Home తాజా వార్తలు అభిప్రాయాలు చెప్పండి

అభిప్రాయాలు చెప్పండి

PH1

ఆన్‌లైన్‌లో ఉద్యోగులకు పిఆర్‌సి ప్రశ్నావళి
నాలుగు అధ్యాయాల్లో 57 ప్రశ్నలు
ప్రస్తుత విధానాల్లో మార్పులు, చేర్పులు, మౌలిక అంశాల్లో సవరణలు అవసరమని భావిస్తున్నారా? అని అడిగిన పిఆర్‌సి

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర తొలి పిఆర్‌సి (వేతన సవరణ కమిషన్) వివిధ విభాగాల్లోని ఉద్యోగులందరికీ ఆన్‌లైన్ ద్వారా ప్రశ్నావళిని అందజేసి అభిప్రాయాలను తెలియజేయాలని కోరిం ది. నాలుగు అధ్యాయాల్లో మొత్తం 57 ప్రశ్నలను రూపొందించి ఇప్పటివరకూ అమల్లో ఉన్న విధానాల కు ఏవైనా మార్పులు చేర్పులు అవసరమా, మౌలిక అంశాల్లోనూ సవరణలు అవసరమవుతుందా అని కోరింది. ఈ అభిప్రాయాలను తెలియజేయడానికి నిర్దిష్టంగా గడువు ను విధించకపోయినప్పటికీ ఏ రూపంలో అం దించాలో స్పష్టమైన నమూనాను మాత్రం రూ పొందించింది. లక్షలాది మంది ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను సేకరించాల్సి ఉన్నందున త్వరలోనే వెబ్‌సైట్‌ను కూడా ప్రత్యేకంగా రూ పొందించాలని భావిస్తోంది. వివిధ హెచ్‌ఒడిలు, విశ్వవిద్యాలయాలు, గ్రామీణ స్థానిక సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలు, సేవా సంఘా లు, పింఛనుదార్లు, విడివిడి ఉద్యోగులు.. ఇలా వివిధ విభాగాలుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరి నుంచి ఈ ప్రశ్నావళిపై అభిప్రాయాలను కోరింది. మూల వేతనం, కరువుభత్యం, ఇంటి అద్దె అలవెన్సు, ‘సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్’, మాస్టర్ పేస్కేల్, ప్రత్యేక అలవెన్సు, ఎల్‌టిసి, మెడికల్ అలవెన్సు, పింఛను తదితర అనేక అంశాలను ఈ ప్రశ్నావళిలో పొందుపర్చింది. కొన్ని మారుమూల ప్రాంతా లు, కొండ ప్రాంతాలు, గిరిజన ఏజెన్సీ ప్రాంతాలు, ఆరో గ్య సవాళ్ళను ఎదుర్కొనే ప్రాంతాలు.. ఇలా ప్రత్యేక
ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రత్యేక అలవెన్సులు అందుకుంటున్నందున ఈ మోతాదు వేతన స్వరూపాన్ని ఆటంకపరిచేదిగా ఉండకూడదని పిఆర్‌సి అభిప్రాయపడింది. కనీస వేతనం, గరిష్ఠ వేతనం ఏ మేరకు ఉండాలో, అందుకు అనుసరించాల్సిన నిష్పత్తి గురించి కూడా ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను కోరింది. ప్రస్తు తం ప్రతీ ఏటా ఉద్యోగులు అందుకుంటున్న 2.48% నుంచి 2.985% మేరకు ఇంక్రిమెంట్ అందుకుంటున్నందువల్ల ఇది సహేతుకమైనదిగాన భావిస్తున్నారా లేక కేంద్ర వేతన సవరణ కమిషన్ తరహాలో పనితీరుకు ముడిపెట్టి ఇస్తున్న ఇంక్రిమెంట్ విధానాన్ని అమలుచేయాలని కోరుకుంటున్నారో తెలియజేయాలని కోరింది. వివిధ విభాగాల్లో ప్రస్తుతం ఔట్‌సోర్సింగ్/ వర్క్ ఛార్జ్‌డ్/డైలీ వేజ్ / కంటింజెంట్ లాంటి పలు రూపాల్లో పనిచేస్తున్న సిబ్బం ది సేవలను కొనసాగించాలని కోరుకుంటున్నారా లేక ఏవైనా మార్పులు అవసరమని భావిస్తున్నారో కూడా తెలపాలని కోరింది.
మాస్టర్ పే స్కేల్ : సమైక్య రాష్ట్రంలో తొలుత ‘మాస్టర్ పే స్కేల్’ అనే విధానం 1993లో ఉనికిలోకి వచ్చిందని, సీనియర్లకు ఎక్కువ ప్రయోజనం అందించే ఉద్దేశంతో అమలవుతోందని పేర్కొన్న పిఆర్‌సి దీన్ని ఇకపైన కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందా? లేనిపక్షంలో ఏవైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందా అని అభిప్రాయాన్ని కోరడంతో పాటు దాని కింద ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న 32 రకాల ‘పే స్కేల్స్’ వ్యవస్థ యధావిధిగా కొనసాగాలా లేక కొన్ని మార్పులు అవసరమా అని కూడా కోరింది. ఒకవేళ ‘పే స్కేల్స్’ సంఖ్యలో మార్పు ఉండాలని కోరుకున్నట్లయితే తగ్గించాలా లేక పెంచాలా అని కూడా కోరింది. ఏడవ కేంద్ర పిఆర్‌సి ‘మే మాట్రిక్స్’ అనే నూతన విధానాన్ని ఉనికిలోకి తీసుకొచ్చినప్పటికీ సమైక్య రాష్ట్రంలో పదవ పిఆర్‌సి దీన్ని ఆమోదించనందువల్ల మన రాష్ట్రానికి ప్రత్యేకమైన విధానం ఉండాలా అని కూడా కోరింది.
మాస్టర్ పే స్కేల్ అమలులో ఉన్నందువల్ల ఇక దాని కింద ఉండే ‘పే స్కేల్’ విధానానికి ప్రత్యేకంగా పెద్దగా ప్రాధాన్యత ఉండదని, ముఖ్యంగా సర్వీసులో ఉన్న ఉద్యోగులకు పెద్దగా ప్రయోజనం లేదని, కానీ చాలామంది ఉద్యోగుల్లో మాత్రం పే స్కేల్ కొనసాగడం ద్వారా తోటి ఉద్యోగులతో పోల్చుకుని ఎక్కువ లబ్ధి చేకూరుతుందనే సాధారణ అభిప్రాయం ఉందని పిఆర్‌సి వివరించింది. అయితే ‘పే స్కేల్’ను నిర్ణయించడంలో ఏయే అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలో తెలియజేయాలని కోరింది.
గత పిఆర్‌సి సిఫారసులపై … :
సమైక్య రాష్ట్రంలో పదవ పిఆర్‌సి ‘మాస్టర్ పే స్కేల్’ను సిఫారసు చేసినందువల్ల దీని పరిధిలోకి వచ్చే ఐదు మౌలిక అంశాలను ప్రస్తుత పిఆర్‌సి ఉద్యోగుల ముందు ఉంచి అభిప్రాయాలను కోరింది. కనీస వేతనాన్ని రూ. 13 వేలుగానూ, గరిష్ట వేతనాన్ని రూ. 1.10 లక్షలుగానూ గత పిఆర్‌సి నిర్ణయించి ఈ రెండింటి మధ్య 1:8.31 నిష్పత్తిని ప్రతిపాదించిందని గుర్తుచేసి రానున్న కొత్త పిఆర్‌సిలో సైతం ఈ విధానం అమలుకావడంపై అభిప్రాయాలను కోరింది. మాస్టర్ స్కేల్ విధానాన్ని కొనసాగించడం ద్వారా క్రమంగా వేతనాల్లో పెరుగుదల ఉంటుందని, ‘ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్’లో 6, 12, 18, 24 సంవత్సరాల సర్వీసుకు సంబంధించి ఉద్యోగులకు విస్తృత ప్రయోజనాలు కల్పించాల్సి ఉన్నదని, ‘స్పెషల్ పే’, ఇతర అలవెన్సు లాంటివాటిని కొనసాగించడంపైనా, ఐదు రకాల ఇంక్రిమెంట్లపైనా అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. ప్రస్తుతం ఉద్యోగులు అందుకుంటున్న కరువుభత్యం మూలవేతనంలో 50% దాటినట్లయితే దాన్ని ‘కరువు వేతనం’గా భావించడం, ‘కాంపెన్సేటరీ అలవెన్సు (డిఏతో కలుపుకుని)ను లెక్కించే తీరు తదితరాలపై కూడా లోతైన ప్రశ్నలను రూపొందించింది. ఏదేని పరిస్థితుల్లో కరువుభత్యం 50% దాటినట్లయితే అన్ని రకాల అలవెన్సులు కలిపి 25% వరకు పెంచాలని గత పిఆర్‌సి సిఫారసు చేసినందున ఈసారి ఆ స్వరూపం ఎలా ఉండాలో తెలియజేయాలని కోరింది.
ఉగ్రదాడులకు నష్టపరిహారం పెరగాలా?
ఇటీవలి కాలంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఉగ్రవాద దాడుల్లో మరణిస్తున్న అంశాన్ని ప్రస్తావించిన పిఆర్‌సి వారికి ఇచ్చే నష్టపరిహారం, కుటుంబ సభ్యులకు ప్రభుత్వపరంగా చేయాల్సిన సాయం తదితరాలపై కూడా ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను కోరింది.
ప్రస్తుతం ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం సంతృప్తికరంగానే ఉందా లేక ఏవైనా మార్పులు అవసరమా అని పేర్కొనింది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నిపుణుల సేవలను వినియోగించుకున్న ప్రభుత్వం ఇకపైన కూడా అలాంటి ఉద్యోగులకు వేతనాల చెల్లింపును యధాతథంగా కొనసాగించాలా లేక మార్పులు చేర్పులు అవసరమా అని ప్రశ్నించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి చేసే సూచనలతో పాటు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి ఎలాంటి చర్యలు అవసరమో, పింఛను మీద ఆధారపడే విధానం ఏ విధంగా ఉండాలో తెలియజేయాలని కోరింది. ఇండ్ల స్థలాలు కొనసడానికి, ఇళ్ళు కట్టుకోడానికి ప్రభుత్వం నుంచి ప్రస్తుతం తీసుకుంటున్న ‘అడ్వాన్సు’, దానికి వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించే విధానంలో మార్పుల గురించీ అభిప్రాయాలను కోరింది.
ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రస్తుతం అనుసరిస్తున్న నియమాక విధానం (పబ్లిక్ సర్వీస్ కమిషన్, డిఎస్‌సి లాంటివి)లో తేవాల్సిన మార్పులపై కూడా అభిప్రాయాలను కోరింది. ప్రస్తుతం ప్రజలు విస్తృతంగా వినియోగిస్తున్న 108, డయల్ 100 లాంటి సేవలను సంబంధిత విభాగాలకు బదిలీ చేయడం ద్వారా ఇంతకంటే మెరుగ్గా నిర్వహించడం, సేవలందుకోవడం సాధ్యమని భావిస్తున్నారా అనే అభిప్రాయాన్ని కోరింది. మొత్తం 57 ప్రశ్నలతో రూపొందిన ఈ నమూనాలో ఏవేని అంశాలు లేనట్లయితే అదనంగా చేర్చాల్సిన అవసరాన్ని కూడా తెలియజేయాలని కోరింది.