Home జాతీయ వార్తలు జుమ్లాల ప్రధాని

జుమ్లాల ప్రధాని

Rahul-gandhi-image

రాఫెల్ డీల్ ఎవరి కోసం? : రాహుల్ 

న్యూఢిల్లీ : ప్రజల ముంగిట చేసిన వాగ్దానాలు, రాఫెల్ ఒప్పందంలోని నిజానిజాలపై ప్రధాని నరేంద్ర మోడీ జవాబు చెప్పాల్సి ఉందని కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఎన్‌డిఎ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా శుక్రవారం ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తీవ్రస్థాయి పదజాలంతో ఇంత కు ముందెన్నడూ లేని స్థాయిలో రాహుల్ ప్రసం గం సాగింది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చి న హామీల మాట ఏమైంది? అత్యంత కీలకమైన రాఫెల్ జెట్‌ఫైటర్స్ డీల్‌లోని లోగుట్టు ఏమిటీ? ప్రధాని తెలియచేయాల్సి ఉందని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఓ వైపు అధికార పక్షం నుంచి తీవ్రస్థాయిలో నిరసనల నేపథ్యంలోనే రాహుల్ ప్రసంగం సాగింది. ప్రధాని ఒత్తిడిని భరించలేకనే రక్షణ మంత్రి నిర్మల అబద్ధాలు చెప్పాల్సి వచ్చిం దన్నారు. ఈ పదజాలం పట్ల సభలో నిరసన వ్యక్తమైంది. రాఫెల్ ఒప్పందంలో ప్రధాని ఒక వ్యాపారవేత్తకే ఎందుకు అనుకూలత వ్యక్తం చేశా రో సభకు తెలియచేయాల్సి ఉందని తమ ప్రసం గం కొనసాగిస్తూ స్పష్టం చేశారు. ఒప్పందంలోని నిజాలను దాచిపెడుతూ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయంలో జాతిని, సభను పక్కదోవ పట్టిస్తున్నారని, ఇకనైనా ప్రధాని పెదవి విప్పి చెప్పాల్సి ఉందని తెలిపారు. ఒప్పందం అంతా లొసుగులమయంగా కన్పిస్తోంది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ తనకు చెప్పినదానిని బట్టి చూస్తే అసలు నిజాలు వెల్లడి అయ్యాయని తెలిపారు. ఈ ఒప్పందంలో రహస్యం ఏదీ లేదని , దీని గురించి ప్రజలకు తెలియచేసినా తనకు అభ్యంతరం లేదని ఆ దేశ అధ్యక్షులు చెప్పారని, మొత్తం భారత్‌కు దీని వివరాలు తెలియచే యవచ్చునని చెప్పారని, మరి ఈ ప్రభుత్వం ఎందుకు దీనిని దాచిపెడు తోందని, అనేక అనుమానాలకు తావిస్తున్నారని విమర్శించారు. రక్షణ మంత్రి అవాస్తవాలను చెప్పారు. భారత్, ఫ్రెంచ్ ప్రభుత్వం మధ్య ఎటువంటి రహస్య ఒప్పందం లేదని స్వయంగా ఫ్రాన్స్ ప్రధాన మంత్రి తనకు చెప్పారని రాహుల్ తెలిపారు. తొలుత హిందూస్థాన్ ఎయిరోనాటికల్స్ లిమిటెడ్ (హెచ్‌ఎఎల్)కు ఈ కాంట్రాక్టు ఇద్దామనుకున్నారు. అయితే దీనిని ఒకానొక బిజినెస్‌మెన్‌కు ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చిందో ప్రధాని చెప్పితీరాలని రాహుల్ డిమాండ్ చేశారు. రాఫెల్ డీల్ సాధారణ ఒప్పందం కాదని, ఏకంగా రూ 58,000 కోట్ల విలువైనదని, దీని గురించి ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఒప్పందం కాంట్రాక్టులలో భారీ స్థాయి అవినీతి జరిగిందని, ఇది ప్రధాని కేంద్ర బిందువుగా జరిగిందా? లేక ఇతర స్థాయిలలో జరిగిందా? అనేది వెల్లడికావల్సి ఉందన్నారు. అసలు పరికరాలు, ఆయుధాల ధరలు ఎంత? ఎంత మేరకు ఎవరికి కాంట్రాక్టు కట్టబెట్టారు? అనేది తేల్చితీరాలని సవాలు విసిరారు. ప్రధాని మోడీపై రాహుల్ తొలిసారిగా అవినీతి ఆరోపణల అస్త్రాన్ని తీవ్రస్థాయిలోనే సభావేదికగా సంధించారు. డీల్‌లో ఎవరికి మేలు జరిగింది? ఎందుకు మేలు కల్గించారు? నిర్మలాజీ….ప్రధాని మోడీ జీ దేశానికి చెప్పాల్సి ఉందన్నారు. ఈ డీల్ విషయలో పలు ప్రశ్నలు ఉన్నాయని, రేట్లు, ఇతర అంశాలలో అనేక జాతీయ నష్టదాయక ప్రభావం కనబడుతోందని, ఇతర కీలక విషయాలు చాలా ఉన్నాయని కాంగ్రెస్ తరఫున రాహుల్ సర్కారును ఇరకాటంలోకి నెట్టారు. ఈ సర్కారు ఏకంగా తమ ఆశ్రితుల మెప్పు కోసం జాతీయ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని రాహుల్ విమర్శించారు. దేశ ప్రయోజనాలు, కీలక భద్రతా అంశాలను దెబ్బతీయడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. ప్రజాధనానికి నిలువెల్లా తూట్లు పొడవడం, భద్రతను గాలిలో దీపం చేయడం ఎంతవరకు మంచిదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో అతి తక్కువ రేటుకు డీల్‌కు సంప్రదింపులు జరిగాయని అయితే ఇప్పటి ప్రభుత్వం దీనిని తుంగలో తొక్కి ఈ రేటును అమాంతం పెంచిందని ఆరోపించారు. 2008 ఇండో ఫ్రెంచ్ ఒప్పందం పరిధిలో డీల్ వివరాలను గోప్యంగా ఉంచాల్సి వస్తోందని ప్రభుత్వం చెపుతోంది. 2017 నవంబర్‌లోనే ఖతార్ 12 రాఫెల్ ఫైటర్ జెట్లను మన కరెన్సీ విలువలో ఒక్కోదానికి రూ 694. 80 కోట్లకు కొనుగోలు చేసిందని , ఆ గల్ఫ్ దేశం ఈ జెట్లను కొంటున్న రేటు మనం రాఫెల్స్‌ను పొందే రేటుతో పోలిస్తే చాలా తక్కువ అని రాహుల్ స్పష్టం చేశారు.

చౌకీదారు కాదు భాగీదార్ : ప్రధాని తాను ప్రజల పాలిటి కాపలాదారుడిని , వాచ్‌మెన్‌ను అని చెప్పారని, అయితే ఆచరణలో ఇందుకు విరుద్ధంగా ఉందన్నారు. ప్రధాని మోడీ చౌకీదారు కాదు కాంట్రాక్టులు కుదర్చడంలో దిట్ట అయిన భాగీదారు అయ్యారని విమర్శించారు. కొందరు వ్యక్తులతో ప్రధానికి ఉన్న ప్రత్యేక సంబంధాల గురించి అందరికీ తెలుసునని, ఈ ప్రత్యేకతను పొందిన వారి పట్ల మోడీ వైఖరి ఏమిటీ? అని రాహుల్ అడిగారు. ప్రధాని మోడీ ప్రచారానికి ఆయనకు మార్కెటింగ్‌కు ఎంత డబ్బు వెచ్చిస్తున్నారనేది అందరికీ తెలుసు. అదే విధంగా ఈ ధనం ఎవరు సమకూరుస్తారనేది కూడా తెలుసు. ఈ జాబితాలోని ప్రముఖులలో ఒక పెద్ద మనిషికి రాఫెల్ ఒప్పందం దక్కింది. మోడీ అండ లభించిన సదరు పెద్దాయనకు రూ 45,000 కోట్ల ప్రయోజనం దక్కిందని రాహుల్ ఆరోపించారు. అన్ని విధాలుగా ప్రజలను తప్పుదోవ పట్టించిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన అవిశ్వాసానికి తమ పార్టీ మద్దతు ఇస్తోందని రాహుల్ తెలిపారు. అవిశ్వాసం తీసుకువచ్చిన తెలుగుదేశం పార్టీ వంటి పలు పార్టీలు బిజెపి సాగించిన గిమ్మిక్కుల దాడిలో రాజకీయంగా బలి అయ్యాయని చెప్పారు. బిజెపి ఆయా పార్టీలపై జుమ్లా దాడికి దిగిందని, టిడిపి ఈ 21వ శతాబ్దపు రాజకీయ ఆయుధానికి బాధిత పార్టీగా మారిందని తెలిపారు. కేవలం టిడిపి ఒక్కటే కాదు ఇటువంటి అనేక పార్టీలు అనేకం బాధిత పక్షాలుగా మారాయని అన్నారు. రాహుల్ తమ ప్రసంగంలో ఎక్కువగా జుమ్లా పదం వాడారు. ఇది హిందీ /ఉర్దూ పదం. బూటకపు వాగ్దానం అని దీని అర్థం. కేవలం గప్పాలను కొట్టేవారిని ఉద్ధేశించి గుజరాతీలో జుమ్లా పదం ఎక్కువగా వాడుతారు.

మోడీ పైకి నవ్వులు లోన టెన్షన్ : మాట్లాడుతున్నప్పుడు ప్రధాని ముఖకవళికలను జాగ్రత్తగా గమనిస్తున్నానని రాహుల్ చెప్పారు. ఆయన నవ్వుతూ కన్పిస్తూ ఉన్నారని, కానీలోలోన టెన్షన్‌కు గురి అవుతున్న వైనం తెలుస్తూనే ఉందన్నారు.ఆయన ఎటో చూస్తున్నారని, నేరుగా తన కళ్లలోకి చూడలేకపోతున్నారని, దీనితోనే ఆయనలో ఉన్న అభద్రతా భావన తెలిసివస్తోందని అన్నారు. ప్రతి భారతీయుడికి రూ 15 లక్షలు బ్యాంకు ఖాతాలలో వేస్తామని ప్రధాని చెప్పిన విషయాన్ని రాహుల్ గుర్తు చేశారు. మరి ఈ మాట ఇప్పుడేమైంది? ఏ గాలికి కొట్టుకుపోయిందని ప్రశ్నించారు.ఇక విదేశాలలోని నల్లధనం అంతా వెనక్కి రప్పిస్తామని చెప్పాని , ఇది జుమ్లా నెంబర్ ఒన్ దాడి అని వ్యాఖ్యానించారు. ఇక నిరుద్యోగ సమస్య జుమ్లా దాడులలో నెంబరు 2 అని, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిసామని చెప్పారని, అయితే ఇప్పటివరకూ కేవలం నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పించడం జరిగిందని వెల్లడించారు. మోడీ హయాంలో గత నాలుగేళ్లలో నిరుద్యోగం శిఖరస్థాయికి చేరిందని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఇంత తక్కువ కాలంలోనే దేశంలోని అత్యంత సంపన్నులైన కార్పొరేట్లకు ఏకంగా రూ 2.5 లక్షల కోట్ల రుణమాఫీకి దిగారు. రైతాంగం పట్ల మోడీ వెగటుతనం, సంపన్నుల పట్ల ఆయనకున్న వాత్సల్యం దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చునని తెలిపారు.

అజెండాలేకుండా విదేశీ పర్యటనలు : ప్రధాని మోడీ తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లడంలో రికార్డు స్థాపించారు. అంతకు మించి అజెండాలేకుండా విదేశీనేతలతో రోజుల కొద్ది విహార చర్చలకు దిగారని రాహుల్ విమర్శించారు. ఇది కూడా ఒక రికార్డుగానే భావించుకోవల్సి వస్తుందన్నారు. చైనా అధ్యక్షులతో ప్రధాని మోడీ డోక్లామ్ అంశం గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదని , ఏమైనా అంటే తమది అజెండాలేకుండా సాగిన పర్యటన అని స్పష్టం చేశారని ఇదేం నీతి అని నిలదీశారు. చైనా అధ్యక్షులతో ప్రధాని మోడీ చర్చల దశలోనే సరిహద్దులలో చైనా సైనికులు మన భూభాగంలోకి చొచ్చుకువచ్చారని, దీనిని మనవీర జవాన్లు ధైర్యంగా నిలువరించారని గుర్తు చేశారు.