Home రాష్ట్ర వార్తలు బదిలీలపై నిషేధం

బదిలీలపై నిషేధం

Prohibition on transfers

గడువు ముగియడంతో అమల్లోకి  అసాధారణ పరిస్థితుల్లో తిరిగి అవకాశం

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రభుత్వ విభాగాలు, హెచ్‌ఒడిల్లో సాధారణ బదిలీల పర్వం ముగియడంతో గత నెల ఉత్తర్వుల ప్రకారం రెండు రోజుల క్రితం నుంచే బదిలీలపై నిషేధం అమల్లోకి వచ్చింది. ఏదేని పరిస్థితుల్లో బదిలీ ప్రక్రియకు సాంకేతిక ఇబ్బందులు ఏర్పడినట్లయితే మరికొన్ని రోజుల గడువు ఇస్తామని, ఇది ప్రత్యేక అవసరాలకు మాత్రమేనని సచివాలయ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. యధావిధిగా బదిలీలపై నిషేధం అమల్లోకి వచ్చినప్పటికీ ఇది దానికి అదనంగా ఇచ్చే వెసులుబాటు అని వ్యా ఖ్యానించారు. ముఖ్యంగా భార్యాభర్తలు ఇరువురూ ఒకేచోట ఉండేలా బదిలీ ఉత్తర్వుల్లోనే ప్రభుత్వం స్పష్టంగా పేర్కొందని, తాజాగా ముగిసిన బదిలీ ప్రక్రియలో ఈ స్ఫూర్తికి ఎక్కడైనా విఘాతం కలిగినట్లయితే, వారిలో అసంతృప్తి ఉన్నట్లయితే పరిష్కరించడానికి కొంత వెసులుబాటు ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా భార్యాభర్తల బదిలీ జరిగినట్లయితే అందులోని వాస్తవాలను పరిశీలించిన తర్వాత సంబంధిత మంత్రి ఆదేశం మేరకు పరిష్కారం చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇది సిఫారసుల తీరులో జరిగి తే మంత్రుల చుట్టూ పైరవీ లు మొదలవుతాయని, అం దువల్లనే ప్రభుత్వ స్ఫూర్తికి భిన్నంగా భార్యాభర్తలు వేర్వేరుచోట్ల పనిచేయాల్సిన పరిస్థితులు తలెత్తితే మానవతా దృక్పథంతో పాటు నిబంధనలను పకడ్బందీగా అమలుచేసేలా మాత్రమే మంత్రి చొరవ తీసుకుని పరిష్కరిస్తారని ఆ అధికారి వివరించారు. అయితే భార్యాభర్తలు ఒకేచోట ఉం డాలనే నిబంధనకు చాలా రకాల నిర్వచనాలు వస్తున్నాయని, భార్యాభర్తల్లో ఒకరు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరొకరు ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నట్లయితే అలాంటి సందర్భాల్లో ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయని, ప్రైవేటు ఉద్యోగాల విషయంలో అందరికీ న్యాయం చేయలేమని, అలాంటి అంశాల్లో ఉన్న అవసరాన్నిబట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు.

నిషేధం విధిస్తూ ఉత్తర్వుల జారీ : సాధారణ బదిలీలకు ఇచ్చిన గడువు ఈ నెల 15వ తేదీతోనే ముగిసిపోవడంతో మరుసటి రోజు నుంచి మళ్ళీ బదిలీలపై నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతులు పొందిన ఉద్యోగులకు త్వరలోనే ఉత్తర్వులు జారీ అవుతాయని, ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టుల్లోనే ఈ భర్తీ జరుగుతుందని, పదోన్నతి పోస్టు కోసం ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను బదిలీ చేసే ప్రసక్తే లేదని సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి స్పష్టం చేశారు. డిప్యూటేషన్లు, రివర్షన్లు, మాతృసంస్థకు రావడం… ఇలాంటివారికి ఖాళీ పోస్టుల్లో చేరేందుకు ఉత్తర్వులు వస్తాయని, ఈ కారణంగా ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయబోమని పేర్కొన్నారు. దీర్ఘకాల సెలవుపై వెళ్ళి తిరిగి విధుల్లో చేరేవారికి కూడా ఎలాంటి ఆటంకం లేదని, ప్రస్తుత ఉద్యోగులను వారి కోసం బదిలీ చేసే అవకాశం లేదని, దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళేవారి పోస్టులు కూడా యధావిధిగానే కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం బదిలీ ప్రక్రియ ముగిసినందున రానున్న ఆరు నెలల వరకు ఎలాంటి మినహాయింపులు ఉండబోవని, ఇప్పుడు జరిగిన బదిలీల ప్రకారం ఉద్యోగులు కొత్త పోస్టుల్లో చేరాల్సిందేనని, ఆరు నెలల తర్వాత మళ్ళీ బదిలీ అవసరని ఆ ఉద్యోగులు భావించినట్లయితే సచివాలయంలోని అడ్మినిస్ట్రేటివ్ విభాగం ద్వారా ప్రధాన కార్యదర్శి, ఆర్థిక ముఖ్య కార్యదర్శి, సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఆ తర్వాత వెలువడే ఉత్తర్వుల మేరకు నిర్ణయం ఉంటుందని వివరించారు. పరిపాలనా పనితీరును మెరుగుపర్చడంలో భాగంగా ఒకవేళ ఏదేని పరిస్థితుల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేసే క్రమంలో కనీసం ఒక ఏడాది పాటు అదే విభాగంలో సర్వీసులో ఉన్న ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని, సహేతుకం అని భావించిన తర్వాతనే ఆర్థికశాఖ నుంచి అనుమతి పొంది భర్తీ చేయాలని పేర్కొన్నారు. పైన పేర్కొన్న ఉత్తర్వులకు భిన్నంగా బదిలీ అయిన ఉద్యోగులకు వేతనాలు చెల్లించవద్దని ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్, డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ విభాగాల అధికారులకు ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ఈ ఉత్తర్వుల్లో ఆదేశాలు జారీచేశారు.

సెకండరీ టీచర్లకు మాన్యువల్ కౌన్సిలింగ్ : ఉపాధ్యాయుల బదిలీలకు ఈ నెల 21 నుంచి జరగనున్న వెబ్ కౌన్సిలింగ్‌కు బదులుగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని పిఆర్‌టియు (ప్రోగ్రెసివ్ రికగ్నయిజ్డ్ టీచర్స్ యూనియన్) ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషిలకు విజ్ఞప్తి చేయడంతో పాటు ముఖ్యమంత్రిని కూడా కోరారు. రాష్ట్రంలో సుమారు 1.20 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారని, ఇందులో సుమారు 50 వేల మందికి బదిలీ అవకాశం ఉందని, అయితే దరఖాస్తులు మాత్రం దాదాపు 75వేల పైనే వచ్చాయని, ఒకేసారి వీరందరికీ వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించడం కష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. హెడ్‌మాస్టర్‌లు, సీనియర్ అసిస్టెంట్‌లు తక్కువ సంఖ్యలో ఉంటున్నందున వారికి వెబ్‌కౌన్సిలింగ్‌ను నిర్వహించి దాదాపు 35 వేల మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని, గతేడాది ఏపీ ప్రభుత్వం సైతం వెబ్‌కౌన్సిలింగ్ ద్వారా తలెత్తిన ఇబ్బందుల అనంతరం మాన్యువల్ కౌన్సిలింగ్‌నే నిర్వహించిందని సిఎస్‌తో చర్చల సందర్భంగా పిఆర్‌టియు ప్రతినిధులు వివరించారు.