Home జాతీయ వార్తలు ప్రియాంకకు సొంత ఆఫీసు

ప్రియాంకకు సొంత ఆఫీసు

Priyanka Gandhiన్యూఢిల్లీ: క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాకు సొంత కార్యాలయం సమకూరింది. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం భవనంలో ఆమె ఒక కార్యాలయాన్ని పార్టీ కేటాయించింది. తన సోదరుడు రాహుల్ గాంధీ గతంలో ఉపయోగించిన కార్యాలయమే ఆమెకు లభించింది. కార్యాలయం వెలుపల హిందీ, ఇంగ్లీష్‌లో రాసిన ఆమె నేమ్‌పేట్లను కొత్తగా ఏర్పాటు చేశారు. ఆమె ఈ నెలలోనే తూర్పు ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే, ప్రియాంక గాంధీ కూడా సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు. త్వరలోనే పార్టీ తరఫున ఆమెకు ఫేస్‌బుక్ పేజ్, ట్విట్టర్ ఖాతా రానున్నాయి. ఇప్పటి వరకు ప్రియాంక సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు.

ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించిన దరిమిలా సోషల్ మీడియాలో కూడా ఆమె చురుకైన పాత్రను పోషించనున్నారు. సోమవారం రాహుల్ గాంధీతోపాటు మరి కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో ఆయన నివాసంలో సమావేశమైన ప్రియాంక వచ్చే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో పశ్చిమ యుపి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జ్యోతిరాదిత్య సింధియా కూడా పాల్గొన్నారు. యుపిలోని 80 లోక్‌సభ నియోజకవర్గాలలో 43 స్థానాలలో పార్టీ ఇన్‌చార్జిగా ప్రియాంక బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Priyanka Gandhi Gets Her Own Office