Search
Wednesday 19 September 2018
  • :
  • :

రష్యాతో పటిష్ట బంధం

 Prime Minister Narendra Modi visits Russia

న్యూఢిల్లీ : రష్యాతో భారత్ తరాల స్నేహ బంధం ఇక ముందు కూడా బాగా పురోగమిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రష్యాలో పర్యటన తరువాత స్వదేశం వచ్చిన ప్రధాని మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మోడీ తొలి శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. తీర ప్రాంతపు నగరం సోచీలో పుతిన్‌తో తాము  జరిపిన చర్చలు పూర్తి స్థాయిలో ఫలప్రదం అయినట్లు ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. రష్యా  భారత్ బంధం రాబోయే సంవత్సరాలలో సమున్నత శిఖర స్థాయికి చేరుతుందని, ఈ దిశలోనే చర్చలలో అడుగులు పడ్డాయని వివరించారు. ద్వైపాక్షిక, అంతర్జాతీయ కీలక అంశాలపై చర్చించినట్లు ప్రధాని తెలిపారు. ఇరుదేశాల మధ్య ఉన్న ప్రత్యేక, గౌరవప్రద వ్యూహాత్మక భాగస్వామ్యం కేవలం ఇరుదేశాలకు సంబంధించినదే కాదని, ఇది ప్రపంచ శాంతి సుస్థిరతలకు దోహదం చేస్తుందని సమ్మిట్ సందర్భంగా ఇరువురు నేతలు పేర్కొన్నారని విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటన వెలువరించింది. సమంజసమైన, సమానయుత ప్రపంచ వ్యవస్థ దిశలో రెండు దేశాలు సంకల్ప బలోపేత నిర్ణయానికి  వచ్చినట్లు తెలిపారు. ఉగ్రవాదం, యువతను తీవ్రవాదం వైపు మళ్లించే శక్తుల చర్యల గురించి కూడా ఇరువురు నేతలు చర్చించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కలిసికట్టుగా నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి.రష్యాపై అమెరికా తీవ్ర ఆంక్షలు, దాని వల్ల ఇండియా  రష్యా రక్షణ సహకారంపై పడే ప్రభావం నేపథ్యంలో ప్రధాని మోడీ రష్యా అధినేత పుతిన్‌తో జరిపిన చర్చలకు ప్రాధాన్యత ఏర్పడింది.  సోచీలో పుతిన్ అభ్యర్థన మేరకు ప్రధాని మోడీ ఒక స్కూల్‌కు వెళ్లి అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. వారు కనబర్చిన ప్రతిభను కొనియాడారు.

Comments

comments