Home సినిమా బాలీవుడ్‌లో ‘ఎఫ్2’ రీమేక్

బాలీవుడ్‌లో ‘ఎఫ్2’ రీమేక్

టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాతల్లో దిల్‌రాజు ఒకరు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై పలు విజయవంతమైన చిత్రాలను అందించిన ఆయన ఇటీవల సంక్రాంతి కానుకగా ‘ఎఫ్2’ చిత్రాన్ని విడుదల చేసి ఘన విజయాన్ని సాధించారు. సీనియర్ స్టార్ వెంకటేష్, యంగ్ స్టార్ వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ వసూళ్లతో 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
రికార్డు కలెక్షన్లతో…
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ‘ఎఫ్2’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో ఎంతో ఆనందంగా ఉంది. ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది.
‘ఎఫ్3’ కోసం చర్చలు…
‘ఎఫ్2’కు సీక్వెల్‌గా ‘ఎఫ్3’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు చర్చలు జరుగుతున్నాయి. అనిల్ రావిపూడి ఈ మేరకు కథను సిద్ధం చేస్తున్నారు. అన్నీ ఓకే అయితే 2021 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం.
బాలీవుడ్‌లో రీమేక్…
‘ఎఫ్2’ చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. బాలీవుడ్‌లోని ఓ నిర్మాణ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని అనుకుంటున్నాం.
సక్సెస్‌ఫుల్‌గా…
‘ఎఫ్2’ ఘన విజయంతో ఈ ఏడాదిని సక్సెస్‌ఫుల్‌గా ప్రారంభించాం. ఇదే ఊపులో ఈ సంవత్సరం మరిన్ని మంచి చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. ఈ ఏడాది నాలుగు నుంచి ఆరు సినిమాలను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై విడుదల చేస్తాం.
‘96’ను రీమేక్ చేస్తున్నాం…
ప్రస్తుతం తమిళ్ హిట్ మూవీ ‘96’ను తెలుగులో రీమేక్ చేస్తున్నాం. విడుదలకు ముందే ఈ చిత్రాన్ని చెన్నైలో చూశాను… చాలా బాగుంది. మా బ్యానర్‌లో వస్తున్న తొలి రీమేక్ ఇది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి ఈ రీమేక్‌ను తెరకెక్కిస్తాం.
ఏప్రిల్‌లో ‘మహర్షి’…
సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నిర్మిస్తున్న ‘మహర్షి’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేస్తాం. ఇక నాగచైతన్యతో ఓ సినిమా చేయబోతున్నాం. ‘జోష్’ చిత్రం తర్వాత చైతూతో చేయబోయే చిత్రమిది.

Producer Dil Raju Interview