Home సూర్యాపేట విద్యా వ్యాపారం

విద్యా వ్యాపారం

 Private Schools lenders are collecting fees in lakhs

జోరుగా కొనసాగుతున్న ప్రైవేటు దోపిడీ
చదువు ‘కొన’ లేకపోతున్న పేద విద్యార్థులు
చదువుతో పాటు సామాగ్రి కొనాల్సిందే…
లక్షల్లో ఫీజులు… నిర్లక్షంగా చదువులు
ముక్కు పిండి వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలు…పట్టింపులేని విద్యాశాఖాధికారులు
ఫీ ‘జులుంపై’ విద్యార్థి సంఘాల దండయాత్రలు
విద్యార్థి సంఘాల పోరుకు మద్ధతు కరువు
సమిష్టిపోరుతోనే ఫీజుల అడ్డుకట్ట

 

అనాగరిక మానవ జీవితం నుండి మనిషి విద్యను అవలంబించడం ద్వారా నాగరికుడ య్యారు. చదు వు సంధ్యలు నేర్చుకొని ఆధునిక మానవునిగా అవతరించారు. తమ సంతానాన్ని గొప్ప వ్యక్తులుగా తీర్చి దిద్దాలనుకున్న తల్లిదండ్రులు వారి బంగారు భవిష్యత్తుకు మంచి పాఠశాలను ఎన్నుకొని వారి జీవి తంలో మంచి స్థానం లో స్థిరపడేలా కష్టపడుతున్నారు. అయితే జిల్లా లోని ప్రైవేటు పాఠ శాలల్లో ఫీజుల దోపిడీని తట్టుకోలేక తల్లిదండ్రులు నిర్వీర్యమైపో తున్నా రు. విద్యని ఆర్జించాలంటేనే విద్యార్థులు, వారిని చదివించాలంటేనే తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల సకల దోపిడీని చూసి బెంబేలెత్తుతున్నారు. కేవలం పాఠశాల ఫీజులే కాకుండా పుస్త కాలు, నోట్స్, దుస్తులు కూడా కొనాల్సి రావడంతో ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీపై ‘ మన తెలంగాణ’ ప్రత్యేక కథనం.

మన తెలంగాణ/ సూర్యాపేట :  సూర్యాపేట… విద్యావేత్తలకు నిలయం.. చదువుల కోట సూర్యాపేట. అట్లాంటి సూర్యాపేట నేడు చదువు కొనుక్కొనే పరిస్థితి… ఎందరో విద్యావంతులుగా తీర్చిదిద్దిన సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలల భారీగానే నెలకొల్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేకపోవడంం, టీచర్ల కొరత తదితర కారణాలతో ప్రైవేటు విద్యాలయాలకు పిల్లలు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తుంగతుర్తిలో అనేక ప్రైవేటు పాఠశాలలు నెలకొల్పారు. మొదట్లో నాణ్యమైన విద్యను అందించిన పాఠశాలలు క్రమేణ లక్షల్లో ఫీజులు తీసుకునే వారు. రాను రాను ఫీజులను అమాంతంగా పెంచి విద్యను వ్యాపారంగా మార్చారు. ఎల్‌కెజీ నుండి పదవ తరగతి వరకు భారీ స్థాయిలో ఫీజులను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. వివిధ రకాల పేర్లతో, ప్రచార ఆర్భాటాలతో పిల్లలను చేర్చు కుంటూ యజమాన్యాలు లక్షల్లో ఆర్జిస్తున్నారు. చెల్లించిన ఫీజులకు రశీదులు ఇవ్వరు.

సౌకర్యాలు నామమాత్రంగానే ఉన్న పరిస్థితి. బోధించే ఉపాధ్యాయులకు కూడా సరైన శిక్షణ ఉండదు. కేరళ, తమిళనాడు, ఢిల్లీ నుండి ఉపాధ్యాయులను తీసుకువచ్చామని చెప్తూ, భారీ స్థాయిలో ఫీజులను వసూలు చేస్తున్నారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో కూడా విఫలమవుతున్నారు. బట్టీలు పట్టించి చదివించుతు న్నారు. పిల్లలపై అధిక ఒత్తిడి కూడా పడుతున్నది. సమా జంలో పిల్లలను చదివించాలని, మంచి పాఠశాలలో చేర్పించా లని ఎన్నో ఆశలతో వస్తున్న తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలో చేర్పిస్తున్నారు. అక్కడ నుండి వారి కష్టాలు మొదలవుతున్నాయి. అప్పులు చేసి చదివించాల్సిన పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఉపాధ్యాయులు ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో చేరుతున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతున్నది. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అధికారుల అలసత్వం కూడా ఇందులో స్పష్టంగా కన్పిస్తున్నది. ప్రైవేటు పాఠశాలలను అప్పుడప్పుడు తనిఖీలు చేసినా పెద్దగా ప్రయోజనం లేదు. వారికి కూడా భారీగానే ముట్టజెప్పుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థి సంఘాలు తమ పాత్రను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.

ఫీజులపై దండయాత్రను కొనసాగిస్తున్నారు. అధికారుల అండదండలు ఉండడంతో ప్రైవేటు యజమాన్యాలు చెలరేగిపోయి ఫీజులు భారీగా వసూలు చేస్తున్నారు. అధికార పార్టీ కూడా కన్నెత్తి చూడలేని పరిస్థితి. ప్రతిపక్షాలు కూడా నోరు మెదపలేని స్థితి. విద్యార్థి సంఘాలు మాత్రమే పోరు చేస్తున్నా వారికి మద్ధతునిచ్చేవారే కరువయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు, మేధావులు, పార్టీలు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఫీజులపై సమరభేరి ప్రయోగించాల్సిన తరుణం ఆసన్నమైందని పలువురు విద్యార్థి నాయకులు పేర్కొనడం గమనార్హం. ఇప్పటికైనా ఫీజుల దోపిడీని అడ్డుకోడానికి, అరికట్టడానికి విద్యార్థి సంఘాలతో పాటు తల్లిదండ్రుల కమిటీలు, ఆయా పార్టీలు, విద్యాశాఖాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.