Search
Wednesday 26 September 2018
  • :
  • :

కదులుతున్న విద్యాశాఖ

Private schools are violating the rules

మన తెలంగాణ/ వరంగల్ అర్బన్ జిల్లా ప్రతినిధి : వరంగల్ అర్బన్ జిల్లా విద్యాశాఖ అధికారులలో కదలికలు మొదలయ్యాయి. విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలు నిబంధనలు అతిక్రమిస్తున్నాయని, పాఠశాలలను కొనుగోలు కేంద్రాలుగా మారుస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్న విషయం విదితమే. పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అనుమతులు లేకుండా నిర్వహించబడుతున్నాయని, అనేక పాఠశాలలో మౌళిక వసతులు లేవని, దుకాణాలను తలపించే విధంగా యూనిఫామ్, నోటుబుక్స్, పాఠ్యపుస్తకాలు, పెన్సిళ్లు, టై, పెన్నులు, బెల్టు తదితర పరికరాలు అమ్మడం నిబంధనలకు విరుద్ధ్దమని ఇలాంటి వాటిపై తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు అధికారులకు వినతిప్రతాలు ఇవ్వడం ఆందోళనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారులలో కదలికలు మొదలయ్యాయి. శుక్రవారం నగరంలోని ఎస్‌ఆర్ ఎన్‌హెచ్‌ఎస్ పాఠశాలలో నిబంధనలకు విరుద్దంగా దుకాణాలు ప్రారంభించడం నోట్‌బుక్స్, యూనిఫామ్, పెన్నులు, పెన్సిళ్లు తదితర పరికరాలను అమ్మడం పట్ల విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి సీజ్ చేశారు. డిఇఒ ఆదేశాల మేరకు ఎస్‌ఆర్ ఎన్‌హెచ్‌ఎస్ లోని నోట్‌బుక్ సెంటర్‌ను ఎంఈఓ తనిఖీలు చేసి సీజ్  చేశారు. దీనితో పాటు ఖాజీపేట ప్రాంతంలోని సెయింట్ మాథ్యూస్ స్కూల్‌లోని సెంటర్ సైతం సీజ్ చేసినట్లు ఎంఇఒ వీరభద్రనాయక్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు నిబంధనలు అతిక్రమిస్తున్నా అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కదిలిస్తే తప్ప అధికారులు కదలడం లేదని తెలిపారు. ప్రతి ప్రయివేటు పాఠశాలను తనిఖీ చేసి నిబంధనలు అతిక్రమిస్తే తగు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని కోరారు. చిల్లర కొట్టు దుకాణాలుగా ప్రయివేటు పాఠశాలలు నిర్వహించబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పలు ప్రయివేటు విద్యాసంస్థలు తప్పని సరిగా తమ పాఠశాలలోనే బుక్స్ తదితర మెటీరియల్ తీసుకోవాలని తల్లిదండ్రులకు హూకుం జారీ చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలను అతిక్రమించే ప్రయివేటు పాఠశాలల యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, నిత్యం ప్రయివేటు పాఠశాలల నిర్వహణపై విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించాల్సిన అవసరముందని టిఎస్‌ఎఫ్, టిజివిపి,ఎఐఎస్‌ఎఫ్, ఎబిఎస్‌ఎఫ్, ఎఐడిఎఫ్‌డిఎస్ తదితర విద్యార్థి సంఘాల నాయకులు కన్నం సునిల్, మేడ రంజిత్, హాకీం నవీద్, గడ్డం నాగార్జున, శ్రీనివాస్ తదితరులు అభిప్రాయపడ్డారు.

Comments

comments