Home కలం ప్రగతిశీల మానవీయ కవి

ప్రగతిశీల మానవీయ కవి

CM KCR Condole to Singireddy Narayana Reddy in Telangana

కవి కాలానికి ప్రతినిధి. ఎదుగుతున్న దశలో నడుస్తున్న కాలం వేసే బలమైన ముద్ర కవి జీవితమంతా విస్తరిస్తుంది. రుతువులెన్ని మారుతున్నా, దృ శ్యాలు ఎప్పటికప్పుడు కొత్త గా వికసిస్తున్నా, ఏనాడు ఏ దశలో వన్నెతగ్గని ప్రకృతి వంటి వాడు కవి. కాలమెంత వింత పోకడలు పోతుందో కవి అంత వినూత్న పోకడలతో విస్తరిస్తుంటాడు. కాలం ఎత్తిపట్టిన బహుతేజోవంతమైన కవి సింగిరెడ్డి నారాయ ణరెడ్డి. పద్యం రాసినా, పాట రాసినా, వచన కవిత రాసినా, మాత్రాచ్ఛందం రాసినా ప్రతి అక్షరం మీద నారాయణ రెడ్డి సంతకం ఉంటుంది. ఆయన రచనా శైలి ఆయన ఎంచుకున్న కవితా ప్రస్థానం ఆయనకే ప్రత్యేకం. తనపట్ల, లోకంపట్ల, సాహిత్యంపట్ల స్పష్టమైన దృక్పథాన్ని నిర్మించుకోగలిగిన దార్శనికుడా యన. ఏ రూపం తన ప్రతిభను ఆవిష్కరించ గలుగుతుందో ఏ వాదం తన హృదయాన్ని ప్రకటిస్తుం దో ఏ సంవిధానం లోకానికి చేరువ చేస్తుందో ఎంచు కొని, ఒక ఎరుకతో పథ నిర్దేశం చేసుకున్న మహాకవి డాక్టర్ సి.నారాయణ రెడ్డి.
“నా వచనం బహువచనం / నా వాదం సామ్య వాదం
కవిత్వం నా మాతృభాష / ఇతివృత్తం మానవత్వం” నారాయణ రెడ్డి కవిత్వ ప్రపంచంలో ప్రవేశించి, స్పష్టత ఏర్పర్చుకున్న తర్వాత ప్రకటించిన పంక్తులవి. ఆ మాటల లోతుకర్థం, మూలం అప్పటికి తెలుగు సాహిత్యంలో నెలకొని ఉన్న కాల పరిస్థితుల్లో ఉన్నది. ఇప్పటి దృష్టితో చూస్తే సినారె బోధపడడు. తెలుగు సమాజంలో 1950ల నాటి పరిస్థితి వేరు. ‘విశాలాంధ్ర లో ప్రజారాజ్యం’ ఏర్పడాలన్న భావన తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటాన్ని విర మింపచేసింది. ఎన్నికల కోలాహాల మొకవైపు, సమైక్య రాష్ట్ర సమాలోచన లొకవైపు, నెహ్రూ సామ్యవాద ఆకర్షణల ప్రభంజనం, తెలంగాణ సొంత అస్తిత్వ ఆరాటం, నాలుగు రహదారుల మధ్య కలం పట్టిన కవి నారాయణరెడ్డి. అభ్యుదయ సాహిత్య సమాలోచనల ప్రభావం ఉన్న అంతకు ముందటి తీవ్రత లేదు. ఉద్యమకారులు భారత యూనియన్‌లో హైదరాబాద్ విలీన దశలో కొందరు, 52 ఎన్నికల దశలో కొందరు ప్రత్యక్ష రాజ్యాంగ రాజకీయాల్లో వచ్చారు. సాహిత్య కారులు, కళాకారులు ఉద్యమ వేడి చల్లారిన తర్వాత సినిమా రంగంవైపు, పత్రికా రంగంలోకి వెళ్లవలసి వచ్చింది. రాజకీయంగా సామాజికంగా నెలకొన్న గందరగోళం, అస్పష్టత సాహిత్య రంగంలోనూ నెలకొన్నది. సంప్రదాయ, ఆధునిక సాహిత్య వాదాల సంఘర్షణ కూడా తోడుగా సాగుతున్నది. ఇలాంటి సందర్భంలో ప్రవేశించిన కవి నారాయణరెడ్డి. తెలం గాణవంటి అంతంత సాహిత్య వాసన మాత్రమే ఉన్న ప్రాంతం నుంచి, హనుమాజీ పేటవంటి మారుమూల పల్లె నుంచి, అదీ ఒక మోతుబరి రైతు కుటుంబం నుంచి గావురంగా పెరిగి జానపదాల పరిమళాల నడుమ నుంచి ఆడుతూపాడుతూ గాలంత స్వచ్ఛంగా వచ్చిన కవి తన దారి తాను నిర్మించుకోడానికి పడిన తాపత్రయం ఇంతింతన రానిది. ఆ భూమికి నుంచి అర్థం చేసుకున్నప్పుడే సి.నారాయణరెడ్డి ఔన్నత్యం అవగతమౌతుంది. కవి “తేజస్సు కోసం తపస్సు చేసి శిఖరం చేరుకున్న నిరంతర కృశీవలుడు సినారె. ఎదుగుదల, కళ్లు చెదరగొట్టే తేజస్సుతో అటు మాత్రాఛందస్సులోనూ, పాటల్లోనూ తేజరిల్లింది…. అందరి చేత ఆమోదం పొందిన కవి సినారె” అని విశ్లేషించాడు కె. శివారెడ్డి.
“మనసుపెట్టి పరిశీలిస్తే ప్రతి మనిషీ ఒక గ్రంథం” అని సినారె దృక్పథం. “ఇది నిత్య ప్రస్థానం – ఎగుడు దిగుళ్లు తప్పవు. ఇది నిత్య ప్రయోగం – ఎదురు దెబ్బ లు తప్పవు” సినారె అనుభవంలో ఎదురు దెబ్బలు, ఎగుడు దిగుళ్లు తప్పలేదు. ఏ కవికైనా తప్పనిసరి. ఏడు దశాబ్దాలుగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిబ్బరం గా నడిచిపోయిన ధీరగంభీరుడు నారాయణరెడ్డి. నడిమి కాలంలో చాలా వాదాలు సాహిత్య ప్రపంచాన్ని కుదిపి వేసినాయి. దిగంబర కవిత్వంలో, విప్లవ ప్రభంజనం, స్త్రీ వాదం, దళిత చైతన్యం, మైనారిటీ స్పృహ, ప్రాంతీయ అస్తిత్వం, ఎన్నికుదుపులు. జాతీయ, అంతర్జాతీయ సిద్ధాంతాలు, తత్వాలు ఎన్ని సన్నివేశాలు. ఏ జాతి భాషా సాహిత్యాలయినా స్థిరంగా ఉండవు. నిత్య పరిణామ శీలంతో, చైతన్య హేలలతో సుసంపన్నమవుతాయి. చలన, సంచలన భరితంగా కదులుతుంటాయి. అయినా, నారాయణరెడ్డి పొంగ లేదు. కుంగలేదు. కుదుపుకులోను కాలేదు. అన్ని ధోరణులకు, వాదాలకు గర్భీకరించుకున్న మానవతా వాదం ఆయనది. “నాది ప్రధానంగా ప్రగతిశీల మానవతా దృక్పథం. దీనికి ఎన్నో అంచులు న్నాయి.ఒక్కో అంచులో ఒక్కో సామాజికాంశం. మానవీయ పార్శం ప్రతిఫలిస్తుంది ” అని ప్రకటించుకున్నాడు. ఎక్కడా తొణకలేదు. తొట్రుపడలేదు. నిబ్బరంగా నిలబడ్డాడు. విస్తరించాడు. దేవులపల్లి ప్రభాకర రావు మాటల్లో “ఇజం గొడవలతో వాద వాదాల తో సంబంధం లేని నిజమైన కవి సినారె. మానవతా వాదమే ఆ మహాకవి ఇజం”.
“మాటకు దండం పెడతా / పాటకు దండం పెడతా మాటను పాటను నమ్మిన మనిషికి దండం పెడతా// మనిషిని కవిత్వ కేంద్రంగా చేసుకొని విజృంభించాడు. దృక్పథా లు, సిద్ధాంతాలు, తత్వాలు అన్నీ మానవ జీవితం నుంచి ఉత్పన్నమైనవే. ఆయా సిద్ధాంతాల, భావ జాలాల ప్రాధాన్యతలు కాల సందర్భాలను బట్టి తరచుగా మారుతుంటాయి. ఉధృతిగా లోనయినట్టే పరిమితికి కూడా లోనవుతాయి. అందువల్ల విశాల ప్రజాస్వామిక వాదిగా ప్రగతి శీల మానవతా వాదాన్ని స్వీకరించాడు. మానవతా వాదం విశాలమైందే అయి నా తిరోగమనయానం కూడా ఉండవచ్చు. అక్కడ స్పష్టమైన వైఖరితోనే ప్రగతి వైపు ప్రయాణించాడు. మంటలూ మానవుడూ ఆయన.
“మండుటెండలకు భరత వాక్యం / మబ్బురాక / వానరాకకు నాందీ శ్లోకం / మట్టి కేక” మట్టికయినా మనిషికయినా అరుపు తొలి ఆయుధం. ఆయన కవితల నిండా మనిషి అల్లుకున్నాడు. మట్టి పొదువు కున్నాడు. మట్టి మనిషీ ఆకాశం కదా తన రచన. పూలూ, కొమ్మలూ పక్షులకూ నెలవైన చెట్టుకు జన్మనిచ్చేమట్టి, కలలూ,కన్నీళ్లూ కళలకూ , యుద్ధాల కూ ప్రాణం పెట్టి బతికించే మనిషి, వెలుగూ, వెన్నెలా, ఎత్తూలోతూ దిగంతాలను ధరించిన ఆకాశం నారా యణరెడ్డి ఇష్టమైన కవితా వస్తువులు. ఊహలన్నీ వీటి చుట్టే పరిభ్రమిస్తుంటాయి. గజళ్లుగా, పద్యాలుగా, గేయాలుగా కవితలుగా విహాయసంలో ఎగురుతూ ఆదుకొమ్మని, హత్తుకొమ్మని ఆహ్వానిస్తుంటాయి. అన్నిటా పెద్ద పీట మానవునికే.
“పరిమళాల నెవడాపును? / పైరగాలి నెవడా పును?” ఎవడాపును మానవతా రవి రుక్కును, కవి వాక్కును”. సరళత నారాయణరెడ్డి శైలి. సామాన్య పాఠకునికి అందేటంత స్పష్టత. అగాధం ఇష్టపడడు. అన్యాయం, అర్థం రెండింటినీ అనుసరించాడు. సమా సాలు వేసినా సాధారణ పదాలు ప్రయోగించినా ఆయనదైన పద సముదాయం, డిక్షన్ సృష్టించు కున్నాడు. ఆ శైలికి చమత్కారం, అలంకారం అదనంగా దిద్దుతాడు. ఒక్కోసారి అర్థం అందేలోపల శబ్దం ఆకర్షిస్తుంది. భావానికి చేరువగా తీసుకెళు తుంది. ప్రాసల ప్రాధాన్యతతో తొలుత కవిత్వం రచించినా రానురాను పద చిత్రాలతో ప్రతీకలతో పరిపుష్టం చేసుకుంటూ సాగాడు. వచన కవితలోనూ గేయలయాత్మను చొప్పించి ప్రత్యేక శిల్పాన్ని సాధించా డు. ప్రశ్నా, సమాధానం పద్ధతిలో తరచుగా రచించటం వల్ల సూటిగా తాకుతుంది. ‘మబ్బులో ఏ ముంది?’ అనే పాట, అట్లాంటి కవితలు ఎన్నో.
“లక్ష ప్రాణాలను ఆర్పేసిన కత్తి / ఒక్క ఊపిరిని వెలిగిస్తుందా? ఉర్వీతలాన్ని వణికించిన శక్తి / ఒక్క హృదయాన్ని గెలుస్తుందా?” ఆయుధాన్ని, యుద్ధాన్ని నిరసించి మనిషికీ, హృదయానికి పట్టం కట్టాడు. సామాజిక అసమానతలకు కారణమైన కులాన్ని, వర్ణ వ్యవస్థను ఖండించాడు. ‘గాలికి కులమేది?’ అని తాత్వికంగా ప్రశ్నించాడు.
“ఏ కులము వెన్నెలది? / తెమ్మెర లెట్టి జాతికి చెందినట్టివి? అట్టిదే కద మానవత్వము / అన్నిటికి ఎత్తయిన సత్యము ” అక్కడితో ఆగలేదు. మనుషుల్లో పొడసూపే అవకాశ వాదాన్ని ఎత్తి చూపాడు. “మాల మాలయని మచ్చరించి మీసాలు దువ్వెదవదేలా? మాలడే మహామంత్రియైన పూలమాల వేసేదవదేలా? ” పదవిలో ఉంటే కులాన్నిగౌరవించే తత్తాన్ని లేకపోతే మచ్చరించే మనస్తత్వాన్ని సహించలేదు. అక్కడ ఉన్న హోదాను, ఆర్థిక కోణాన్ని దాచే మానవత్వాన్ని ప్రేమించి శ్రామిక దృక్పథానిన సందర్భాన్ని బట్టి వ్యక్తీకరించాడు.
“శ్రమజీవి చెమట బిందువులో / ఆణిముత్యమూ వుంది అగ్ని గోళమూ ఉంది” ఏ మహాకవైనా ఒకే రోజు రూపొందడు. రాత్రికి రాత్రే రాణించడు. ప్రతి కవీ కొత్త కవిగా సాహిత్యంలో ప్రవేశించవలసిందే. యువ కవిగా ప్రయాస పడవలసిందే. అట్లా అనిపిస్తుంది కానీ ఏదీ ఎవరికీ అంత తొందరగా అందదు. ‘అందీ అందని కవితా చేలాంచలాల కోసం ’ శ్రీశ్రీ పడిన తపన తక్కువ కాదు. ‘సకలమ్ము కోలోపోయి ‘రాత్రీ దినముల్’ రచియించిన దాశరథి అవస్థలెన్నో. సినారె యువకవిగాపడిన ప్రయాస, ఎదుర్కొన్న అనుభవాలు తక్కువేం కాదు. ఆగస్టు 1954 ‘సారస్వత జ్యోతి ’ పత్రికలో సినారె రాసిన చిన్న వ్యాసంలో అప్పటి పరిస్థితిపట్ల ఆవేదన కనబడుతుంది.
“యువ రచయితలను చులకనగా చూడటం, వాళ్లను తృణ ఖండాలుగా త్రోసి పారెయ్యడం కొందరు పెద్ద మనుషులకలవడ్డ విద్య. ఈనాడు గట్టుపై కూచుని వేళ్లు చూపే వారు ఒకనాటి మోకాలి బంటి నీళ్లల్లో కాళ్లూ చేతులూ కొడుతూ ఈదులాడిన వాళ్లే. గతం జ్ఞాపకం చేసుకుంటే ఈ పరిహాసాలు, ఈ కువిమర్శలు మంచులా మాయమవుతాయి ” అని రాశాడంటే ఆయన సాహత్యంలో అడుగుపెట్టిన నాడు లబ్ద ప్రతిష్టులు కొందిరిపట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేయక తప్పలేదు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా మహాకవి మరణానంతరం కొందరి చిన్నబుద్ధులు సాంఘిక మాధ్యమాల్లో తొంగి చూస్తున్నాయి. ఇవి ఇప్పుడూ ఉన్నాయి. ఉంటాయి. నారాయణ రెడ్డి తేజస్సును అవి అణుమాత్రం తగ్గించలేవు. నారాయణరెడ్డి అక్షరాలను ప్రేమిస్తేనే తన ప్రస్థాన ఘనత తెలుస్తుంది.
“స్తబ్ద దశాబ్దంలో నారాయణరెడ్డి గారి అసామాన్యమైన మనిషిలోని తపనంతా అక్షరీకరిం చాడు. చారిత్రకంగా మనిషి ఎదుగుతూ ,విస్తరిస్తూ వచ్చిన క్రమ పరిణామాన్ని కవితాత్మకంగా చిత్రించా డు. భిన్న సన్నివేశాల్లో ఉక్కిరి బిక్కిరయిన మనిషి ఉద్వేగాలన్నిటిని పదాల్లో కెత్తి ప్రకటించాడు. నవ రసాలు సరిపోకపోతే రెండు రసాల అల్లికతో కొత్త పార్శాన్ని ఆవిష్కరించాడు. దాన్ని ‘కరుణ వీరము’ అని పిలిచాడు. శృంగారం ఆయనకిష్టసరమే అయినా కరుణ వీరమే హృదయాన్ని ఆకట్టుకున్నరసం. ఆత్మలను పలికించే అసలైన భాష కోసమే నారాయణ రెడ్డి అన్వేషించాడు. మనిషిని సమగ్రంగా ఆవిష్కరిం చాలనే భావుకత ఎంతటిదో భాషను సంపూర్ణంగా పట్టుకోవాలనేఆరాటం అంతటిది. అప్పుడే కవిత్వానికి నిండు దనం వస్తుందని భావించాడు. “ఏ వస్తువును తీసుకున్నా దాన్ని భావ గర్భితంగా చెప్పాలి. ప్రకటనలాగా చెప్పవద్దు. కనీసం చమత్కారంగానైనా, అలంకారికంగానయినా చెప్పాలి. ఎటొచ్చీ హృదయా నికి హత్తుకునే రీతిలో చెప్పాలి”.
ప్రణయానికే పరిమితమై సౌందర్యాత్మకంగా సాగే ఉర్దూ గజల్ ప్రక్రియను తెలుగులోకి తేవటం ఒకటయితే, దాన్ని పరిధిని విస్తరించి సామాజిక భావోద్వేగాల కనుగుణంగా మలచి మంచి ప్రయోగం సాధించాడు. నాలుగు లైన్ల రుబాయికి ఐదో లైను చేర్చి ప్రపంచ పదులు రచించి కొత్త ఒరవడి సృష్టించాడు. కంద పద్యంలోని రెండు చిన్న ( మూడు గణాలు) పంక్తులొక చోట, రెండు పెద్ద పంక్తులు (ఐదు గణాలను) ఒక చోట చేర్చి మాకందాలు రూపొందిం చాడు. మాత్రాచ్ఛందంలో లెక్కలేనన్ని ప్రయోగాలతో, వివిధ నడకలతో హోరెత్తించి రక్తి కట్టించాడు.
“చిరునవ్వుకు మించింది లేదు / ఏ పెట్టుబడీ అక్కర్లేదు. ఎంతవాడినా తరిగేది కాదు.”
కవిత్వాన్ని ప్రేమించినంతగా మనిషినీ, మనిషి చిరునవ్వునూ ప్రేమించాడు. మనిషి ఉన్నంత కాలం పెదాల మీద పద సంపద ఉన్నంత కాలం ముఖాన మందహాసం ఉన్నంత కాలం నారాయణరెడ్డి అక్షరం ఉంటుంది. ఆలాపన ఉంటుంది.