Search
Wednesday 14 November 2018
  • :
  • :

“రైతు బంధు”కు రంగం సిద్ధం

field

*ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఊరట
*మూడు విడుతల్లో చెక్కుల పంపిణీ

మన తెలంగాణ/ఆసిఫాబాద్ : ప్రభుత్వం రైతులకు ఎకరాకు నాలుగు వేల రూపాయల చొప్పున అందించనున్న పెట్టుబడి సహాయానికి రంగం సిద్దమైంది. మూడు విడుతలుగా రైతులకు చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్, మే నెలల్లో పంపిణీ చే యాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నేరుగా రైతులకే అందించాలని నిర్ణయించారు. భూప్రక్షాళన కార్యక్రమంలో వ్యవసాయ భూములు రైతుల లెక్కలను రెవెన్యూ అధికారులు ఇప్పటికే తెలిపారు. లెక్కల ప్రకారం గ్రామాల వారీగా రైతులకు పెట్టుబడి సాయం చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఒక్కేసారి చెక్కులు పంపిణీ చేయడంతో బ్యాంకుల్లో నగదు సమస్యతో పాటు ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున మూడు విడుతలుగా పంపిణీ చేయడానికి నిర్ణయించారు. అల్ఫాబెటికల్ ప్రకారంగా గ్రామాల్లో తొలిదశలో చెక్కుల పంపిణీ చేపట్టిన తర్వాత రెండు, మూడు విడుతల్లో అన్ని గ్రామాల్లో పంపిణీ చేస్తారు. పంపిణీ పక్రియ నెల రోజుల లోపు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. గతంలో కేవలం సాగు చేసే భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని సూచించగా, సాగుతో సంబంధం లేకుండా రెవెన్యూ రికార్డుల ప్రకారం అసైన్డ్ భూములను మినహాయించి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇటీవల భూప్రక్షాలన కార్యక్రమం ద్వారా చేపట్టిన సర్వే ప్రకారం పంట సాగు చేసుకోవడానికి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్టుబడి ప్రధాన సమస్య కావడం సాగు అవసరాల కోసం బ్యాంకులు రుణాలు అందించకపోవడంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సివస్తుంది. అసలు వడ్డీల వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. బ్యాంకులు అందించే పంట రుణాలతో సంబంధం లేకుండా సాగు చేసే ప్రతిరైతుకు వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం అమలు చేసేందుకు నిర్ణయించింది. అసైన్డ్ భూముల్లో వాస్తవ లబ్ధిదారులు సాగు చేస్తున్న వివరాలు అందంచాల్సివుంది. ప్రస్తుతానికి రికార్డులు ఉన్నవారికి సహాయం అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో లక్షమందికి పైగా రైతులకు లబ్ధిదారు పొందనున్నారు. జిల్లాలో ఎక్కువ మంది సన్నకారులు రైతులు ఉన్నారు.

పత్తిపంటనే సాగుచేస్తుంటారు. పంట చేతికి వచ్చే వరకు పెట్టుబడి అవసరం ఎక్కువగా ఉంటుంది. బ్యాంకుల రుణాలు సరిపోకపోవడంతో రైతులు దళారులను అశ్రయించాల్సిపరిస్థితి నెలకొంది. రైతుల పరిస్థితుల అసరగా చేసుకొని వడ్డీ వ్యాపారులు రైతులను దోసుకుంటున్నారు. వర్షకాలం కంటే ముందుగానే రైతులకు పెట్టుబడి సహాయం అందుతే రైతుకు దుక్కులతో పాటు విత్తనాలు విత్తుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వం పంటసహాయ పక్రియను వేగవంతం చేసింది. సాగు విస్తరణతో సంబందం లేకుండా రైతులకు పెట్టుబడి ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయిస్తే జిల్లాలో లక్షమందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూరనుంది. రైతులకు పెట్టుబడి కింద ప్రభుత్వం ఇచ్చే చెక్కులను ఏ బ్యాంకులోనైన ఏర్పాటు చేసుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో ఐదు బ్యాంకుల్లో చెక్కుల పంపిణి ఏర్పాటు చేశారు. బ్యాంకు పేరుతో ఇచ్చే చెక్కులను ఆ బ్యాంకుకు సంబందించిన ఏ శాఖలోనైన మార్చుకునే అవకాశం ఉంటుంది. రైతులకు ఆ బ్యాంకులో ఖాత లేకపోయిన నగదు కూడా తీసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. చెక్కు ఇచ్చిన 90 రోజుల్లో నగదుగా మార్చుకోక పోతే అది ల్యాప్స్ అయ్యే అవకాశం ఉంది. గ్రామసభల ద్వారా చెక్కులను రైతులకు వారి వారి గ్రామాల్లో నేరుగా రైతులకే చెక్కులను అందజేస్తారు. అక్కడికి రాని వారు తహసీల్దార్ , వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆమోదంతో వారం లోగా తీసుకోవాల్సివుంటుంది. చెక్కులు తీసుకొని రైతుల చెక్కులను వ్యవసాయ కమీషనర్ కార్యాలయానికి వెనక్కి పంపిస్తారని అధికారులు పేర్కొంటున్నారు.

Comments

comments