Home లైఫ్ స్టైల్ సూపర్ హిట్ సెలబ్రిటీలు..!

సూపర్ హిట్ సెలబ్రిటీలు..!

సినిమాల్లోనో, కలల్లోనో, కథల్లోనో అద్భుతాలు జరుగుతుంటాయనుకుంటాం.. కానీ నిజజీవితంలో వాటన్నిటినీ మించిన అద్భుతాలూ జరుగుతుంటాయప్పుడప్పుడు. సోషల్ మీడియా పుణ్యమాని ఎక్కడో మారుమూల పల్లెల్లో పుట్టినవాళ్లు సైతం రాత్రికి రాత్రి సెలబ్రిటీలవుతున్నారు. ఓ చాయ్‌వాలా, ఓ కూరలమ్మి, ఓ కమెడియన్, ఓ సినిమా ఆర్టిస్ట్ ఇలా ఎంతోమంది ఒక్కసారిగా వెలిగిపోతున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటివారిని చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు..

lfe

నల్ల కలువల్లాంటి పెద్ద కళ్లతో, కనుబొమ్మలు ఎగరేసి, కన్ను గీటి నెటిజన్లను మత్తులో ముంచింది ప్రియా ప్రకాష్ వారియర్. పద్దెనిమిదేళ్ల ఈ మలయాళ కుట్టీ రాత్రికి రాత్రే ఇంటర్నెట్‌లో అతిలోక సుందరిలా వెలిగిపోయింది. ఆమె ఓర చూపులోని అమాయకత్వం, సహజత్వం అందరినీ తన్మయుల్ని చేసింది. హీరో ఒక కన్నుతో సైగచేస్తే, తను రెండు కనుబొమలు ఎగరేస్తుంది. కాస్త ఆశ్చర్యంతో ఆ పిలగాడు నేనంటే ఇష్టమా అన్నట్లు కళ్లతోనే అడుగుతాడు. చచ్చేంత ఇష్టం అన్నట్లుగా కన్నుగొట్టి బుట్టలో పడేస్తుంది. మలయాళీ చిత్రం ‘ఒరు అదార్ లవ్’లోని మాణిక్య మలరాయ పూవీ పాట టీజర్ అంత సంచలనం అవుతుందని దర్శకుడే ఊహించలేదు. అప్పటివరకు గూగుల్‌లో అత్యధికంగా శోధించే సెలబ్రిటీ సన్నీలియోన్‌ను ప్రియావారియర్ అధిగమించింది. మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రిటీగా పేరు తెచ్చుకుంది.

lf1

కుసుమ్ శ్రేష్ఠ అనే కూరలమ్ముకునే నేపాల్ యువతి ఆన్‌లైన్ వల్ల స్టారయ్యింది. సహజమైన అందంతో బరువైన కూరగాయల బుట్టను మోస్తూ ఒయ్యారంగా నడుస్తూ.. ఫోన్‌లో మాట్లాడుతూ వగలు పోతున్న ఈ అమ్మాయి ఫొటోలను రూప్‌చంద్రమహరాజన్ అనే ఫొటోగ్రాఫర్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఆమె అందానికి దానికి తోడు ముఖంలోని ఆత్మవిశ్వాసానికి సలామ్ కొట్టారు నెటిజన్లు. మీడియా కూడా వెంటబడటంతో శేష్ఠకు సినిమా అవకాశమూ దక్కింది. 20ఏళ్ల కుసుమ్ శ్రేష్ఠ కాలేజీ విద్యార్థిని. సెలవుల్లో తల్లిదండ్రులకు ఇలా కూరలమ్ముతూ సాయం చేస్తుండేది.

lf

పాకిస్తాన్ కుర్రాడు ఆర్షద్ ఖాన్ ఓ చాయ్‌వాలా. రోజులాగానే తన దుకాణంలో టీ కప్పుల్లో టీ పోస్తుంటే, దారినపోయే జియాఅలీ అనే ఫొటోగ్రాఫర్ నీలికళ్ల ఆర్షద్ అందాన్ని  కెమెరాలో బంధించింది. అంతటితో ఊరుకోకుండా దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. అంతే చాయ్‌వాలా అందానికి నెటిజన్లు ఫిదా అయ్యారు.  టీకొట్టు కుర్రాడు కాస్తా ప్రసిద్ధ మోడల్ అయ్యాడు.  అమ్మాయిలు అతని వెంట పడటం మొదలెట్టారట.  ఇంత పాపులర్ అయిన ఆర్షద్‌కి బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ కూడా అభినందిస్తూ ఓ ట్వీట్ చేయడం విశేషం. 2016లో 18 ఏళ్ల ఆర్షద్ ఫోటోకి 34,069 లైక్‌లు వచ్చి లైమ్‌లైట్‌లోకి వచ్చాడు.