Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

అందరికీ విద్య కేవలం చట్టాలతో దక్కదు : రాష్ట్రపతి

PRANABన్యూఢిల్లీ:  చట్టాలను చేయడమే కాదు, పేద విద్యార్థులకు సరైన విద్యను అందించేందుకు చేయాల్సింది చాలా ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. విద్యా కల్పనకు సముచిత మౌలిక నిర్మాణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పిలుపు నిచ్చారు. విద్యాభ్యాసానికి నోచుకోలేని దురదృష్టవంతులైన బాలలు ఈ దారుణ స్థితిలోనే ఉండకూడదని , వారికి విద్యాభ్యాసం కోసం ప్రభుత్వం చేస్తున్న యత్నాలే సరిపోవని , ప్రస్తుత వ్యవస్థలో మా ర్పులకు ప్రైవేటు రంగం నుంచి, స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి కూడా సరైన చొరవ ఉండాలని సూచించారు. ఆదివారం ఆయన ఇక్కడి రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో  15 మంది అధ్యాపకులకు మాలతీ జ్ఞాన్ పీఠ్ పురస్కారాలను బహుకరించిన తరువాత మాట్లాడారు. దేశంలో పిల్లలకు నిర్బంధ విద్య హక్కును కల్పించే చట్టం తీసుకువచ్చామని అయితే ఈ చట్టం పరిధిలోకి రాకుండా విద్యాబుద్ధులకు నోచుకోకుండా ఉన్న బాలలు ఎందరో ఉన్నారని , వారి కోసం తగు విధంగా చర్యలు తీసుకోవల్సి ఉందన్నారు. సరైన విద్యావ్యవస్థ కల్పనలో టీచర్ల పాత్ర కీలకం అని పిలుపు నిచ్చారు. సమగ్ర ప్రగతికి పటిష్ట విద్యావ్యవస్థ అవసరం ఎంతైనా ఉందని , సరైన విజ్ఞానంతోనే ప్రజలు తమకు అందే సమాచారాన్ని తగు విధంగా విశ్లేషించుకుని చెడును వదిలి మంచిని ఎంచుకునేందుకు వీలేర్పడుతుందని చెప్పారు.

Comments

comments