Home తాజా వార్తలు రే జంతుశాల

రే జంతుశాల

elephant

సింగపూర్ తరహాలో హైదరాబాద్‌లోని కొత్వాల్‌గూడలో ఏర్పాటుకు సన్నాహాలు
125 ఎకరాల విస్తీర్ణం, అరుదైన వాటితో సహా 150 జంతువులు, ట్రామ్‌లు, ట్రెయిన్‌లు

మన తెలంగాణ/ హైదరాబాద్ సిటీబ్యూరో : నగర పర్యాటకులకు, జంతు ప్రేమికులకు శుభవార్త. ప్రపంచ స్థాయిలో అరుదైన జంతుజాలాన్ని తిలకించేందుకు నైట్ సఫారీ నగర శివారులో అందుబాటులోకి రానున్నది. సింగపూర్‌లోని నైట్ సఫారీని తలదన్నే విధంగా కొత్వాల్‌గూడలో దీనిని ఏర్పాటు చేసేందుకు హెచ్‌ఎండిఎ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. వచ్చే సెప్టెంబర్ మా సాంతానికి నైట్ సఫారీ నమూనాలు, అందులో ఉండే వసతులు, మార్గాలు, రవాణా సదుపాయాలు, విడిదిల గుడారాలకు సంబంధించి పూర్తి నివేదిక రూపొందనుంది. అనంతరం టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని హెచ్‌ఎండిఎ భావిస్తున్నది. నగరానికి తాగు నీరందిస్తున్న జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్‌సాగర్ తీరాన, గండిపేట మండలం కొత్వాల్‌గూడలోని 50 హెక్టార్లలో ఈ నైట్ సఫారీ ఏర్పాటు చేయడం ఖరారైంది. మొత్తం 125 ఎకరాల్లో దీనిని అత్యంత ఆధునికంగా, వినోదాత్మకంగా, సౌలభ్యంగా తీర్చిదిద్దాలని అథారిటీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. సుమారు రూ. 200 కోట్లుపైబడే అంచనా వ్యయంతో దీనిని తీర్చిదిద్దాలని హెచ్‌ఎండిఎ నిర్ణయించింది.
నైట్ సఫారీ ఇలా : కేవలం రాత్రివేళల్లోనే సాధారణ జంతుజాలంతో పాటు అరుదైన జంతువులను తిలకించడం, ఆ ప్రదర్శన శాలలో విహరించడనికి, అందులో తిరుగుతూ నూతన అనుభూతిని ఆస్వాదించడం కోసం ప్రత్యేకంగా జంతుశాలలను నిర్మిస్తారు. అందుకు కావాల్సిన అన్నిరకాల ఏర్పాట్లు ప్రత్యేక సాంకేతికత పరిజ్ఞానంతో నిర్వాహణ, ప్రయాణపు వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తారు.
కొత్వాల్‌గూడ నైట్ సఫారీ: 125 ఎకరాలు విస్తీర్ణం. ఇందులో 140 జాతులకు చెందిన జంతుజాలం ఏర్పాటు ప్రతిపాదన. అంచనా వ్యయం సుమారు రూ. 150 కోట్లు. సందర్శకులు కనీసంగా ఒక గంట అందులో తిరిగేట్టుగా మార్గాల కల్పన. సఫారీలో తిరిగేందుకు ట్రామ్ లేదా ట్రాయ్ ట్రేన్. ఆహార కేంద్రాలు. సేదతీరేందుకు పచ్చికబయలు. విడిదికి ప్రత్యేకంగా రూపొందించే గుడారాలు ఉంటాయి.
సింగపూర్ నైట్ సఫారీ : 40 హెక్టార్ల (99 ఎకరాలు)విస్తీర్ణం. 1,040 జంతువులు. 120 జాతులు. ప్రతిఏటా సందర్శకులు 11 లక్షలు. ప్రధాన ప్రదర్శనలు 59 ఉన్నాయి.