Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

రువాండాకు బహుమతి

modi

కిగాలి: అయిదు రోజులు ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రువాండాలోని ఒక ఆదర్శ గ్రామానికి 200 ఆవులను బహూకరించారు. పేదరికం నిర్మూలన, చిన్న పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడం కోసం రువాండా అధ్యక్షుడు పాల్ కగామే చేపట్టిన గిరింకా కార్యక్రమం కోసం ప్రధాని స్ధానికంగా లభించే ఈ ఆవులను బహూకరించారు. పేదలకు అర్థిక భద్రతతో పాటు పోషకాహారాన్ని అందించడం కోసం చేపట్టిన ఈ పథకం కింద ప్రతి పేద కుటుంబానికి ఒక ఆవును అందజేస్త్తారు.  ఆ ఆవుకు పుట్టిన దూడను ఆ కుటుంబం మరొకరికి కానుకగా ఇస్తుంది. దీనివల్ల పశు సంపద పెరిగి, పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత లభించడంతో పాటుగా చిన్న పిల్లల్లో పోషకాహార లోపం కూడా తగ్గడానికి దోహదపడుతుంది. ఈ పథకం ద్వారా ఇప్పటికే లక్షలాది మందికి గోవులను అందజేశారు. మరో వైపు దేశంలో పాల ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో పాటు చిన్న పిల్లల్లో పోషకాహార లోపం సైతం తగ్గడమే కాకుండా కుటుంబాల ఆదాయాలు సైతం పెరిగాయి. ర్వేరు ఆదర్శ గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో మోడీ గ్రామంలోని పేద కుటుంబాలకు ఈ ఆవులను కానుకగా ఇచ్చారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, సుదూరంలో ఉన్న రువాండాలో గ్రామాల ఆర్థిక సాధికారికత కోసం ఆవుకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం చూసి ఆవును తల్లిగా పూజించే భారతీయులు ఎంతో ఆశ్చర్యపోతున్నారని అన్నారు. గిరింకా కార్యక్రమం తరహాలోనే తేనెటీగల పెంపకాన్ని సైతం చేపట్టాలని ఆయన రువాండా ప్రభుత్వానికి సూచించారు. పాలతో పాటుగా తేనెను కూడా ఉత్పత్తి చేయవచ్చని, దీనివల్ల పేద కుటుంబాలకు అదనపు ఆర్థిక లబ్ధి చేకూరుతుదని మోడీ అన్నారు. రువాండాలో 2006లో ఈ పథకం ప్రవేశపెట్టినప్పటినుంచి 2016 జూన్ వరకు 2,48,566 కుటుంబాలు లబ్ధి పొందాయి.

Comments

comments