Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

వట్టికోట నేర్పిన సూత్రాలు

vattikota

చైతన్యం, అధ్యయనం

తెలంగాణ వైతాళికులు వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజల్లో చైతన్యం పాదుకొల్పడానికి, అధ్యయనశీలత పెంపొందించడానికి తీవ్రంగా కృషి చేశారు. తన రచనల ద్వారా మాత్రమే కాకుండా ఉద్యమాల ద్వారా కూడా ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఆళ్వారుస్వామి సాగించిన కృషి శ్లాఘనీయం. ప్రజల్లో పుస్తకాలు చదివే అలవాటును పెంపొందింపజేసేందుకు ఆయన దేశోద్ధారక గ్రంథమాల స్థాపించి, పుస్తకాల ప్రచురణకు పూనుకున్నారు. ఊరూరూ తిరిగి, గ్రంథాలను అమ్మడం ద్వారా పఠనాసక్తి పెంచేందుకు కృషి చేశారు.
సామాన్య కుటుంబంలో జన్మించి, ఎన్నో కష్టాలకోర్చి, స్వయం కృషితో ఎదిగిన ఆళ్వారు స్వామి జీవితం ఆదర్శప్రాయం. ఆళ్వారుస్వామిలో ఎన్నో కోణాలు. సంప్రదాయవాదుల కుటుంబంలో జన్మించినప్పటికీ హేతువాదిగా జీవించడం కన్పిస్తుంది. ప్రాకృతిక వాదిగా కనబడతారు. వంటలవాడిగా, ెటల్ సర్వర్‌గా కూడా ఆయన పనిచేశారు. ‘గోలకొండ’ పత్రికలో ప్రూఫ్ రీడరుగా పనిచేశారు. గ్రంథాలయోద్యమంలో పాల్గొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమంలో కార్యకర్తగా పనిచేశారు. ప్రజాసంఘాలకు నాయకత్వం వహించారు. అభ్యుదయ రచయితల సంఘం హైదరాబాదు శాఖ స్థాపనలో కృషి చేశారు. కాంగ్రెస్‌వాదిగా సత్యాగ్రహోద్యమంలోనూ ఆయన పాల్గొన్నారు. ఆళ్వారు స్వామి జాతీయవాది. మత సామరస్యం నెలకొల్పేందుకు ఆయన కృషి చెప్పుకోదగింది. కథానికలు రచించారు. నవలలు వెలువరించారు. వ్యాసాలు రాశారు. కవిత్వ రచన చేశారు. నాటికలను రచించారు. బహుముఖ ప్రజ్ఞావంతులు ఆళ్వారు స్వామి.
నిత్యజీవిత సంఘటనలకు అతీంద్రియ ప్రభావాలు కారణం కాదని చెప్పేది ప్రాకృతికవాదం. ప్రకృతి శక్తులు, పరిసరాలు, పరిస్థితుల ప్రభావం మనుషులపై ఉంటుందని ఈ వాదం చెప్తుంది. ఆధ్యాత్మిక, అతీత శక్తులపై నమ్మకం లేకుండా వస్తుగత దృష్టి ఉండాలని చెప్పే ఈ వాదం ఆధారంగా ఆళ్వారు స్వామి ‘జైలు లోపల’ కథానికలు రచించారు. ఈ సంపుటిలో ‘పరిగె’, ‘మెదడుకు మేత’, ‘పతితుని హృదయం’, ‘అవకాశమిస్తే…’, ‘విధిలేక’, ‘మాకంటే మీరేం తక్కువ!’ అనే ఆరు కథానికలున్నాయి.
వట్టికోట ఆళ్వారుస్వామి మూడు సార్లు జైలు జీవితం గడిపారు. క్విట్ ఇండియా పోరాట కాలంలో 1942 అక్టోబరు నుండి 1943 అక్టోబరు వరకు సంవత్సరంపాటు జైల్లో గడిపారు. అనంతరం ‘హైదరాబాదు ప్రజల రేషన్ కష్టాలు’ అనే పేరుతో కరపత్రం వేసి మరోసారి జైలు పాలయ్యారు. ఆ తర్వాత నిజాం వ్యతిరేక పోరాటంలో 1946 నుండి 1951 వరకు జైలు జీవితం గడిపారు. ఆ జైలు జీవితం ప్రతిఫలనమే ‘జైలు కథలు’లో కనబడుతుంది. ఈ కథలన్నింట్లో వర్గదృక్పథం తొంగి చూస్తూ ఉంటుంది. తద్వారా చైతన్యం కలిగించడం ఆళ్వారుస్వామి లక్ష్యం.
‘పరిగె’ కథానికలో పోలీసు పటేలు భూస్వామ్య వైఖరిని పాఠకులు ఏవగించుకునేలా ప్రదర్శిస్తారు. ‘మెదడుకు మేత’ కథానికలో మనుషుల మధ్య చీలిక తెస్తున్న మత కలహాల పట్ల చైతన్యవంతులను చేస్తారు ఆళ్వారు స్వామి. ‘పతితుని హృదయం’ కథానికలో ఉరిశిక్షలు ప్రభుత్వ హత్యలుగా హంతకుడితో చెప్పిస్తారు. సమాన అవకాశాలు, స్వేచ్ఛ లభిస్తే స్త్రీలు రాణిస్తారన్న సందేశాన్ని ఇచ్చే కథానిక ‘అవకాశమిస్తే’. భారతదేశం వంటి దేశానికి మతాతీత దృక్పథమే సరైనదన్న సందేశాన్ని ఇచ్చే కథానిక ‘మెదడుకు మేత’. రజాకార్ల కాలంలో దొంగలు జైల్లో ఉండగా, దోచుకున్న దొరలు ప్రభుత్వంలో ఉన్నారని వ్యంగ్యంగా విమర్శిస్తూ రాసిన కథానిక ‘మాకంటే మీరేం తక్కువ’. ఈ కథానికలన్నింటి లక్ష్యం ప్రజల్లో ఆయా అంశాల పట్ల అవగాహన కల్పించి, చైతన్యవంతులను చేయడమే.
తొలి తెలంగాణ నవలగా పేర్కొనే ‘ప్రజల మనిషి’ని 1952 నుండి 1955 మధ్య ఆళ్వారు స్వామి రచించారు. ఆయన రచించిన మరో నవల ‘గంగు’ అసంపూర్తిగా మిగిలిపోవడం తెలంగాణ సాహిత్యానికి తీరని లోటు. ‘ప్రజల మనిషి’ నవలావస్తువు భూసమస్య. ఈ నవలా నాయకుడు కంఠీరవం. ప్రతినాయకుడు దొర రామభూపాలరావు. ప్రజాచైతన్యం ఈ నవల లక్ష్యం. దొరమీద కోపం కలిగించడం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తారు రచయిత. ఈ నవల ప్రారంభంలోనే ఆ లక్ష్యానికి బీజం వేస్తారు. కోటయ్య ఒక సామాన్య రైతు. అతనికి పాడి ఆవు, లేగదూడ ఉంటాయి. దొరలు అడిగినది ఇచ్చి తీరక తప్పని కాలం. కోటయ్య దగ్గర ఉన్న పాడి ఆవును తన బిడ్డతో సహా అత్తవారింటికి పంపాలని హుకుం జారీ చేస్తాడు దొర. అతనికి దొర చెప్పినట్టు చేయడం ఇష్టం లేదు. కానీ తప్పని పరిస్థితి. ఊళ్ళో ఉండాలంటే దొర మాటకు ఎదురు చెప్పకూడదు. అతని కొడుకు కొమరయ్యకు ఆ ఆవు, దూడలంటే ఎంతో ఇష్టం. దొరకు పాడి ఆవును, లేగదూడను ఎందుకివ్వాలని ప్రశ్నిస్తాడు కొమరయ్య. ఇవ్వొద్దని బతిమిలాడుతాడు. ఈ సన్నివేశంలో పిల్లవాడి నిస్సహాయత, పిల్లవాడిలో కన్నీళ్లు పాఠకుడిలో దొర పట్ల కోపాన్ని కలిగిస్తాయి. దొర చేసే ఆగడాల పట్ల, దోపిడీ పట్ల తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తుందీ సన్నివేశం. ఈ విధంగా దోపిడీవిధానాల పట్ల ప్రజలను చైతన్యవంతం చేయాలనే లక్యానికి ఆదిలోనే నాంది పలుకుతారు రచయిత. అనంతరం కొమరయ్య కౌలు భూమిని స్వాధీనం చేసుకోవడం, కొమరయ్యను గుంజకు కట్టేసి కొట్టడం వంటి ఘటనలతో భూసమస్యల పట్ల అవగాహన కల్పించి, ప్రజలను చైతన్యవంతులను చేయడమనే రచయిత లక్ష్యం నెరవేరిందని భావించవచ్చు. శ్రమజీవులకు, దొరకు మధ్య వైరుధ్యాన్ని చక్కగా చిత్రీకరించిన నవల ‘ప్రజల మనిషి’.
వకీలు విశ్వనాథం కొడుకు నవనీతం జైలు నుంచి విడుదలైన తర్వాత కమ్యూనిస్టు పార్టీ సమావేశాల్లో, కార్మికుల సభల్లో చురుకుగా పాల్గొన్న సన్నివేశాల్ని ‘గంగు’ నవలలో ఉద్వేగభరితంగా చిత్రీకరించారు రచయిత. ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి’ అన్న మార్క్స్ నినాదానికి అనుగుణంగా కార్మికులను, పల్లెరైతులను సంఘటిత పరచడం మొదలైన సన్నివేశాల ద్వారా పాఠకులను చైతన్యవంతులను చేస్తారు. దొరలు, భూస్వాముల దురాగతాలను చక్కగా చూపించారు ఈ నవలలో.
కుటిల నీతితో దోపిడీకి తెగబడుతున్న ప్రభుత్వాన్ని చూసి, ఆళ్వారు స్వామి రాసిన వ్యాసాలు ‘రామప్ప రభస’ వ్యాసాలు. మేధావుల్లో, రాజకీయ నాయకుల్లో విలువలు పతనం కావడం, ద్వంద్వ ప్రమాణాలు కనబడడం పట్ల వట్టికోట ఆగ్రహం ఈ వ్యాసాల్లో కనబడుతుంది. పరస్పర వైరుధ్యాలు లేని సమసమాజ స్థాపనకు కృషి చేయాల్సిన ఆవశ్యకతను ఈ వ్యాసాల ద్వారా ఆళ్వారు స్వామి ఉద్బోధించారు. రాజకీయ రంగం పార్టీలకతీతంగా కలుషితమైపోయిందన్న ఆవేదన ఈ వ్యాసాల్లో కనబడుతుంది. విద్యార్థుల్లో అరాచకానికి, అశాంతికి, క్రమశిక్షణారాహిత్యానికి విద్యావ్యవస్థలోని లోపాలు, అధ్యాపకుల అలసత్వం, ఆదర్శరాహిత్యం కారణాలుగా రామప్పతో చెప్పిస్తారు రచయిత.
ప్రజలను చైతన్యవంతులను చేయాలనే లక్ష్య సాధనకు కేవలం తన రచనలను మార్గంగా చేసుకోవడం మాత్రమే కాకుండా స్వయంగా కార్యక్షేత్రంలోకి దిగిన గొప్ప రచయిత వట్టికోట ఆళ్వారు స్వామి. నాయకుడిగా కాకుండా కార్యకర్తగా ఉండేందుకు ఇష్టపడ్డ గొప్ప వ్యక్తి ఆయన.
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆళ్వారు స్వామి తీవ్రంగా కృషి చేశారు. గుమాస్తాల సంఘం ఏర్పాటు చేశారు. వారానికొక సెలవు దినాన్ని, ఇతర రాయితీలను సాధించారు. వారికోసం ప్రత్యేకంగా ‘గుమాస్తా’ అనే పత్రిక నడిపారు. హైదరాబాదులోని రిక్షాలను రద్దు చేయాలన్న నిజాం సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించారు. రైల్వేశాఖ తాత్కాలిక ఉద్యోగులను తొలగించినపుడు వారితో కలిసి పోరాటం చేశారు.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో విసునూరి రామచంద్రారెడ్డి దాచిన ధాన్యాన్ని అధికారులకు పట్టిచ్చినవారిలో దొడ్డి కొమురయ్య ఒకరు. కడివెండిలోని సంగం కార్యాలయం నుండి ఊరేగింపుగా బయలుదేరిన కార్యకర్తలమీద దొర గూండాల కాల్పుల ఫలితంగా దొడ్డి కొమురయ్య మృతి చెందాడు. ఈ ఉదంతాన్ని ‘మీజాన్’ పత్రిక ద్వారా బయటి ప్రపంచానికి తెలియజెప్పింది ఆళ్వారు స్వామే. ఆంధ్ర మహాసభ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా వివిధ ఉద్యమాల్లో కీలక భూమిక నిర్వర్తించారు ఆళ్వారు స్వామి.
హైదరాబాదులోను, అనంతరం తెలంగాణ అంతటా ‘అభ్యుదయ రచయితల సంఘం’ స్థాపనకు, విస్తరణకు తీవ్ర కృషి చేశారు ఆళ్వారు స్వామి.
ప్రజల్లో వివిధ గ్రంథాల అధ్యయనం పట్ల ఆసక్తి పెరగాలనే ఉద్దేశ్యంతో దేశోద్ధారక గ్రంథమాల, దేశోద్ధారక సూచీ గ్రంథాలయం నెలకొల్పారు. నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి, దేశోద్ధారక గ్రంథమాలలో సభ్యులుగా 800 మందిని చేర్చుకున్నారు. గ్రంథమాల ప్రచురణల్లో భాగంగా మొత్తం 35 పుస్తకాలను ప్రచురించారు.
ప్రజల్లో చదివే అలవాటును పెంపొందించడం ద్వారా చైతన్యం కలిగించవచ్చనే దృఢ అభిప్రాయం వట్టికోట ఆళ్వారు స్వామిది. అందుకే ప్రజల్లో చదివే అలవాటును పెంపొందించేందుకు దేశోద్ధారక సూచీ గ్రంథాలయం స్థాపించారు.దాదాపు పదివేల పుస్తకాలను,పత్రికలను అందుబాటులో ఉం చారు. మీజాన్, తెలంగాణ, తెలుగు తల్లి, అభ్యుదయ,భారతి, నీలగిరి, తెనుగు,స్రవంతి మొదలైన పత్రికలను బైండింగ్ చేయించారు.
రచనలు చేసినా, ఉద్యమాలు నిర్వహించినా ఆళ్వారు స్వామి అంతిమ లక్ష్యం ప్రజా చైతన్యం. ఎన్ని రూపాల్లో ఆళ్వారు స్వామి కనబడ్డా, ఆయన ప్రధాన ఉద్దేశ్యం ప్రజల్లో చైతన్యం కలిగించడం. ఆ దిశగానే ఆయన కృషి కొనసాగింది. ప్రజల్లో అధ్యయనం పెంపొందించడం కూడా చైతన్యవ్యాప్తిలో ఒక భాగమే. అందుకే ప్రజా చైతన్యం, అధ్యయన వ్యాప్తి ఆయన మనకు చెప్పిన సూత్రాలుగా భావించవచ్చు.
(నవంబరు 1న వట్టికోట ఆళ్వారుస్వామి జయంతి సందర్భంగా)

Comments

comments