Home లైఫ్ స్టైల్ నెమలికి నేర్పిన నడకలివే!

నెమలికి నేర్పిన నడకలివే!

premas indian dance in foreign country

వృత్తిని దైవంగా భావించి ఎన్నో సేవలందిస్తోంది. దేశ విదేశాల్లో మన భారతీయ నాట్యకళను పరిచయం చేసి దానికో గుర్తింపును తీసుకొచ్చింది. గ్లామర్ ప్రపంచంలో అవకాశం వచ్చినా తన లక్షానికి ఆటంకం కాకూడదనుకుని వదులుకుంది. జాతీయ, అంతర్జాతీయంగా ఎన్నెన్నో ప్రదర్శనలిస్తూ, ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అభినయానికి మారుపేరు. ఆమే పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు. తల్లి, గురువు అయిన శోభానాయుడి బాటలో నడుస్తూ నృత్యాన్ని అభ్యసిస్తూ, కూతురుగా, శిష్యురాలిగా ఎన్నో ప్రదర్శనలిస్తూ ప్రశంసలు అందుకుంటున్న శివరంజని లు తమ మనోభావాలను సకుటుంబంతో పంచుకునారు.

మీ నాట్య ప్రస్థానం..
రాజమండ్రిలో ప్రారంభమైంది. నాట్యం లేని జీవితం నాకు లేదు. మూడేళ్ల వయసున్నప్పుడే రేడియోలో పాటలు వస్తుంటే దానికనుగుణంగా చేతులూ, కాళ్లు తిప్పడం చేస్తుండేదాన్ని. అలాగే హావభావాలతో మాట్లాడేదాన్ని. ఇవన్నీ గమనించిన మా అమ్మ 5వ ఏటనే నాకు నాట్యం నేర్పించింది. మాది కన్సర్వేటివ్ ఫ్యామిలీ. అప్పట్లో నాట్యం అంటే చాలా తప్పు కింద జమకట్టేవారు. ఆరో ఏటనే మొట్టమొదటి ప్రోగ్రాం ఇచ్చాను. కళలకు పుట్టిలైన చెన్నై వెళ్లి నాట్యం నేర్చుకోమని మా గురువు గారు చెప్పడంతో అక్కడ వెంపటి చినసత్యం దగ్గర శిక్షణ పొందాను. ఆ సమయంలో నాన్నను ఒప్పించి 12 సంవత్సరాలపాటు అమ్మ నాతోనే చెన్నైలో ఉంది. ఈ రోజున ఈ స్థానంలో ఉన్నానంటే కారణం మా అమ్మ. ఆమెకు సంగీతం వచ్చు. వీణ వాయించేది.

మీ విద్యాభ్యాసం..
నాన్న ఇంజినీర్ కావడం వల్ల ఆంధ్రాలోని ప్రాంతాలన్నీ తిరిగాం. సిలబస్‌లు మారిపోయేవి. చాలా కష్టపడ్డాను. 8వ క్లాసులో ఉన్నప్పుడు చెన్నై వెళ్లిపోయాను. అక్కడ శారదా హైస్కూల్, సెయింట్‌మేరీస్ కాలేజ్‌లో చదివాను. ఆ తర్వాత నృత్యానికీ చదువుకూ కుదరలేదు. ప్రోగ్రాంలూ రిహార్సల్స్ ఇదే లోకంగా ఉండేది. దీంతో వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి బి.ఎ., కరస్పాండెంట్ కోర్సు చేశాను. సాహిత్యం అంటే చాలా ఇష్టం. పుస్తకాలు కూడా తెచ్చుకున్నాను. కానీ చదువుకోవడానికి టైంవుండటం లేదు. పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్‌గా, అకాడెమీ ప్రిన్సిపాల్‌గా, సొంతంగా డాన్స్ కంపోజింగ్ చేసుకోవడం..ఇలా వీటితోనే బిజీగా ఉంటున్నాను.

నృత్యంలో సోషల్ కాన్సెప్ట్‌ను మిక్స్ చేసి ప్రదర్శనలిచ్చినట్లున్నారు ..
సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలు చూసి ఒక స్త్రీగా, కళాకారిణిగా స్పందించాను. ఆ క్రమంలో విజయోస్తునారి, సర్వం సాయిమయం, స్వామివివేకానందలాంటి నృత్య నాటకాలు ప్రదర్శించాను. అవన్నీ ప్రశంసలు అందుకున్నాయి.

మీ గురువుల గురించి..
రాజమండ్రిలో పిఎల్ రెడ్డి, చెన్నైలో వెంపటి చినసత్యం. కళలు నేర్చుకునేటపుడు ఎక్కువగా గురువుల్ని మార్చకూడదు. ఒకే గురువుండాలి.

నృత్యంలో ఏమైనా కొత్తవి కనిపెట్టారా..
డాన్స్‌లో ఇన్నోవేషన్‌కి అంతం అనేది లేదు. ఇప్పటివరకు చేసిన 80 సోలో డాన్స్‌లు, థిల్లానాలు, అన్నమాచార్య కీర్తనలు ఇవన్నీ ఇదివరకు లేవు. రామదాసు, త్యాగరాజు కీర్తనలు లేవు. అన్నీ కొత్తగా వచ్చాయి. ఇప్పటివరకు చేసిన సోలో ఐటమ్స్, డాన్స్ బాలేలు 14లో 10 నేనే చేశాను. నాలుగు మాత్రం మా గురువుగారు చేసినవి. మిగిలివి నేను సొంతంగా కంపోజ్ చేశాను. మా అమ్మాయితో శివరంజని డాన్స్ బాలేస్, సోలో గ్రూప్ చేస్తుంటాను.

సినిమాల్లో అవకాశాలు
సినిమాల్లో చాలా అవకాశాలు వచ్చాయి. బి.ఎన్.రెడ్డి, కె. విశ్వనాథ్, బాపు, బాలచందర్.. ఇలా అందరూ సినిమాల్లో నటించమని అడిగారు. కానీ నా ధ్యేయం నాట్యమే. అందుకే సున్నితంగా తిరస్కరించాను. డాన్స్ నా జీవితం. నా జీవితమనే చిన్న ప్రపంచంలో నేను, నృత్యం తప్ప ఎవరూ ఉండరు.

నృత్యానికి కుల మతాలుంటాయా?
కళలకు అస్సలుండదు. ఎన్నో చోట్ల ప్రోగాంలు చేశాను. అస్సలు ఎక్కడా కూడా ఇలాంటి భేదం రాలేదు. నా ప్రేక్షకుల్లో చాలా మంది చదువుకున్నవారు, లేని వారు, చిన్నా పెద్దా, అన్ని కులాల వారూ ఉంటారు. నచ్చితే అందరూ అభినందిస్తారు. నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. హౌస్‌ఫుల్ కాకుండా ఇంతవరకూ ఏ ప్రోగ్రాం కూడా నేను చేయలేదు.

మన దేశంలో కంటే విదేశాల్లో సంప్రదాయ నృత్యానికి విపరీతమైన క్రేజ్ ఎందువల్ల?
అవును నిజమే. ఇందుకు ఓ ఉదాహరణ చెప్తాను. రష్యాలోని లెనిన్‌రాడ్‌లో ఒకసారి నా ప్రోగాం అయిన తర్వాత అన్నామేజిక్ ,ఎలిన్‌అథర్సో అనే ఇద్దరు అమ్మాయిలు మాకు ఆటోగ్రాఫ్ కావాలని అడిగారు. ఇచ్చాను. తర్వాత నేను హోటల్ రూంకి వెళ్లాను. అక్కడికి కూడా వచ్చారు. ఏంటమ్మా అని అడిగితే మేం మీతో పాటు హైదరాబాద్ వస్తాం డాన్స్ నేర్పించండి అని అడిగారు. అది కొంత కష్టం అనిచెప్పాను. తర్వాత ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాను. అక్కడికి కూడా వచ్చారు. ఇదేంటమ్మా అని అడిగితే మాకు నృత్యం నేర్పించమని బతిమిలాడారు. వాళ్లలా పట్టుబట్టి హైదరాబాద్‌కు వచ్చి నా దగ్గర నృత్యం నేర్చుకున్నారు. తర్వాత మరో 12 మంది రష్యన్ అమ్మాయిలు వచ్చి ఇక్కడ నేర్చుకున్నారు. అందులో ఇద్దరు అక్కడ అకాడెమీలను ఏర్పాటుచేసి నృత్యం నేర్పిస్తున్నారు. ఇపుడు ఒక్కొక్కరికి 70మంది వరకు స్టూడెంట్స్ వున్నారు. అక్కడ కమిట్‌మెంట్ అంటే కమిట్‌మెంటే.

శాస్త్రీయ నృత్యానికి ఆదరణ తగ్గిందని భావిస్తున్నారా?
మీడియా వల్ల, ఇంట్లో కూర్చుని టీవీ ఆన్ చేసుకుని కాలక్షేపం చేయడం ఆ రకంగా తప్ప ఆదరణ తగ్గలేదు. చూసే ప్రేక్షకులు ఎక్కడున్నా వస్తారు. చూపించే వాళ్లే లేరని నా అభిప్రాయం. ముందునుంచీ కంటే ఇప్పుడే చాలా మార్పు వచ్చింది. బాగా చూస్తున్నారు. ఒకప్పుడు చదువే లోకంగా ఉండేవారు. ఇప్పుడలా కాదు చదువుతో పాటు మాకు ఆర్ట్ కావాలని అంటున్నారు పిల్లలు. ఎప్పుడెప్పుడు పరీక్షలు ఐపోతాయా డాన్స్ క్లాసులకెళదామా అనుకుంటున్నారు. పేరెంట్స్‌లో కొంత మార్పు వస్తుంది. ఇంకా మార్పు రావాలి.

మీ శ్రీనివాస కూచిపూడి ఆర్ట్ అకాడెమీ గురించి..
స్కూల్ నుంచి వచ్చి బుక్స్ అలా పడేసి ఇక్కడికి వస్తారు మా స్టూడెంట్స్. నీరసంగా ఉంటారు. నేను వెళ్లి క్లాసు మొదలుపెట్టగానే వెంటనే ఉత్సాహంతో డాన్స్ మొదలెట్టేవారు. నృత్యంలోని గొప్పదనం అది. నేనైతే రూ.35ల ఫీజుతో మొదలుపెట్టాను. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి రూ.500 చొప్పున తీసుకుంటున్నాం. ఇది కూడా తీసుకోకూడనే నా ఉద్దేశం. కానీ ఊరికేచెబితే దానికి అంతగా విలువుండదు. చాలా మంది వేలల్లో వసూలు చేస్తున్నారు.

తెలంగాణ, ఆంధ్ర వేరైన ఎఫెక్టు కళలపై పడిందంటారా?
పడిందనే చెప్పాలి. ఎందుకంటే కూచిపూడికి పెద్దగా ప్రోగ్రాంలు రావట్లేదు. క్లాసికల్‌ను పక్కన పెట్టడం అనేది చాలా బాధగా ఉంటుంది.

ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుందంటారా నృత్యం..
ఒత్తిడి నించి బయటపడేందుకు డాన్స్ ఓ ఔషధంలా పనిచేస్తుంది. పాజిటివ్‌గా ఆలోచించగలుగుతాం. శరీరానికి ఫిట్‌నెస్, బ్లడ్ సర్కులేషన్ బాగుంటుంది.అంతేకాకుండా డాన్స్‌లో పురాణాలు ఉంటాయి. ఇవన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒక సంస్కారం ఏర్పడుతుంది. ఎప్పుడైనా నాకు మనసు బాలేకపోతే అకాడెమీకి వెళ్లి పది నిముషాలు డాన్స్ చేస్తే ఒత్తిడి నుంచి బయటకు వస్తాను.

మీకు వచ్చిన అవార్డులు ?
ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పొట్టిశ్రీరాములు యూనివర్సిటీ నుంచి డాక్టరేట్, కూచిపూడిలో నృత్య చూడామణి ..ఇలా ఎన్నో అందుకున్నాను.

అమ్మ గురువైనందుకు గర్వపడుతున్నా…

తల్లి, గురువు కూడా అయిన పద్మశ్రీ డా॥ శోభానాయుడిని స్ఫూర్తిగా తీసుకుని ఆమె అడుగు జాడల్లో నడుస్తోంది కూచిపూడి కళాకారిణి శివరంజని. ఇంటర్ చదువుతున్న శివరంజని వాసవి పబ్లిక్ స్కూల్‌లో పదో క్లాసు పూర్తిచేసింది. తన తల్లి గురువైనందుకు చాలా గర్వపడుతున్నట్లు చెబుతోంది. ఆమె దగ్గర నృత్యం నేర్చుకోవడం తన పూర్వ జన్మ సుకృతమని అంటోంది. నాలుగేళ్లుగా శివరంజని అనేక నృత్య ప్రదర్శనలిచ్చింది. సోలో ప్రదర్శనలు ఇస్తోంది. చెన్నైలో 2011లో తన మొదటి సోలో నృత్యం చేసినట్లు గుర్తుచేసుకుంది. మొదట అంతమంది ప్రేక్షకులను చూసి భయపడ్డానని, కానీ తల్లి ఇచ్చిన ధైర్యంతో చేశానంటోంది. నాలో ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించింది తన గురువేనంటోంది.

వేదికపై ఉన్నప్పుడు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకోకూడదని కళపై ధ్యాస ఉండాలని తల్లి చెప్పినట్లు తెలిపింది. రోజుకు రెండు గంటలు డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది శివరంజని. నాలుగు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే సంగీతం నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది. అప్పుడప్పుడూ సంగీతం క్లాసులన్నా మిస్ అయ్యేదాన్ని కానీ డాన్స్‌కి మాత్రం ఎప్పుడూ ఎగొట్టలేదంటుంది. తన సంగీత గురువు ధూలిపాళ్ల గీతగా చెప్పింది. చెన్నైలోని కపిలేశ్వర దేవాలయంలో తన మొదటి నాట్య ప్రదర్శన ఇచ్చింది. శోభానాయుడితోపాటు అనేక నృత్యా రూపకాల్లో పాల్గొంది. కళాకారిణిగా, కొరియోగ్రాఫర్‌గా, మంచి వ్యక్తిగా, తల్లిగా ఉన్న శోభానాయుడు తనకు ఆదర్శమంటోంది. ఈ మధ్యనే శివరంజని నాట్యమంజరి అవార్డును అందుకుంది.

                                                                                                                                                    – మల్లీశ్వరి వారణాసి