Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

సెమీస్‌లో ప్రణయ్, శ్రీకాంత్

  • ఇండోనేషియా సూపర్ సిరీస్

Prannoy

జకర్తా: భారత స్టార్లు హెచ్.ఎస్.ప్రణయ్, కిదంబి శ్రీకాంత్‌లు ప్రతిష్టాత్మకమైన ఇండోనేషియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటణ టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ మరో సంచలన విజయం సాధించాడు. క్వార్టర్స్‌లో ప్రణయ్ 21-18, 16-21, 21-19 తేడాతో ప్రపంచ, ఒలింపిక్ ఛాంపియన్ చెన్ లాంగ్(చైనా)పై సంచలన విజయం సాధించాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన సమరంలో ప్రణయ్ అసాధారణ ఆటతో ముందుకు దూసుకెళ్లాడు. తొలి గేమ్‌లో చాంగ్, ప్రణయ్ హోరాహోరీగా తలపడ్డారు. ఇద్దరు వరుసగా పాయింట్లు గెలుచుకుంటూ ముందుకు సాగారు. ఇద్దరు సర్వం ఒడ్డడంతో తరచు ఆధిక్యం మారుతూ వచ్చింది. కానీ, చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమైన ప్రణయ్ 21-18తో గేమ్‌ను గెలిచి పైచేయి సాధించాడు. కానీ, రెండో గేమ్‌లో సీన్ రివర్స్ అయ్యింది. ఈసారి చాంగ్ ఆధిపత్యం చెలాయించాడు. ప్రణయ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ముందుకు సాగాడు. చూడచక్కని షాట్లతో విరుచుకు పడిన ప్రణయ్ 21-16తో గేమ్‌ను దక్కించుకున్నాడు. దీంతో ఫలితాన్ని తేల్చే మూడో గేమ్‌పై ఆసక్తి నెలకొంది. ఇందులో కూడా పోరు యుద్ధాన్ని తలపించింది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా పోటీపడ్డారు. దీంతో పోరాటం నువ్వానేనా అన్నట్టు సాగింది. చివర్లో చాంగ్ ఒత్తిడిని తట్టుకోవడంలో విఫలమయ్యా
డు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న ప్రణయ్ 21-19తో గేమ్‌ను సొంతం చేసుకుని సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు.
శ్రీకాంత్ అలవోకగా..
మరో క్వార్టర్ ఫైనల్లో భారత అగ్రశ్రేణి ఆటగాడు శ్రీకాంత్ 21-15, 21-14 తేడాతో చైనీస్‌తైపి ఆటగాడు వీవాంగ్‌ను ఓడించాడు. ప్రారంభం నుంచే శ్రీకాంత్ జోరు కొనసాగించాడు. అద్భుత షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. అతని ధాటికి వాంగ్ ఎదురు నిలువలేక పోయాడు. ఇదే సమయంలో ఒత్తిడికి గురై వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న శ్రీకాంత్ సునాయాసంగా తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో కూడా శ్రీకాంత్ హవా కొనసాగించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడిన శ్రీకాంత్ 21-14తో గేమ్‌ను గెలిచి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. కాగా, సెమీస్‌లో శ్రీకాంత్ కొరియాకు చెందిన రెండో సీడ్ వాన్ హోతో తలపడుతాడు.

Comments

comments