Home కలం పత్రికా నీలమణి యం.యస్. ఆచార్య

పత్రికా నీలమణి యం.యస్. ఆచార్య

thatha

పత్రికా రంగంలో కలికితురాయి, ధ్రువతారగా వెలిగిన పేపర్ బాయ్ నుండి పత్రికా సంపాదకుడిగా ఎగబ్రాకిన ధీరోదాత్తుడు మాడభూషి శ్రీనివాసాచార్యులు. తెలంగాణలో కాకతీయ రాజధాని వరంగల్లు నుండి 1958లో వెలువడిన ‘జనధర్మ’ వారపత్రిక సంపాదకుడు ఈ యం.యస్. ఆచార్య.
ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు గ్రామంలో శ్రీవైష్ణవ కుటుంబం వేంకట నర్సమ్మ, ప్రసన్న రాఘవాచార్యుల దంపతులకు 03.10.1924న మాడభూషి శ్రీనివాసాచార్యులకు జన్మించారు. వారి మాతామహులు సూర్యాపేట. ప్రసన్నరాఘవాచార్యులు గ్రామంలో పౌరోహిత్యం ప్రబంధ ప్రవచనాలతో జీవనమును వెళ్లదీసేవారు. అందువలన యం.యస్. ఆచార్య విద్యాభ్యాసం విడతులుగా సాగింది. ఆయన ఇంటర్మీడియెట్ తదుపరి బి.ఎ. ప్రథమ సంవత్సరంతో ఆగిపోయింది. నెల్లికుదురు నుండి వారి కుటుంబం వరంగల్లుకు వచ్చింది.
యం.యస్. ఆచార్య ఆంగ్ల పత్రికలో విలేకరిగాను, ఆంధ్రపత్రిక దిన పత్రికకు విలేకరిగాను, ఏజెంటుగా జీవితమును ఆరంభించారు. ఆ కాలంలో ఆయన వేతనం రూ. 40/-లు. ఆ పత్రిక ఉన్నంత కాలము ఆ వేతనము ఆయనకు అందుతూనే ఉండేది. ఈయన ఆ పత్రిక సర్కులేషన్ ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. నిజాం వ్యతిరేకోద్యమములో రజాకార్లకు ఎదురుగా నిలిచిపోరాడారు. మామునూరు విమానాశ్రమంలో నిజాం నుండి వచ్చే సామాగ్రి సమాచారమును మాటువేసి సేకరించి, అలాగే ఉద్యమ కారులు సర్దార్ గౌతు లచ్చన్న, వందేమాతరం లాంటి నాయకుల నుండి వచ్చిన సమాచారమును, కరపత్రాలను అందుకొని ఆంధ్రపత్రికలో పెట్టి స్థానిక నాయకులకు, వరంగల్ జైలులో ఉన్న నాయకులకు (కొరియర్‌గా) సాహసోపేతముగా చేరవేసే వారు. ఈ సందర్భంగా ఒకసారి వరంగల్లు ఇంతేజార్ గంజ్ పోలీస్‌స్టేషన్ దగ్గర రజాకార్లకు చిక్కగా వారు కొడుతుంటే ప్రజలు కదలడంతో ఆయనను వదిలేసినారు. ఆయనలో కళాకారుడు అప్పుడప్పుడూ బయటకు వస్తుండేవాడు. కొన్నికొన్ని సందర్భాలలో ఆయనలోని బహుముఖీనత రేఖా మాత్రంగా ప్రదర్శితమవుతుండేది.
యం.యస్. ఆచార్య బాల్యంలో అమ్మమ్మగారింటికి (సూర్యాపేటకు) దేవులపల్లి వేంకటేశ్వర రావు (డి.వి.) తరచుగా వస్తుండడము వలన వారి ప్రభావముతో కమ్యూనిజమ్, నిజాంపై పోరాట దృక్పథము తెలియకుండానే పడింది. అంతేకాదు దేవులపల్లితో మారుమూల గ్రామాల పర్యటనలను చేశారు. ఆ తదుపరి హిందూసేవ సంఘ నాయకుడు ఉమార్జికర్, నాగపూర్ ఆర్.ఎస్.ఎస్. సైనిక శిక్షకులు డా॥ వలూరాజీలతో సహచర్యం, ప్రముఖ జర్నలిస్టు మాకేపల్లి తాతాచారితో చర్చలు వారిలో సైద్ధాంతిక తాత్విక భూమిక రూప కల్పనకు ప్రేరణగా నిలిచాయి. తెనాలిలో వావిలాల గోపాల కృష్ణయ్య దగ్గర జర్నలిజంలో శిక్షణను కూడా తీసుకున్నారు.
పత్రికా రంగానికి రావడానికి ముందు 1942 హైదరాబాద్‌లో రాజగోపాల్ మొదలియార్ ఆధ్వర్యంలో బుక్కపట్నం రామానుజాచార్యుల సంపాదకత్వం మన తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుండి “తెలంగాణ” పత్రిక ప్రారంభమైంది. ఆ పత్రికలో ఆచార్య రాసిన వార్తలు ప్రచురితమై ఆయనకు ప్రోత్సాహం అందించాయి.
పత్రికా రంగంలోని అనేక విషయాలపట్ల ఉన్న అవగాహన, ప్రస్తుత సమాజానికి తను చేయదలచుకున్న సేవలకు పత్రికా నిర్వహణ ఒక్కటే మార్గమని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా వారి మిత్రులు బిట్ల నారాయణ రవి వర్మఫోటో స్టూడియోలో నలుగురు మిత్రులు శంకర రావు, డి.వై.ఎన్. చార్యులు, దివ్వెల హనుమంతరావులతో యం.యస్. ఆచార్య సమావేశమై పత్రికను ప్రచురించాలని నిర్ణయం తీసుకున్నారు. పత్రిక పెట్టాలనే ఆలోచన వచ్చిందే తడువుగా “జనధర్మ” అని నామకరణం చేశారు. ఈ నలువురి భాగస్వామ్యం ఏడెనిమిదేళ్ల వరకు సాగింది. దీనికి సంపాదకులు యం.యస్. ఆచార్య. జనధర్మ 1958 నవంబర్ 28న పురుడుపోసుకుంది. అనవరత జాగృతియే ప్రజాస్వామ్య సుస్థిరతకు మూలాధారమనే నినాదంతో, వార్తా నేపథ్యంతో వెలువడినదీ పత్రిక. మాడభూషి శ్రీనివాసాచార్యులు (యం.యస్ ఆచార్య)ని వరంగల్లు ప్రజలు ఆంధ్రపత్రిక ఆచారిగాను, జనధర్మ అయ్యగారు గానూ పిలుచుకునేవారు. ఈ పత్రిక రూపు లేఖల్ని కుంచెతో రూపుదిద్దిన వారు భట్టు కిషన్ సింగ్. 1971లో పత్రిక నిమిత్తం బాలాజీ ప్రింటింగ్ ప్రెస్‌ను ఏర్పాటు చేసుకునే వరకు పత్రికను ఇతర ప్రెస్‌లలో ముద్రించారు.
1978లో జనధర్మకు ద్వైవార పత్రికగాను, జనధర్మ కొన్ని సంచికలను ద్వైమాసికంగాను, 1980లో జనధర్మకు అనుబంధంగా వరంగల్ వాణి దినపత్రికను ప్రారంభించారు. ఆదివారం మాత్రం ‘జనధర్మ’ సంచిక వచ్చేది. 1960-70లలో ఆచార్యుల ఆలోచనా ధోరణి, రాతల ప్రభావం, ఉద్యమాలు, ఉద్యమ శక్తులపట్ల తాదాత్మకతతో వృత్తికి భంగం కాని ఏ ఉద్యమాన్ని కూడా వదలకుండా కలంపట్టి పత్రిక ద్వారా వెల్లడించారు. జనధర్మ పత్రిక ప్రజాస్వామ్యంలో నిర్భయంగా తనకు తోచిన, తాను నమ్మిన నిజం చెప్పడం, ప్రజా చైతన్యాన్ని తట్టి లేపడం, జరుగుతున్న పరిణామాలను ప్రజలకు విశదపరచడం, ప్రజల అవసరాలకు అనుగుణంగా వారి వర్తమాన భవిష్యత్ యోగ క్షేమాల్ని అల్లంత దూరం నుంచే దర్శించి అవగాహన చేసుకుని, ఒక నిర్దిష్ట, నిర్దుష్టమయ మార్గాన్ని నిరూపించే ప్రయత్నం చేసింది. ఇలాంటి విషయాల్లో బాధ్యతాయుతంగా ప్రవర్థించడమే నిర్దేశించుకొనబడింది. “ఇదీ వరంగల్లు”నగరం శీర్షికన వరంగల్ నగరం ఎలా ఉంది? ఎలా ఉండాలి? అలా ఉండకపోవడానికి కారణభూతులైన అధికారుల నిర్లక్షం గురించి నాయకుల అశ్రద్ధ గురించి వరుసగా సమస్యల తోరణాలు వెలువడేవి. ఇట్టి సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించే జిల్లా, పట్టణ, స్థానిక నాయకత్వం గురించి జనధర్మలో ఎత్తి పొడుపులతో కూడి ఘాటైన విమర్శలతో కూడిన రచన ద్వారా ఆవేదన ఆక్రోశాన్ని వెళ్లగక్కేవారు.
తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అందుకు కేంద్రమైన వరంగల్లు అభివృద్ధి చెందాలని, దాని కనుగుణ్యమైన రీతిల స్థానిక నాయకత్వం అభివృద్ధి చెందాలనే దృక్కోణంతో అనేక వ్యాసాల్ని, వార్తా విశ్లేణల ద్వారా వివిధ కలం పేర్లతో జనధర్మ వార్తా ప్రచురణలో ముందడుగు వేసిందని చెప్పవచ్చును.
జనధర్మ సామాజిక సమస్యలనెన్నింటినో వెలుగులోకి తెచ్చి పరిష్కార మార్గాలను సూచించింది. వరంగల్‌లో పోలీసు యాక్షన్‌కు పూర్వం జాతీయ పతాక వందన సందర్భంగా మొగిలయ్యను దుండగులు హత్య చేశారు. ఈ సంఘటనలో క్షతగాత్రులైన కూచన మల్లేశం, ఆడెపు కైలాసం, బత్తిని మొగిలయ్య, వెంకటయ్య మిత్రులందరినీ హాస్పిటల్‌లో చేర్చినపుడు వారికి గాయాలైన విషయాన్ని, ప్రభుత్వ నిర్లక్షాన్ని బహుళంగా రాసి ప్రభుత్వం వారిపట్ల శ్రద్ధ తీసుకునేటట్టు చేసిన ఘనత ఎం.ఎస్. ఆచార్య రాతలదే. అంతేకాకుండా ఆకునూరు, మాచిరెడ్డి, పాలెంలో జరిగిన ఉదంతాలను ప్రచురించి మహిళల ఆదరాభిమానాలను చూరగొన్నది జనధర్మ పత్రిక.
వరంగల్లులోని విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాల, అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాల, సింహాద్రి బాగ్ కళాశాల, ముదిగొండ శంకర శాస్త్రిచే స్థాపించిన దుర్గేశ్వర సంస్కృతాంధ్ర మహిళా కళాశాల సమస్యలను వెలుగులోకి తెచ్చి వాటికి పరిష్కార మార్గాలకు బాటలు వేసినారు. అవే కాకుండా ఆజంజాహి మిల్లు సమస్యలు, కార్మికుల ఇక్కట్లు, కల్లుగీత సహకార పారిశ్రామిక ఉద్యమం దానిలో భాగంగా జరిగిన సత్యాగ్రహాలు మొదలగు వార్తలు ప్రచురించడంలో జన ధర్మ ప్రముఖ పాత్ర వహించింది. జనధర్మ సామాజిక సేవతో పాటు సమస్యలనెన్నింటినో వెలుగులోకి తెచ్చి పరిష్కార మార్గాలను సూచించింది. వరంగల్‌కు మంచినీటి సమస్యను పరిష్కరించిన కాకతీయ కాలువ, కాకతీయ విశ్వ విద్యాలయం స్థాపన, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం, మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు తెప్పించడం లాంటి అనేక అభివృద్ధి పనులు సాధించడంలో జనధర్మ కృషి చేసిందని చెప్పవచ్చు. అలాగే ఈ పత్రిక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం సాధించేంత వరకు కాలంతో యుద్ధం చేసింది. వరంగల్లులో సామాజిక చైతన్యానికి వేదిక అయిన ఈ పత్రిక పలు విద్యా సంస్థలు, వివిధ ప్రజా సంక్షేమ కేంద్రాలు నెలకొనడానికి భూమికగా నిలిచింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అవినీతిని తొలగించి ప్రజలకు మేలు కలిగించడంలో మార్గదర్శిగా నిలిచింది. ఎమర్జెన్సీ కాలంలో జనధర్మ పత్రికలో ప్రచురింపబడిన ఒక వ్యంగ్య వ్యాసం కలెక్టర్ స్థాయిలో పెద్ద చర్చనీయాంశమైన నూలు పెట్టెలకు ఇచ్చే పర్మిట్ల కుంభకోణాన్ని పరిశోధించి, వాస్తవాలను బయటపెట్టినందుకు జనధర్మ పత్రిక దశాబ్ద కాలం అన్ని వేధింపులకు గురైనా, ప్రజా సమస్యలపై అక్షరాయుధాన్ని వీడలేదని నిర్మోహమాటంగా చెప్పవచ్చు. అనేక సమస్యలపై అధికార యంత్రాంగాన్ని మేలు కొలిపిందని చెప్పవచ్చు. జనధర్మ పత్రిక, వరంగల్ వారి సామాజిక అంశాలతో పాటు జాతీయ, రాష్ట్ర, జిల్లా , స్థానిక పరమైన వివిధ స్థాయిలకు సంబంధించిన వార్తాంశాలను నిజాయితి, నిబద్ధత, నిర్భీతితో హాస్య, వ్యంగ్య, పదునైన ఘాటైన శీర్షికలతో ప్రచురించి భావితరాలకు భవిష్య దర్శినిగా నిలిచిందని చెప్పవచ్చు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రచురించడం వలన యం.యస్. ఆచార్య అనేక విధాలైన ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఈ పత్రిక పెట్టుబడుదారుల సహాయ సహకారాలుగాని, వర్గ రాజకీయాల అండదండలుగాని ఆశించకుండా తనదైన రీతిలో ప్రజాస్వామ్య పరిరక్షణకు వారధిగా నిలిచిందని చెప్పవచ్చు. ఈ పత్రిక సాహిత్యానికి కూడా సముచిత స్థానాన్నిచ్చి ఎందరో సాహిత్యవేత్తలకు తమ తమ సృజనాత్మకతను ప్రతిబింబించుటకు తోడ్పడింది.
జనధర్మ పత్రికను స్థాపించి ప్రారంభించిన సందర్భంలో తొలినాటి సంపాదకీయం (27-11-1958)లో తన ధ్యేయాన్ని, పత్రిక యొక్క గమనాన్ని చాటి చెప్పారు. “ప్రజాస్వామ్య సుస్థిరతకు పత్రికలు ప్రధాన సాధనాలు, పార్టీలుగా ఏర్పడి ఎన్నికల్లో అభ్యర్థులను నిలుపడం, ఓట్లు వేయడం వంటి పనులు మాత్రమే ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ప్రజాస్వామ్యం ఒక స్వతంత్ర దేశ ప్రజల జీవన విధానం. ఈ విధానంలో అధికారపు పెనుగులాటతో నిమిత్తం లేని అపారమయిన సమాజం తన జీవనానికి, విలువలకు, విశ్వాసాలకు, భద్రత నిచ్చే సాంఘిక వ్యవస్థ నిర్మాణానికి పురోగమించాల్సి ఉంది. అంతేకాదు జనధర్మను తమ వాణీ ప్రసార యంత్రంగా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి.” అని అన్నారు.

డా॥ టి.శ్రీరంగస్వామి
9949857955