Home జాతీయ వార్తలు ఉర్జిత్ పటేల్ ఉక్కిరిబిక్కిరి

ఉర్జిత్ పటేల్ ఉక్కిరిబిక్కిరి

Urjith-patel

పార్లమెంట్ కమిటీ ఎదుట ఒత్తిడికి లోనైన ఆర్‌బిఐ గవర్నర్
ఆదుకున్న మన్మోహన్ సింగ్
రూ.9.2 లక్షల కోట్ల కొత్త నోట్లు జారీ చేశాం
రద్దు చర్చలు గత జనవరిలోనే మొదలయ్యాయన్న ఉర్జిత్

న్యూఢిల్లీ: నోట్ల రద్దుపై పార్లమెంటరీ స్టాండిం గ్ కమిటీ ప్రశ్నలకు ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సరైన సమా ధానమివ్వలేకపోవడంతో పార్లమెంటరీ స్టాం డింగ్ కమిటీ సభ్యుల నుంచి ఆయన విమర్శల ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓ దశలో సభ్యుల కఠినమైన ప్రశ్నలతో ఉర్జిత్ ఒత్తిడికి లోనవ్వ గా.. ప్యానెల్ సభ్యుల్లో ఒకరైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జోక్యం చేసుకుని ఆయన్ని కాపాడారని అధికార వర్గాలు పేర్కొంటున్నా యి. బుధవారం కాంగ్రెస్ నాయకుడు వీరప్ప మొయిలీ సారథ్యంలోని ఈ కమిటీ ఎదుట ఉర్జిత్ హాజరయ్యారు. డిమానిటైజేషన్ (నోట్ల రద్దు), ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం, నగదు కొరత సమస్యను పరిష్కరించేందుకు ఆర్‌బిఐ తీసుకున్న చర్యల గురించి పార్లమెంటరీ ప్యా నెల్‌కు ఉర్జిత్ వివరించారు. నోట్ల రద్దుపై చర్చ 2016 జనవరి నెలలోనే ప్రారంభమైందని, ఇప్పటివరకు సుమారు రూ.9.2 లక్షల కోట్ల కొత్త నోట్లను జారీ చేశామని పటేల్ చెప్పినట్టు తెలుస్తోంది.

నోట్ల రద్దు నిర్ణయంలో ఆర్‌బిఐ పాత్ర, నల్లధనం  వసూళ్లు, విత్ డ్రా పరిమితిపై ఆంక్షలు వంటి పలు విష యాలపై సమాధానం చెప్పాల్సిందిగా పార్లమెంట్ స్టాం డింగ్ కమిటీ ఉర్జిత్ పటేల్, ఆర్థికమంత్రిత్వ శాఖ అధికా రులను ఆదేశించింది. ఇదే విషయంపై వివరణ ఇవ్వా ల్సిందిగా ప్రజాపద్దుల కమిటీ(పిఎసి) కూడా వారికి నోటీసులు జారీచేసింది. కెవి థామస్ అధినేతగా ఉన్న పిఎసి ముందు వీరు శుక్రవారం హాజరుకావాల్సి ఉంది.

సమాధానమివ్వలేకపోయారు..

పార్లమెంటరీ ప్యానెల్ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఉర్జిత్ సమాధానాలిచ్చారు. రూ.500, వెయ్యి నోట్ల రద్దు తర్వాత ఎంత నగదు బ్యాంకులకు జమ అయిందో తెలియదని చెప్పారు. రద్దైన మొత్తం పెద్దనోట్ల విలువ రూ.15.44 లక్షల కోట్లు కాగా, రూ.9.2లక్షల కోట్ల కొత్త నోట్లు చలామణిలోకి వచ్చాయని వెల్లడించారు. నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్‌బిఐ ఎలాంటి చర్యలు తీసుకుంది, ఆర్థిక వ్యవస్థపై ఏ మేర ప్రభావం ఉంది తదితర విషయాలను ఉర్జిత్ పటేల్ ఎంపిలకు వివరించారు. నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు ఎంత నగదు వెనక్కి వచ్చిందని అనే ప్రశ్నకు పటేల్ సమాధానమివ్వలేదని ప్యానెల్ సభ్యుడు, టిఎంసి ఎంపి సౌగత్ రాయ్ అన్నారు. బ్యాంకుల్లోకి వచ్చిన పాత నోట్ల విలువ ఎంతో చెప్పలేకపోయారని అన్నారు.

ఆదుకున్న మన్మోహన్ సింగ్

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను ఆదుకున్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పద్దని పటేల్‌కు సలహా ఇచ్చారని తెలుస్తోంది. నగదు విత్‌డ్రాపై పరిమితి, ఎత్తివేతపై కాంగ్రెస్ ఎంపి దిగ్విజయ్ సింగ్ ప్రశ్నలు సంధించారు. నగదు విత్‌డ్రాయల్స్‌పై ప్రస్తుతం కొనసాగిస్తున్న ఆంక్షలను ఒకవేళ తొలగిస్తే గందరగోళాలన్నీ తొలగిపోతాయా? 50 రోజుల్లో ఎన్ని పాత కరెన్సీ నోట్లు వెనక్కి వచ్చాయంటూ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఉర్జిత్ పటేల్‌ను ప్రశ్నించి ఒత్తిడికి గురిచేసింది. మన్మోహన్ సింగ్ మధ్యలో కల్పించుకుని ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పవద్దని ఉర్జిత్‌కు సలహా ఇచ్చారని సమాచారం. మన్మోహన్ సలహా మేరకు రద్దయిన ఎన్నినోట్లు వెనక్కి వచ్చాయి? నగదు పరిస్థితి ఎప్పుడు సాధారణ పరిస్థితికి వస్తుందనే దానిపై ఉర్జిత్ పటేల్ సమాధానం ఇవ్వలేదు.

మొయిలీ సారథ్యంలో కమిటీ

కాంగ్రెస్ నాయకుడు వీరప్ప మొయిలీ సారథ్యంలోని ఈ కమిటీ ముందు ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక సేవలు, రెవెన్యూ విభాగాలతో ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతినిధులు హాజరై వివరాలు అందించారు.  ఈ సమావేశంలో ఐబిఎ(ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్), ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), పిఎన్‌బి(పంజాబ్ నేషనల్ బ్యాంక్), ఒబిసి (ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్)కు చెందిన ప్రతి నిధులు కూడా హాజరయ్యారు. కమిటీ సంధించిన ప్రశ్నలకు ఆర్‌బిఐ ఇంతకుముందే ఏడు పేజీల సమాధానాన్ని అందజేసింది. రూ.500, రూ.1000 పాత నోట్లను రద్దు చేసే విషయంలో ప్రభుత్వం నుంచి సలహాలను అందుకున్నామని వెల్లడించింది. పాత నోట్లను ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలని ఆర్‌బిఐ వెల్లడించింది. అవి దొంగ నోట్ల సమస్య, తీవ్రవాదులకు ఫైనాన్సింగ్, నల్లధనం సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. సెంట్రల్ బోర్డు దీనిపై నిర్ణయం తీసుకున్న తర్వాత నవంబర్ 8న ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటన చేసింది.

20న మరోసారి పిఎసి ముందుకు ఉర్జిత్

ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారులు శుక్రవారం పిఎసి ఎదుట హాజరుకావాల్సి ఉంది. అప్పుడు కూడా ఇదే మాదిరి సమాధానం చెబితే ప్రధాని నరేంద్రమోదీకైనా సమన్లు జారీ చేస్తామని కమిటీ ముందస్తుగానే హెచ్చరిం చింది. నోట్ల రద్దు అనంతరం రిజర్వు బ్యాంకు తన స్వతంత్రను కాపాడుకోవడంలో విఫలమైందని పలు విమర్శలు వచ్చాయి. మరోవైపు నగదు కొరతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ విషయాలన్నింటిన్నీ విచారిస్తున్న కమిటీలు ఆర్‌బిఐ గవర్నర్, ఇతర అధికారులకు నోటీసులు జారీచేశాయి.