Search
Wednesday 26 September 2018
  • :
  • :

ప్రియాంక రాజకీయ అరంగేట్రం?

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ, కాంగ్రెస్ వర్గాల వెల్లడి

Singhvi said Priyanka Gandhi Would Not Contest the Elections

న్యూఢిల్లీ: ప్రియాంక వాద్రా రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాం క తన తల్లి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలి నుంచి పోటీ చేయవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాను ఇప్పుడు లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ నుంచే పోటీ చేస్తారని, అయితే రాయ్‌బరేలి నుంచి సోనియాకు బదులుగా ఆమె కుమార్తె ప్రియాంక పోటీ చేస్తారని ఆ వర్గాలు అంటున్నాయి.

ప్రియాంక ప్రత్యక్ష రాజకీయల్లోకి రావడంపై చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తూ ఉన్న విషయం తెలిసిందే. ఆమె ఇంతకు ముం దు కూడా తన తల్లి, సోదరుడి తరఫున రాయ్‌బరేలి, అమేథిలలో ప్రచారం చేశారు కానీ, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై మాత్రం స్పష్టమైన ప్రకటన అటు ఆమె కానీ, పార్టీ అధిష్ఠానం కానీ చేయలేదు. అయితే ఇటీవలి కాలంలో సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా ఆమె కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు కుమారుడు రాహుల్ గాంధీకి అప్పగించడం తెలిసిందే. ఇదే కారణంగానే ఆమె ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోరని, ఆమెకు బదులుగా కుమార్తె ప్రియాంకను పార్టీ బరిలోకి దించుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పార్టీలో నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా చెప్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి, అమేథి స్థానాలు నెహ్రూ-గాంధీ కుటుంబానికి కంచుకోటలనే విష యం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అమేథినుంచి గాంధీ కుటుంబానికి చెందిన నలుగురు ప్రాతినిధ్యం వహించారు. 1977లో ఎమరెన్సీ ఎత్తివేసిన తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్‌గాంధీ తొలిసారిగా ఈ నియోజకవర్గంనుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆ తర్వాత 1980లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఇదే స్థానంనుంచి గెలుపొందారు. ఆతర్వాత సంజయ్ మరణానంతరం ఆయన సోదరుడు రాజీవ్ గాంధీ 1981,1984,1989లలో ఇదే స్థానంనుంచి గెలుపొందారు. 1991లో ఎన్నికల ప్రచార సమయంలో ఆయన దారుణ హత్య తర్వాత కూడా ఆయన ఈ నియోజక వర్గంనుంచి గెలుపొందారు.

రాజీవ్ తర్వాత ఆయన సతీమణి సోనియా గాంధీ1999 లోక్‌సభ ఎన్నికల్లో తన రాజకీయ ప్రవేశానికి ఇదే నియోజక వర్గాన్ని ఎంచుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమె అమేథీని తన కుమారుడు రాహుల్‌కోసం వదిలిపెట్టి రాయ్‌బరేలినుంచి 2004నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఇక ఒకప్పుడు దివంగత ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలి నియోజక వర్గం సైతం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటే.1957నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో మూడు సందర్భాల్లో మినహా అన్ని సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు.

అలాగే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో శివసేన పార్టీతో పొత్తు పెట్టుకోబోదని కూడా ఆ వర్గాలు తెలిపాయి. సైద్ధాంతికపరమైన విభేదాలే దీనికి కారణమని ఆ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించరాదని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.

Comments

comments