Home అంతర్జాతీయ వార్తలు ఉ.కొరియాతో శాంతికి రంగం సిద్ధం

ఉ.కొరియాతో శాంతికి రంగం సిద్ధం

int

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశాభావం.. చర్చల తేదీ త్వరలో ఖరారు

వాషింగ్టన్ : ఉత్తర కొరియాతో రాజీ ఒప్పందం కుదిరే దశలో ఉందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ రాజీ ప్రక్రియ కుదిరితే అది ప్రపంచానికి మంచి పరిణామమే అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ చర్చలకు రావల్సిందని చేసిన ఆహ్వానాన్ని ట్రంప్ మన్నించడం అంతర్జాతీయంగా విస్మయం కలిగించింది. ఒక రోజు క్రితమే తాను కిమ్‌ను కలుసుకునేందుకు సిద్ధం అని ట్రంప్ చెప్పారు. ఈ తరుణంలోనే వాషింగ్టన్ పోస్టు పత్రిక ఈ పరిణామాలపై ప్రత్యేక కథనం వెలువరించింది. సంఘర్షణ పథం వీడి, ఉత్తర కొరియాతో శాంతికి జరిగే చర్చల ఖరారు గురించి వైట్‌హౌజ్ వర్గాలు యత్నిస్తున్నాయని పత్రిక తెలిపింది. వీటని ఎప్పటికప్పుడు ట్రంప్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ఇరువురు నేతల చర్చల తేది వేదిక త్వరలోనే ఖరారు అవుతుందని తెలిపారు. ప్రపంచానికి చాలా కాలంగా ఉత్తర కొరియా, అమెరికా మధ్య ఘర్షణాయుత వాతావరణం ఆందోళనకరంగా మారింది. శాంతి చర్చలకు తాను ఎక్కువగా చొరవ తీసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తమ ట్విట్టర్‌లో కూడా తెలిపారు. చర్చలతో ఉత్తర కొరియా అణు కార్యక్రమాలకు కొంత బ్రేక్ పడితే అది ఖచ్చితంగా ప్రపంచ శాంతికి దారితీస్తుందని ట్రంప్ యోచిస్తున్నారు. ఇది తనకు ప్రయోజనం కల్గిస్తుందని అనుకుంటున్నారు. ఈ అంశంపై ఏ విధమైన ప్రతిష్టంభన ఏర్పడినా అది కేవలం కిమ్‌కు లాభిస్తుందని, ఇదే సమయంలో అమెరికా మిత్రపక్షాలలో చీలికకు దారితీస్తుందని, తనకు చిక్కులు తెచ్చిపెడుతుందని ట్రంప్ ఆందోళన చెందుతున్నారని పత్రిక రాసింది. సముచిత దౌత్యప్రక్రియ దిశలో ట్రంప్ వ్యవహరిస్తున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ విశ్లేషించింది. ప్రోటోకాల్‌ను పక్కకు పెట్టి ట్రంప్ చొరవ తీసుకుంటున్నారని, కిమ్‌తో భేటీకి సిద్ధపడ్డారని తెలిపింది. ప్యాంగ్‌గాంగ్ తమ అణుమౌలిక అంశాలపై స్పష్టత ఇవ్వకముందే, అమెరికా అధికార యంత్రాంగం ప్రతినిధులు ఈ దిశలో వివరణలు తీసుకోక ముందే చర్చలకు ట్రంప్ సమ్మతి తెలిపారని పత్రిక పేర్కొంది. అయితే చర్చలు పెద్దగా ఫలించబోవని ట్రంప్ సన్నిహితులే అపనమ్మకంతో ఉన్నారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. అత్యున్నత స్థాయి దౌత్య ముఖాముఖీ చాలా ఇరకాటంలోకి నెడుతుందని, దీని వల్ల ఏ విధమైన పరిణామాలు ఉంటాయనేది తెలియదని విశ్లేషించారు. కిమ్ సందేశం కేవలం దక్షిణ కొరియా ద్వారా ట్రంప్ అందుకున్నారు. ఈ దశలో ట్రంప్ నేరుగా కిమ్ నుంచి వైఖరి తెలుసుకోవల్సి ఉందని పత్రిక అభిప్రాయపడింది. ఉత్తర కొరియా విషయంలో ఇతరత్రా చర్యల దశలో శాంతి చర్యల ప్రక్రియ విపరీత పరిణామాలకు దారితీస్తుందని సెనెట్‌లో సైనిక బలగాల వ్యవహారాల కమిటీ సభ్యులు డన్ సులివన్ తెలిపారు. నెలల నుంచి అన్ని కోణాల స్థాయిలలో అమెరికా ఉత్తరకొరియాపై ఒత్తిడి పెంచింది. అమెరికా కటుతర అంక్షలు విధించింది. మరోవైపు ఐరాస నుంచి కూడా అదనపు ఆంక్షల తీర్మానం వెలువడింది. ఈవిధంగానే కాకుండా పటిష్ట సైనిక చర్యకు కూడా మార్గం ఏర్పడింది. ఇక చైనా నుంచి కూడా ఉత్తర కొరియాపై ఒత్తిడి ఆరంభం అయింది. ఈ పరిణామాలు అన్నీ కూడా ఉత్తర కొరియాను దారికి తెచ్చే దిశలోనే ఉన్నాయని అయితే ఇప్పటి ప్రతిపాదనతో పరిస్థితి మొదటికి వస్తుందని అనుమానాలు వ్యక్తం చేశారు.