Home ఎడిటోరియల్ మిస్టర్ తెలంగాణ-కేశవ్‌జీ

మిస్టర్ తెలంగాణ-కేశవ్‌జీ

jadav

తొలితరం తెలంగాణ స్వాప్నికుడు, ముల్కీ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి సమూహంలో ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారిది ప్రత్యేక స్థానం. ఆనాటి హైదరాబాద్‌లో ముఖ్యంగా పని చేసిన రెండు విద్యార్థి సంఘాలలో ఒకటి హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ కాగా, మరొకటి ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్‌లు. జాదవ్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ సోషలిస్టులో సభ్యులుగా చేరి ఆ రకంగా సోషలిస్టు పార్టీ వైపు ప్రయాణించారు. పోలీసు యాక్షన్ అనంతరం హైదరాబాద్‌లో ఆంధ్ర, తమిళులు ఎక్కువగా ఉద్యోగాల్లో నియామకాలు కావడంవల్ల ముల్కీ ఉద్యమానికి దారి తీసింది. ఆ ఉద్యమంలో 1952లో జాదవ్ క్రియాశీలంగా పాల్గొన్నారు. సిటీ కాలేజ్ విద్యార్థులు ముల్కీ రూల్స్ పాటించాలని ఆనాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారికి వినతి పత్రం ఇవ్వడానికి ర్యాలీగా బయలుదేరగా, మదీనా, అఫ్జల్‌గంజ్ దగ్గర విద్యార్థులపై పోలీసులు ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరపడంతో అనేక మంది చనిపోయారు. ఆ ర్యాలీలో తన సహచరులను కోల్పోయిన జాదవ్ విద్యార్థి నాయకుడిగా మరింత కసిగా నిలబడ్డాడు.
ఈ సంఘటన ఆయనను ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారునిగానే కాకుండా ప్రజాస్వామిక వాదిగానే కాకుండా చట్టబద్ధ పాలన కాంక్షపరునిగా మార్చింది. ఆనాడు హైదరాబాద్‌లోని కాయస్థులంతా కలిసి అంజుమన్ తహజీబ్ (నాగరికుల సంఘం) ఏర్పాటు చేసుకున్నారు. దాని ఆధ్వర్యంలో వచ్చిన లిఖిత పత్రికకు సంపాదకునిగా జాదవ్ గారిని నియమించారు. ఈ విధంగా విద్యార్థి దశలోనే తనకు పత్రికా సంపాదకత్వం అలవడింది అదే 3 సం॥ల క్రితం వరకు ప్రచురించబడిన “టు వర్డ్ బెటర్ మ్యాన్‌కైండ్‌” వరకు కొనసాగింది. ఉర్దూ మీడియం చదివిన జాదవ్ ఇంగ్లీషులోనూ దిట్ట. ఆ విధంగా ఇంగ్లీషులో అర్హత సాధించిన జాదవ్ రూ. 190 లకు ఇంగ్లీషు లెక్చరర్‌గా పని ప్రారంభించారు. వరంగల్, సిద్దిపేట, హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయాలలో అధ్యాపకునిగా సేవలందించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అర్హత పరీక్షను తెలుగులోనే నిర్వహించాలని దానిని సాధించి తెలుగు విద్యార్థులకు లబ్ది చేకూర్చారు. సోషలిస్టు యూత్ లీగ్‌లో జాతీయ స్థాయి నాయకునిగా పని చేశారు. బీహార్ నుండి లాలూ ప్రసాద్, నితీష్ కుమార్, ఉత్తరప్రదేశ్ నుండి ములాయంసింగ్ లాంటి వారు జాదవ్‌తో కలిసి పని చేశారు. 2 సం॥ల పాటు సోషలిస్టు యూత్ లీగ్ జాతీయ నాయకునిగా పనిచేసిన జాదవ్ సోషలిస్టు పార్టీ అగ్ర నాయకులైన రాం మనోహర్ లోహియా, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ దృష్టిని ఆకర్షించారు. జె.పి. లోహియాలను ఆహ్వానించి తెలంగాణలో బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. 1968లో తెలంగాణలో అసంతృప్తి రగిలింది. ఉద్యోగ నియామకాల్లో న్యాయం జరగడం లేదని విద్యార్థులు, స్టూడెంట్స్ యాక్షన్ కమిటీల పేరుతో ఉద్యమించారు. ఆ ఉద్యమం ఖమ్మంలో మొదలై తెలంగాణ అంతటా పాకింది. గౌలీగూడలో సమావేశమై తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటు చేసుకొని దానికి మదన్ మోహన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకొన్నారు. తెలంగాణ ప్రజా సమితిలో సోషలిస్టులు చేరి క్రియాశీలకంగా పని చేయసాగారు. అనంతరం టిపిఎస్‌లోని కాంగ్రెస్ వర్గం వారు మర్రి చెన్నారెడ్డిని ఆహ్వానించి అధ్యక్షుడిగా చేశారు. చెన్నారెడ్డి అడ్డదారిలో టిపిఎస్ నాయకుడవ్వడాన్ని జాద్ వ్యతిరేకించారు. సోషలిస్టు పార్టీ జనతాలో విలీనం అవడంతో జాదవ్ తన పూర్తి ధ్యాస తెలంగాణ ఉద్యమం వైపే ఉంచారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణ బాట మాట మరువలేదు. పార్టీల కతీతంగా, కులాల కతీతంగా తెలంగాణ కోసం అందరినీ ఏకతాటి మీదకు తెచ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు మరువలేనివి. అందులో భాగమే తెలంగాణ ఐక్య వేదిక, ఐక్య కార్యాచరణ కమిటీ, తెలంగాణ ప్రజా జె.ఎ.సి.ల ఏర్పాటు కేవలం ఉద్యమాలకే పరిమితం కావడం వలన ఉపయోగం ఉండదని భావించి ఉద్యమకారులే ప్రజా ప్రతినిధులుగా ఉండాలని వాదించారు. అందుకు ఐక్య కార్యాచరణ కమిటీలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు అంగీకరించని పక్షంలో జాదవ్ గారు అధ్యక్షులుగా, దేశిని చిన మల్లయ్య (మాజీ శాసన సభ్యులు) కార్యనిర్వాహక అధ్యక్షులుగా తెలంగాణ జనపరిషత్ ఏర్పాటు అయింది. 2009 పరిణామాల అనంతరం ఐక్య ఉద్యమాల అవసరాల దృష్టా జాదవ్ ఛైర్మన్‌గా టి.యు.ఎఫ్. ఏర్పాటు అయ్యింది. కేవలం తెలంగాణ ఉద్యమకారుడిగానే కాకుండా ప్రజా ఉద్యమాలలో జాదవ్ పాత్ర మరువలేనిది.
19902000 మధ్యకాలంలో తెలంగాణలో ప్రధాన సమస్యగా మారిన కరువు, హింస, ఎన్‌కౌంటర్లకు చలించిన జాదవ్ సోషలిస్టు పార్టీకి సమీపంగా ఉన్న పి.యు.సి.ఎల్.కు రాష్ట్ర అధ్యక్షునిగా పని చేసిన సమయంలో బూటకపు ఎన్‌కౌంటర్లపై ఉద్యమించారు. 2003 సం॥లో తెలంగాణలో హింసకు స్వస్తి చెప్పాలని అందుకు నక్సల్స్‌కు ప్రభుత్వానికి మధ్య చర్చలే పరిష్కార మార్గమని భావించి అందుకు కృషి చేశారు. శాంతి చర్చలకు ప్రతినిధిగా వ్యవహరించారు. హైదరాబాద్‌లో తరచు జరిగే మత కలహాలకు వ్యతిరేకంగా మత సామరస్యం కోసం ఎం.టి. ఖాత్‌తో కలిసి ఏక్‌తా హైదరాబాద్‌ను స్థాపించి హిందూ ముస్లిం ‘ఐక్యత’ కోసం పని చేశారు. ప్రజాస్వామ్యంలో సమస్యలు పరిష్కారం కాకపోతే కొందరు ఆయుధాలు పట్టే అవకాశం ఉన్నదని అందుకు సామాజిక ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభు త్వం విఫలం కారాదని అనేవారు. రాష్ట్రంలోని అన్ని నక్సలైట్ గ్రూపు అనుబంధ సంఘాలు జాదవ్‌తో సంబంధాలు నడిపేవి. సిద్ధాంతపరంగా విభేదించినప్పటికీ సమస్యల వారీగా తాను అందరితో కలిసి పని చేశారు. తాను అమితంగా అభిమానించే కాళోజీని తరచు గుర్తు చేసుకునే వారు.
19691971 ప్రాంతంలో తను నమ్మిన సిద్ధాంతం కోసం లోహియా విచార్ మంచ్ ఏర్పా టు కొరకు జాతీయ స్థాయిలో కృషి చేశారు. ఎమర్జెన్సీ కాలంలో 17 నెలలు జైలు జీవితం గడిపారు. అంతర్జాతీయ రాజకీయాలపై మంచి పట్టు ఉండేది. పి.యు.సి.ఎల్. రాష్ట్ర కమిటీ అధ్యక్షులుగా ఉన్న జాదవ్ కొన్ని అనివార్య కారణాల వలన తప్పని సరి పరిస్థితులలో దాని నుండి తప్పుకున్నారు. జాదవ్‌తోపాటు నేను, భార్గవ్ పి.యు.సి.ఎల్.కు దూరమైనాము. అనంతరం 2010వ సంవత్సరంలో పన్నాలాల్ సూరానా దేశ వ్యాప్తంగా సోషలిస్టు పార్టీ పునర్ నిర్మాణం కోసం యాత్ర చేసి హైదరాబాద్‌లో జాదవ్‌ను కలిసినారు. ఆ ప్రయత్నంలోనే దేశంలోని వివిధ రాష్ట్రాలలోని సీనియర్ సోషలిస్టుల సారథ్యంలో పుణెలో జరిగిన సన్నాహక సమావేశానికి జాదవ్‌తో మేము వెళ్లాము. ఆ రెండు రోజుల సమావేశంలో పార్టీ రాజ్యాంగ కమిటీ ఛైర్మన్‌గా జాదవ్‌ని ఎన్నుకోవడం జరిగింది. సంవత్సర కాలం అనంతరం హైదరాబాద్ కేంద్రంగా సోషలిస్టు పార్టీ (ఇండియా) ఆవిర్భావ సభ జరిగింది. అందులో జాదవ్ జాతీయ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పటికీ దానిని ఆయన సున్నితంగా తిరస్కరించారు. అది ఆయన మాటల్లోనే “నేను తెలంగాణ కోసం పని చేయాల్సింది ఉంది కావున పార్టీ అధ్యక్ష స్థానానికి న్యాయం చేయలేను, ప్రస్తుతం తెలంగాణ సాధనే నా కర్తవ్యం” అని చెప్పారు. దానికి బదులుగా సదస్సు వత్తిడి మేరకు ఉపాధ్యక్షునిగా అంగీకరించారు. ఒకటి, రెండు సార్లు తప్ప పార్టీ కార్యక్రమాలలో పెద్దగా పాల్గొన లేదు. అందుకు కారణం తెలంగాణ ఉద్యమంలో నిమగ్నమవడం. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నాయకులు ముందు తన పార్టీకి తదుపరి తెలంగాణకు ప్రాధాన్యతనిచ్చే వారు. జాదవ్ మాత్రం తన పార్టీ కంటే తెలంగాణకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు అందుకే తాను “మిష్టర్ తెలంగాణ”.

వలిగొండ విజయరాజ్
8143446626