Home దునియా కుతుబ్ షాహీల సాహితీ సేవ

కుతుబ్ షాహీల సాహితీ సేవ

Golconda-Nawab

తెలంగాణ మాగాణాల్లో ఎందరో ప్రాచీన కవులు చల్లిన అక్షరాల విత్తనాలు మహాగ్రంధాలయ్యాయి. శతాబ్దాల తెలంగాణ సాహిత్య కుసుమాలను విరబూయించిన మహాకవులకు రాజసౌధాల్లో ఆదరణ లభించింది. తెలంగాణను పరిపాలించిన అనేక రాజవంశాలు తెలంగాణ సాహిత్యాన్ని, కవులను ఆదరించారు. ఢిల్లీ సుల్తానుల దాడుల్లో తెలుగు సాహిత్యానికి ప్రాభవం తగ్గినా అంతకు ముందు, ఆ తర్వాత రాజాదరణతో గ్రంథాలను రచించిన వారున్నారు. విజయనగర రాజపుత్రిక భగీరథబాయిని పెళ్ళిచేసుకున్న ఇబ్రహీం కుతుబ్ షాహి స్వయంగా కవి కావడం విశేషం. దక్కన్ ఉర్దుకు ఆ రోజుల్లో ఆదరణ ఉన్నా సమాంతరంగా తెలంగాణలో తెలుగు వికసించింది.యుద్ధసమయాల్లో ప్రయాణాల్లో ఇబ్రహీం కుతుబ్‌షా ఉర్దూ కవులతోపాటు తెలుగుకవులను తీసుకువెళ్ళే ఆచారం ఉండేది. ఆయన ఆస్థానంలో ఉర్దూ కవులతో పాటు అద్దంకి గంగాధరుడు, మరిగంటి సింగనాచార్యులు, కుందుకూరి రుద్రకవితోపాటు అనేక మంది కవులు ఉండేవారు. ‘తారీఖ్ కుతుబ్ షాహి’ గ్రంథ రచయిత కుర్షాబిన్ కబ్బాదుల్ హుసేన్ రచనలను తెలుగులో అనువదించిన వారు ఆనాడే ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే గోల్కొండ రాజ్యం తెలుగుకవులతో పులకించి పోయేది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కవులపై విస్తృత పరిశోధన జరగక పోవడంతో అనేక మంది కవులు తాళపత్రాల్లోనే మగ్గిపోయారు.

ప్రబంధ కవిత్వానికి ఆద్యుడుగా అల్లసాని పెద్దనకు గౌరవం ఉన్నా అంతకంటే ముందే 14001480 మధ్యకాలంలో కల్పిత కావ్యం రాసిన కవిసూరనను ఎవరూ పట్టించుకోలేదు. అలాగే 1480 1530 నాటి చరిగొండ ధర్మనను ఎవరూ పట్టించుకోలేదని ఒక సందర్భంలో ఆరుద్ర విచారం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాకు వెళ్ళి నేటి వరంగల్‌ను పరిపాలిస్తున్న చిత్తాపుఖాన్‌కు చిత్రభారతం అంకితమిచ్చినట్లు చరిత్రకారులు రుజువుచేశారు. ఈయన రచనల ప్రభావంతోనే గయోపాఖ్యానం, కృష్ణార్జున యుద్ధం లాంటి యక్షగానాలు రచించారు. 15వ శతాబ్దంలో నవచోళచరిత్ర, మల్హణచరిత్ర, శంకర దాసమయ్య చరిత్ర, వీరసంగమయ్య చరిత్ర, శిష్యప్రబోధమంజరి దివపద గ్రంథాలను రాసిన కుమ్మరి కులానికి చెందిన పోలిశెట్టి లింగకవి కావ్యాలపై విస్తృత పరిశోధనలు జరిగాయి. ఆయన తెలంగాణ కవిగా చరిత్రకారులు తేల్చారు. ఆయన సాహిత్యంలో తెలంగాణ పదాలు పుష్కలంగా లభించడమే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే మల్కిభరామునిగా కీర్తి గడించిన ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థాన కవి అద్దంకి గంగాధరుడు ఎన్నో రచనలు చేశాడు. వీటితో పాటు ప్రభుదేవర వాక్యం అనే సిద్ధాంత వచన గ్రంధం రాసిన సిద్ధరామకవి, గంగాధరయ్య రాసిన శివస్తుతి నాటి కాలంలో ఆదరించబడిన మరిం గంటి జగన్నాథాచార్యులు, అప్పలాచార్యులు గోల్కొండ రాజ్యంలోని తెలంగాణ కవులే!

ఇబ్రహీం కుతుబ్ షా దేవరకొండ పాలకుడిగా ఉన్నప్పుడు దేవరకొండలోని కందుకూరుకు చెందిన రుద్రకవి రాసిన సుగ్రీవ విజయం, నింకుశోపాఖ్యానం, జనార్థనాష్టకం, బలవదరీ శతకం, జనార్దనాష్టక స్తోత్రం, గువ్వలచెన్నని శతకం గ్రంథాల రచయిత రుద్రకవి. తెలుగు కవులను ఇబ్రహీం కుతుబ్ షా ఆదరించాడు. మతసామరస్యం కోసం శ్రమించిన నవాబుగా కూడా ఆయనకు పేరుంది. ఆయన పాలనలో ఉర్దు, తెలుగు, పారశీక భాషల్లో ఆనేకగ్రంథాలు వచ్చాయి. తెలుగు కవులకు ఆదరణ లభించింది. గోల్కొండ రాజ్యంలో వర్ధిల్లిన కవుల్లో తెలంగాణ కవులకే అగ్రతాంబూలం అందినట్లు కవుల చరిత్రస్పష్టం చేస్తోంది. ఇబ్రహీం కులీ కుతుబ్ షా భగీరథబాయిని పెళ్ళిచేసుకుని తెలుగు ఉర్దుకు సమాన అవకాశాలు కల్పించారు. ఈ సంప్రదాయం ఇబ్రహీం అనుచరులు కూడా కొనసాగించడంతో పొన్నగంటి తెలగన్న కావ్యరచన చేశారు. అనంతరం భాగమతిని ప్రేమించి పెళ్ళిచేసుకుని ప్రేమనగరంగా భాగ్యనగరాన్ని నిర్మించిన మహ్మద్ కులీ కుతుబ్ షా పండితులకు సముచితస్థానం కల్పించారు. ఉర్దు, తెలుగు, పారశీక కవులను ఆదరించాడు. ఇతను మీర్ మెమిన్ పీష్వాగా, సోమయాజిని ఆస్థాన కవిగా నియమించాడు. ఇదే ఆస్థానంలో గణేశ పండితుడు అనేక రచనలు చేశాడు. గోల్కొండ సమీపంలోని సిద్దలూరుకు చెందిన నేబతి కృష్ణని మంత్రిగా, ఆస్థానకవిగా నియమించాడు. మంచి కవిగా పేరున్న నేబతి కృష్ణకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా కవికి, కవిత్వానికి పట్టం కట్టారని చరిత్రకారులు చెబుతున్నారు. కృష్ణ రాసిన రాజనీతి రత్నాకరం ఆనాటి రాజకీయ, సాహిత్య, చరిత్రకు దర్పణం పడుతుంది. కవులతో స్నేహపూర్వకంగా ఉంటూ మంచి రచనలను ఆయన ప్రోత్సహించారు. 1580 ప్రాంతంలోని సారంగు తమ్మయ హరిభక్తి సుధోదయం, వైజయంతీ విలాసం రచించాడు.

తన రచనలలో తమ్మయ ఆనాటి విషయాలను వివరంగా విశదీకరించారు. భక్తిని, శృంగారాన్ని మేళవింపచేస్తూ రాసిన వైజయంతి విలాసం లో పేర్కొన్న భగీరథపట్టణమే భాగ్యనగరంగా చరిత్రకారుడు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి తన రచనల్లో పేర్కొన్నారు. దోమకొండ సంస్థానానికి చెందన కవులను సుల్తాన్ సత్కరించి కావ్యాలు రచింపజేశాడు. ఆ తర్వాత అధికారానికి వచ్చిన సుల్తాన్ అబ్దుల్లా కులీ కుతుబ్ షా సంస్కృ త శుకసప్తశతిని ఉర్దూలో ‘సబ్ రన్’ గా అనువదించారు. స్వ యంగా కవి అయిన సుల్తాన్ ఉర్ద్దూకు ఎనలేని సేవచేసినా తెలుగు కవులను విస్మరించలేదు. అలాగే ఈకాలంలో హరివాసరమాహాత్మంను నరసింహాచార్యుడు, శశిబిందు చరిత్రను చరిగొండ నరసింహకవి, కూర్మపురాణాన్ని బమ్మెర కేసనకవి,
రాజేశ్వర విలాసం పిల్లలమర్రి వెంకటపతి, చెన్నబసవ పురాణం గోపతి లింగ కవులు 16 శతాబ్దంలో కుతుబ్ షాహిరాజుల ఆదరణతో ఎన్నో రచనలు చేశారు. అలాగే ఓరుగల్లు వాస్తవ్యుడు కాసె సర్వప్ప ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రము ఆనువదించి ద్విపదలో సిద్ధేశ్వరచరిత్ర రాశారు. అలాగే కుతుబ్షాహి పాలనలో ఉన్న సరిహద్దు రాజులు కూడా కవులను ప్రోత్సహించి అనేక రచనలను చేయించారు. 1556 లో కాకునూరి అప్పకవి అప్పకవీయం రాశారు. ఈయన తెలంగాణ కవి అనే వాదనను బూర్గుల రామకృష్ణారావు తీసుకు రాగా చరిత్రకారులు బలమైన ఆధారాలు చూపారు. అప్పకవి సాధ్వీజనధర్మం అనే ద్విపదకావ్యం, అనంతవ్రత కల్పం, మల్లికార్జునిడి మీద శతకం, అంబికావాదం యక్షగానం, కవికల్పకం అనే లక్షణ గ్రంథాలను రచించాడు.

గోల్కొండ రాజుల్లో చివరి రాజైన అబ్దుల్ హసన్ తానీషా పూర్వీకుల పరంపరను కొనసాగించారు. ఆయన స్వతహాగా ఉర్దు, పారసీ, మరాఠీ భాషల్లో రచనలు చేశారు. తెలుగు కవులను ప్రోత్సహించారు. తానీషా పాలనలోని అధికారులు అక్కన్న మాదన్నల మేనల్లుడు కంచెర్లగోపన్న అనేక కీర్తనలు రాసి భక్త రామదాసుగా జగత్ప్రసిద్ధి గాంచాడు. 1666 నుంచి 1676 మధ్య కాలంలో తెనాలి రామలింగకవి అక్కన్న మాదన్నల ఆశ్రయంలో అనేక రచనలు చేశారు. ఇతను సుప్రసిద్ధ తెనాలి రామకృష్ణుడు కాదు. ఆనాడే విశ్వ బ్రాహ్మణుల కులానికి జరిగిన రెండు అన్యాయాలపై పరిమళ చోళ చరిత్ర కావ్యం రాసి పాలకులను కదిలించినట్లు తెలుస్త్తోంది. అలాగే ఈ కాలంలో లక్ష్మీశకవి, కాండ్రవేటి రామానుజాచార్యులు,పెన్గలూరు వెంకటాద్రి దామోదరో దాహరణం, భువనమోహినీ విలాసం రాసి తన కవితాపాండిత్య ప్రాగల్భాన్ని ప్రదర్శించారు. సిద్దేశ్వర పురాణం ద్వపదను విశ్వనాథయ్య, ఎడపాటి ఎఱ్ఱన, అన్నం భట్టు తర్క సంగ్రాహం భగవద్గీత ద్విపదను కృష్ణమాచార్యులు 16వ శతాబ్దంలో శ్రీరుక్మిణీ కురవంజిని అత్తాను రామానుజాచార్యులు రచించి రాజాదరణ పొందారు. 17వశతాబ్దివరకు తెలంగాణలో ప్రసిద్ధగ్రంథాలున్నాయని చరిత్రపుటల్లోనే ఉన్నాయి కానీ లభ్యం కాలేదు. గోల్కొండను ఔరంగజేబు స్వాధీనం చేసుకున్న అనంతరం తెలుగు కవులకు రాచమర్యాదలు తగ్గాయి. ఫలితంగా అనేక రచనలు తాళపత్రాలకే పరిమితమై ప్రజల్లోకి రాలేకపోయాయి. హైదరాబాద్‌లోని గ్రంథాలయంలో 38 వేల పుస్తకాలు ఉండేవని చరిత్రకారులు చెబుతారు. చరిత్రకు అందకుండాపోయిన గ్రంథాలు ఎటూపోయాయి. కనీసం దొరికినవాటినైనా వెలుగులోకి తెస్తే తెలంగాణ చరిత్ర ఘనత మరింతగా తెలిసే అవకాశాలున్నాయి.
 -కె.కె –