివించడంలో ఏనాడూ వివక్ష చూపలేదు. మొదట్లో చిన్నకిరాణా కొట్టు నడిపేవాడు. వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో డెహ్రాడూన్‌కు వచ్చి ఆటో నడపడం మొదలుపెట్టాడు. బిడ్డల లక్ష్యాలను నెరవేర్చడం కోసం కష్టపడుతున్నాడు. ఇన్నాళ్లకు కూతురు ద్వారా తన కల నెరవేరినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
పూనమ్ ఇంటర్ తర్వాత బికామ్‌లో చేరింది. కానీ ఆమెకు న్యాయవృత్తి మీద ఆసక్తి. దీంతో డిగ్రీ తర్వాత ఎల్‌ఎల్‌బి ఎంచుకుంది. వెంటనే సివిల్స్ జుడీషియల్ పరీక్షలకు సన్నద్ధం అయింది. రెండు సార్లు పరీక్ష రాసింది. కానీ ఇంటర్వూలో విజయం సాధించలేకపోయింది. అయినా పట్టుదల వదల్లేదు. 2016లోనూ పరీక్ష రాసింది. ఈసారి ఆమె శ్రమ ఫలించింది. ఊహించని రీతిలో మొదటి ర్యాంకు సంపాదించింది. చదువు పూర్తయ్యాక ఏదైనా ఉద్యోగంలో చేరి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉందామనుకుంది. కానీ తండ్రి ప్రోత్సాహంతో చదువును కొనసాగించింది. రెండుసార్లు ఓడినా కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ఇంత విజయం సాధించినట్లు చెబుతోంది పూనమ్. జడ్జి కాబోతున్నందుకు తన కుటుంబం పొందుతున్న ఆనందాన్ని వర్ణించలేనంటోంది.