Home అంతర్జాతీయ వార్తలు జి-మోడీ జిగ్రీ

జి-మోడీ జిగ్రీ

MODI--JIN

కింగ్‌డావో సదస్సులో చైనా అధ్యక్షుడితో  ప్రధాని నరేంద్ర మోడీ భేటీ
వచ్చే ఏడాది భారత్‌కు జిన్‌పింగ్

కింగ్‌డావో : భారత ప్రధాని నరేంద్ర మోడీ శనివారం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ఐదు వారాల వ్యవధిలో చైనా అధినేతను ప్రధాని మోడీ కలుసుకోవడం ఇది రెండోసారి. అప్పట్లో వుహాన్ సదస్సులో వీరి భేటీ జరిగింది. ఇప్పుడు అత్యంత కీలకమైన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ) సదస్సులో పాల్గొనేందుకు మోడీ చైనా పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్‌తో సాదర, పురోగామ చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతంలో మరింత ముందడుగు దిశలో ఇరువురు నేతల మధ్య ఇష్టాగోష్టి చర్చలు జరిగాయి. చైనాలోని కింగ్‌డావోలో రెండు రోజుల పాటు షాంఘై 18వ సదస్సు జరుగుతుంది. దీనికి ఇప్పటికే పలు దేశాల ప్రతినిధులు తరలివచ్చారు. రెండు ఆసియా దిగ్గజ దేశాధినేతల మధ్య ఇటీవలి కాలంలో వరుస సంప్రదింపులు జరగడం అంతర్జాతీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రత్యేకించి గత ఏడాది సరిహద్దులలో డోక్లామ్ ప్రతిష్టంభన నేపథ్యంలో ఇరు దేశాల భద్రతా బలగాల మధ్య సరైన సమన్వయం దిశగా మోడీ జిన్‌పింగ్‌ల చర్చలు జరిగినట్లు వెల్లడైంది. సరిహద్దు వివాదాలతో పాటు ఇతర అంశాలపై కూడా ఇరువురు నేతలు దృష్టి సారించారు. షాంఘై సదస్సులో భారత్‌కు ప్రాధాన్యత కల్పించాలని చైనా భావిస్తోంది. రెండు రోజుల చైనా పర్యటన కోసం ప్రధాని మోడీ శనివారమే ఇక్కడికి వచ్చారు. వార్షిక షాంఘై సదస్సు ప్రారంభానికి ముందు ఇరువురు నేతలు పరస్పరం సాదర కరచాలనం చేసుకుని, కలిసి ఫోటోలు దిగారు. భారత్ చైనా మధ్య పటిష్ట సుస్థిర బంధాలు శాంతియుత ప్రపంచం దిశలో మైలురాళ్లు అవుతాయని ప్రధాని మోడీ తెలిపారు. వూహాన్‌లో ఐదు వారాల క్రితం జిన్‌పింగ్‌తో చర్చలతో పరస్పర బంధానికి ఊతం ఏర్పడిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ దిశలో మరింత వేగవంతంగా చర్యలు తీసుకోవల్సి ఉందని, వూహాన్ సదస్సు నేపథ్యంలో నెలకొన్న వాతావరణాన్ని మరింత సఫలీకృతం చేసుకోవల్సి ఉందని మోడీ వ్యాఖ్యానించారు. ఎప్రిల్ 27, 28 తేదీలలో జరిగిన చర్చల్లో కుదిరిన నిర్ణయాల అమలు గురించి ఇరువురు నేతలు ఇప్పుడు సమీక్షించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. అప్పటి చర్చల ప్రక్రియలో ఇరు దేశాల నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డోక్లామ్ తరహా వివాదాలు సరిహద్దులలో మరోసారి జరగకుండా ఉండేందుకు పరస్పర విశ్వాస పునరుద్ధరణకు, ఎప్పటికప్పుడు సమాచార వినిమయానికి దిగాలని తమతమ సైనిక విభాగాలకు తగు ఆదేశాలు అంతకు మించి మార్గదర్శకాలు జారీ చేయాలని సంకల్పించారు. ఈ దిశలో ఇంతవరకూ ఏమి జరిగిందీ? తగు సమన్వయం దిశలో వాతావరణం ఉన్నదీ లేనిదీ తెలుసుకునేందుకు మోడీ జిన్‌పింగ్ తాజా చర్చలు ఉపకరించాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇరుదేశాల ప్రజా అంతర్గత సంబంధాల మెరుగుదలకు , ఆర్థిక సంబంధాల బలోపేతానికి పాటించాల్సిన మార్గాలపై ఇరువురు దృష్టి సారించారు. డోక్లామ్‌ను చేదు జ్ఞాపకంగా మారిచిపోయి సత్సంబంధాలు నెలకొల్పాలని రెండు దేశాల అగ్రనేతలు కృతనిశ్చయానికి రావడం కీలకం అయింది. కేవలం డోక్లామ్ ఒక్కటే కాకుండా ఇతర పలు అంశాలు కూడా ఇరుదేశాల మధ్య అడ్డుగోడలుగా మారాయి. జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్‌పై ఐరాస నిషేధం వేటు విషయంలో భారత్ చర్యలకు చైనా అడ్డంకి ప్రధానంగా ఉంది. ఇక పాకిస్థాన్‌తో కలిసి చైనా పలు వాణిజ్య రహదారులు, కారిడార్‌ల నిర్మాణానికి ముందుకు రావడం, ఎన్‌ఎస్‌జి సభ్యత్వానికి చైనా అడ్డుపుల్లలు వంటివి కూడా ఇరుదేశాల సత్సంబంధాల దిశలో అగాధాలుగా మారుతున్నాయి. వీటిని అధిగమించడం ద్వారానే సంబంధాలు చారిత్రకం అవుతాయని మోడీ భావిస్తున్నారు. ఇక షాంఘై సహకార సంస్థ దేశాల నేతలతో కూడా ప్రధాని మోడీ పలు దఫాల చర్చలు జరుపుతారు. ఇండియా ఎస్‌సిఓలో పూర్తి స్థాయి సభ్యత్వం పొందిన తరువాత ఈ భేటీకి రావడం ఇదే తొలిసారి. నాటోకు పోటీ పేరొందిన ఈ సంస్థలో పాకిస్థాన్ ఇప్పటికే పూర్తి స్థాయి సభ్యత్వం పొందింది. ప్రపంచ స్థాయిలో చైనా బలోపేతానికి ఎస్‌సిఓ ఆయుధంగా మారుతోంది. ఇందులో ప్రధాని మోడీ భూమిక ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు అమెరికా కోణంలో కీలకంగా మారింది.