Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

రిజర్వేషన్ల పైనే దృష్టి

Preparation gram Panchayat Elections In Medak Dist
మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : రానున్న పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. వచ్చే వారంలో రిజర్వేషన్ల లిస్ట్ విడుదల కానున్నందున ఇప్పటికే కొందరు రాజకీయ చాణక్యులు తమ గ్రామ పంచాయతీకి ఏ రిజర్వేషన్ అవసరమో అందుకనుగుణంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లా పంచాయతీ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతూ పైరవీలు కూడా కొనసాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో ఉన్న రిజర్వేషన్ తమకు అనుకూలంగా లేనందున ఈసారైనా సరే తమకనుకూలమైన రిజర్వేషన్ వచ్చే విధంగా అధికారులను మభ్యపెట్టడంతో పాటు ప్రలోభాలకు గురిచేయడానికి కూడా విశ్వప్రయత్నాలు కొనసాగించడంతో నిమగ్నమయ్యారని కొందరు ఆశావాదులే బహిర్గతంగా ఎదుటి పోటీ అభ్యర్థిపై విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో జిల్లాలోని మునుపటి గ్రామ పంచాయతీలలో గల తాండలతో పాటు మధిర గ్రామాలైన మరో 157 గ్రామ పంచాయతీలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రస్తుతం 469 గ్రామ పంచాయతీలకు ఈ సంఖ్య పెరిగింది. దీంతో పోటీకి అభ్యర్థుల్లో నూతనోత్సాహం చిగురించింది.

ఇప్పటివరకు రెండు చిన్న గ్రామాలకు కలిపి ఒకే పంచాయతీ ఉన్న సమస్య రానున్న ఎన్నికలతో రూపుమాయనుంది. దాదాపు అన్ని పార్టీలు బలపర్చే అభ్యర్థులు బరిలో నిలిచేందుకు ఇప్పటినుండే ఓటర్లకు గాలం వేసేందుకు ప్రణాళికలు రూపుదిద్దుకొని క్యాంపెయినింగ్‌లు కూడా షురూ చేశారు. కానీ ఈనెల 25 తర్వాత విడుదలయ్యే రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయనే యోచనలో మునిగి తేలుతున్నారు. ఒక వేళ రిజర్వేషన్లో తమకు అవకాశం కలుగనిచో తన అనుచరులను బరిలో దింపే యోచనలో కూడా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే గ్రామాలకు పంచాయతీ ఎన్నికల హై ఫీవర్ సోకింది. స్థానిక బడానేతల అండదండలు ఉన్న వారు రిజర్వేషన్లు తమకు అనుకూలంగా కలిసి వచ్చే విధంగా ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులకు పదవ తరగతి పాస్ ఐతేనే అనే షరుతు కూడా ఆశావాదులకు స్పీడ్‌బ్రేకర్‌లా మారింది. దీంతో ఇప్పటికే పది పాస్‌కాని కొందరు ఆశావాదులు దూర విద్య ద్వారా పదవ తరగతిలో ప్రవేశం పొంది పరీక్షల్లో పాల్గొన్నారు. విచిత్రమేంటంటే ఎన్నో సార్లు సర్పంచ్‌గా చేసి పది పాస్‌కాని వ్యక్తులు దూర విద్యలో కూడా పదిలో ఫెయిల్ అవడంతో తల పట్టుకుంటున్నారు. మరో పక్క రిజర్వేషన్లపై ప్రస్తుత సర్పంచ్‌లు కోర్టును కూడా ఆశ్రయిస్తారనే ఆందోళన కూడా ఆశావాదుల్లో జంకు పుట్టిస్తుంది. ఒకవేళ ప్రస్తుత సర్పంచ్‌లు కోర్టును ఆశ్రయిస్తే పంచాయతీ ఎన్నికలు వాయిదా పడుతుందనే ఆందోళన కూడా ఆశావాదుల్లో దిగులు పుట్టిస్తుంది. ప్రస్తుతానికైతే రిజర్వేషన్ల లిస్ట్‌పైనే అభ్యర్థులు దృష్టిని సారించి ముందుకు కొనసాగుతున్నారు. రిజర్వేషన్ లిస్ట్ వెలువడితే గానీ ఆశావాదుల ఆశలు చిగురిస్తాయో… తుడిచేస్తాయో వేచి చూడాల్సివుంది.

Comments

comments