Home ఎడిటోరియల్ సరికొత్త చరిత్ర తయారీ!

సరికొత్త చరిత్ర తయారీ!

EDI

చరిత్రలో జాతీయతా భావాలను మరింత పెంచడాని కి, హిందూరాజులు, హిందూ చారిత్రక పురుషులకు సముచిత స్థానం క ల్పించడానికి భారత ప్రభుత్వం ఒక కమిటీ వేసిందని రాయిటర్ వార్తా సంస్థ వివరాలతో సహా తెలియజేసింది.ఈ కమిటీని సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ వేశారు. కమిటీ ఛైర్ పర్సన్ కె.ఎన్. దీక్షిత్ రాయిటర్ వార్తా సంస్థతో చెప్పిన మాటలు, “పాచీన చరిత్రకు సంబంధించి కొన్ని అంశాలను తిరగరాయడానికి ఉపయోగపడే నివేదిక ఇవ్వాలని నన్ను కోరారు. చాలా సార్లు బాహాటంగానే ప్రకటించారు. ఈ కమిటీని కూడా 2016లోనే ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆర్‌ఎస్ ఎస్ స్వంత పుస్తకాల్లో రాసిన మాటలే ఇప్పుడు చరిత్రగా నిరూపించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆరెస్సెస్ శాఖల్లో చెప్పే విషయాలను సత్యాలుగా నిరూపించడానికి చరిత్రలోకి ఎక్కిస్తున్నారు. “చారిత్రక వాస్తవాలకు సంబంధించిన పరిజ్ఞానం ఆరెస్సెస్, బిజెపి నేతలకు అంతగా ఉండదని చాలా సందర్భాల్లో బయటపడుతూ ఉంటుంది. కాని ఆరెస్సెస్, బిజెపి నేతలు భారత చరిత్రను తిరగరాయాలన్న ఆలోచనను రహస్యంగా ఏమీ పెట్టుకోలేదు. భారత పాఠ్యగ్రంథాల్లో ఎక్కువ గా కాంగ్రెసీకరించిన పాఠాలే ఉంటాయన్న ఆరోపణ బిజెపి చేస్తుంటుంది. నిజానికి ఈ ఆరోపణ బిజెపియే కాదు చాలామంది కూడా చేస్తుంటారు. కాంగ్రెసు నాయకుల గురించి పాఠ్యపుస్తకాల్లో ఎక్కువగా ఉందన్న మాటలో వాస్తవాలు కూడా లేకపోలేదు. కాని ఇప్పుడు కేంద్రమంత్రి మహేష్ శర్మ ఏర్పాటు చేసిన ఈ కమిటీ చేసే పని పాఠ్యపుస్తకాల్లో అనవసరంగా అత్యధికంగా కాంగ్రెసు నేతల ప్రస్తావనలను సరిదిద్దడం కాదు. గత పన్నెండు వేల సంవత్సరాలుగా భారత సంస్కృతి, నాగరికతల పరిణామ వికాసాలను తమ దృక్కోణంతో రాయించడం. అంటే తమకు అనుగుణమైన చరిత్రను ఒక కమిటీతో రాయిస్తున్నారు. వేల సంవత్స రాలు వెనక్కు వెళ్ళి భారతదేశం, భారతీయత అనే భావాలను అప్పటి నుంచి తమకు అనుగుణంగానే ఉన్నాయని నిరూపించడం. రాయిటర్స్ రిపోర్టు ప్రకారం కమిటీకి స్పష్టమైన లక్ష్యా లు నిర్దేశించడం జరిగింది. పురాతత్వ ఆధారాలను ఉపయోగించి ప్రస్తుతం దేశంలో ఉన్న హిందువులు వేల సంవత్సరాలుగా ఇక్కడనే ఉంటున్న మూలవాసులని నిరూపించడం. అలాగే ప్రాచీన హిందూ గ్రంథాలు పురాణాలు కాదు చారిత్రక వాస్తవాలని నిరూపించడం. ఈ కమిటీలో జియోలజిస్టులు, ఆర్కియాలజిస్టులు, ప్రాచీన సంస్కృత పండితులు, ఇద్దరు బ్యూరోక్రాట్లు ఉన్నారు. మొత్తం 12 మంది సభ్యులు. ఇందులో 9 మందితో డైలీ ఓ మాట్లాడినప్పుడు, ప్రాచీన హిందూ గ్రంథాలను పురాతత్వ తదితర ఆధారాలతో సరిపోల్చి అవన్నీ వాస్తవాలని, పురాణాలు కాదని నిరూపించడం, హిందూ సంస్కృతి అనేది అందరూ అనుకుంటున్న దానికన్నా చాలా ప్రాచీనమైందని నిరూపించడం తమ పనిగా చెప్పారు. చారిత్రక పరిశోధనల ద్వారా చరిత్రను పునర్దర్శించడం అన్నది చాలామంచి విషయమే. కాని ఇక్కడ జరుగుతున్నది అది కాదు. కమిటీకి ఒక లక్ష్యం ముందే నిర్దేశించారు. నిరూపించవలసిందేమిటోముందే చెప్పేశారు. దానికి అవసరమైన సాక్ష్యాధారాలు సేకరించడమో, తయారు చేయడమో ఈ కమిటీ చేయవలసిన పని. అంటే కొత్తగా కనిపెట్టడం కాదు, తాము అనుకున్నది కనిపెట్టినట్లు చెప్పడం జరుగుతుంది.
పైగా ఇదంతా సమాజంలో భిన్న వర్గాల మధ్య గోడలు కట్టే సిద్ధాంతానికి అవసరమైన విషయాలను నిరూపించడం. చరిత్రను పురాణాలను కలగాపులగం గా కలిపేయడం. ఒక మతం మిగిలిన వాటికన్నా చాలా గొప్పదని చెప్పడానికి ప్రయత్నించడం. ఈ కమిటీని నియమించిన బిజెపి గత చరిత్రను పరిశీలిస్తే ఈ భయాలు మరింత పెరుగుతాయి. దేశంలో అనేక మతకల్లోలాల్లో ఈ పార్టీ నాయకుల వ్యవహారశైలి, వివిధ సందర్భాల్లో ఈ పార్టీ నేతల విద్వేషపూరిత వ్యాఖ్యలు దానికి నిదర్శనం. ఈ కమిటీని నియమించిన సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ గతంలో చేసిన వ్యాఖ్యలనే తీసుకుందాం. అమ్మాయిలు రాత్రి బయట తిరగడం మన సంస్కృతి కాదన్నాడు. మన చరిత్ర, మన సంస్కృతి అనేక సం॥లుగా కలుషితమైపోయాయని, వాటిని ప్రక్షాళనం చేయవలసి ఉందని మరోసారి చెప్పాడు. ఎ.పి.జె. అబ్దుల్ కలాం ముస్లిం అయినప్పటికీ దేశభక్తుడని చెప్పాడు. భారత ఆత్మకు ఖుర్‌ఆన్, బైబిలు కేంద్రం కావని, గీత, రామాయణాలే కేంద్రమని చెప్పాడు. భారతదేశం వచ్చే విదేశీ టూరిస్టులు స్కర్టులు ధరించరాదన్నాడు. బిజెపి నేతలు చాలాసార్లు ముస్లిములను పాకిస్తాన్ పొమ్మంటూ మాట్లాడడం కొత్త కాదు. ఇది ప్రజల్లో చిచ్చుపెట్టే వైఖరి. ఈ కమిటి విషయంలోను ఆయన చెప్పిందేమిటంటే “నేను రామాయణాన్ని ఆరాధిస్తాను. అది చారిత్రక కథ అనుకుంటాను. ఇదంతా కల్పన అనడం చాలా పెద్ద తప్పు”. కాబట్టి ఆయన వాస్తవమని అనుకుంటున్న విషయాలు నిరూపించడానికి కమిటీ వేశాడు. కమిటీ పని వాస్తవమని నిరూపించడం. ఈ కమిటీ తుది నివేదికను పార్లమెంటుకు సమర్పిస్తామని, మానవ వనరుల శాఖతో మాట్లాడి కమిటీ కనిపెట్టిన విషయాలను పాఠ్యపుస్తకాల్లో వచ్చేలా చేస్తామని అన్నారు. నిజానికి కమిటీ కొత్తగా కనిపెట్టేది ఏదీ లేదు. శర్మ వాస్తవాలు అని చెబుతున్న మాటలనే కమిటీ తన నివేదికలో రాయాలి తప్ప కమిటీ కనిపెట్టేది ఏముంది? ఆ మాటల కు ఏవోకొన్ని నిరూపణలు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఈ కమిటీ పనిని చాలా సీరియస్‌గా తీసుకుంటామని, ప్రస్తుతం పాఠ్యపుస్తకాల్లో బోధిస్తున్న చరిత్రను ప్రశ్నించే ధైర్యం ఉన్న ప్రభుత్వం తమదని మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నాడు. దేశంలో మూలవాసులు హిందువులు మాత్రమేనని ఆరెస్సెస్ అభిప్రాయం. ఇతర మతస్తులు మతం మార్చుకున్నవారు లేదా విదేశీయులని తీర్మానిస్తోంది. అందువల్ల వారు ఘర్ వాపసీ ద్వారా హిందుత్వంలోకి రావాలి లేదా బాబర్ కీ ఔలాద్ వంటి దాడులను ఎదుర్కోవాలి.
దీనికి చారిత్రక ఆధారాలు ఆరెస్సెస్‌కి అవసరం లేదు. భారతదేశంలో అసలు మతం హిందుత్వ. కాబట్టి హిందూ భూభాగంలో హిందువులకే ఎక్కువ హక్కులుండాలన్నది ఆరెస్సెస్ భావన. ఆరెస్సెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చరిత్ర పుస్తకాల్లో చేసిన మార్పులు దీనికి ఉదాహరణలు. ఇటీవల రాజస్థాన్‌లో హల్దీఘాట్ యుద్ధ చరిత్రను పూర్తిగా మార్చేసి రాశారు. అక్బర్ గెలిచిన చారిత్రక సత్యాన్ని పక్కన పడేసి మహారాణా ప్రతాప్ గెలిచాడన్నారు. హిందూరాజులు ధైర్యసాహసాలతో పోరా డడం గురించి చెబితే ఆరెస్సెస్‌కు సరిపోదు. యుద్ధాలు జరిగితే అందులో హిందూ రాజులే గెలిచేలా చరిత్ర ఉండాలి. ముస్లిం రాజుపై ప్రతి యుద్ధంలోను హిందూ రాజు గెలిచిన చరిత్రే కావాలి. ఇంతకు ముందు గుజరాత్‌లో బిజెపి అధికారంలో ఉన్నప్పుడు 1995లో కేశూభాయ్ పటేల్ ప్రభుత్వం పాఠ్య పుస్తకాల్లో ముస్లిములు, క్రైస్తవులు, పార్శీలను విదేశీయులుగా చూపించడం జరిగింది. క్రయిస్తవ ఫాదరీల గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు పాఠ్యపుస్తకాల్లో చేర్చారు. స్కూలు పాఠ్యపుస్తకాల్లో ఇలాంటి మతతత్వ ప్రచారం చాలా విషాదకరమైనది, ఆందోళనకరమైనది. బిజెపి పరిపాలన, ప్రగతి అనే అంశాల పట్ల శ్రద్ధ చూపే బదులు కాషాయ పార్టీ అనగానే గుడ్డిగా ఓటువేసే మనస్తత్వం ప్రజల్లో సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. బిజెపి ప్రభుత్వం నెహ్రూ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించడం అంటే సెక్యులరిజం, అందరిని కలుపుకుపోవడం వంటి విలువలకు తిలోదకాలు ఇవ్వడం మాత్రమే కాదు, సైంటిఫిక్ టెంపర్ (శాస్త్రీయ చైతన్యం)కు కూడా వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. వినాయకుడికి మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ జరిగిందని పిల్లలు నమ్మడం బిజెపికి కావాలి. అంటే ఆ విధంగా ముస్లింలు ఇక్కడికి రాకముందు దేశంలో గొప్ప సంస్కృతి ఉందన్నది అందరూ నమ్మడమే బిజెపికి కావాలి. ప్రతి పార్టీ తన ప్రయోజనాలకు అనుకూలమైన చారిత్రక అంశాలను మాత్రమే ప్రస్తావిస్తుందన్నది నిజ మే, కాని బిజెపి మాత్రం తన ప్రయోజనాలకోసం అవసరమైన చరిత్రను తయారు చేస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో హిందువులు దాదాపు 80% ఉంటారు. ముస్లిములు దాదాపు 14.25% ఉన్నా రు. క్రైస్తవులు 2.3% ఉన్నారు. అందరికీ భారత రాజ్యాంగం సమాన హక్కులిచ్చింది. కేవలం హిందువులకు అధిక ప్రాముఖ్యం ప్రాధాన్యత కట్టబెట్టే ఏ ప్రయత్నమైనా రాజ్యాంగానికి వ్యతిరేకమైనది. మహేష్ శర్మ నియమించిన కమిటీ ఇచ్చే నివేదిక ఏమిటన్నది వేచి చూడవలసిందే. కాని భారత ప్రభుత్వమంటే అది దేశంలోని అన్ని మతకులవర్గాల ప్రజలందరి ప్రభుత్వం. ఏదో ఒక సముదాయం ప్రయోజనాలు, ప్రాబల్యం, ఔన్నత్యం గురించి మాత్రమే మాట్లాడడం అన్నది రాజ్యాంగ స్ఫూర్తి కానే కాదు.

* (డైలీ ఓ కథనం)