Home జాతీయ వార్తలు నిరసన జ్వాలా

నిరసన జ్వాలా

JNU-Protestకన్హయ్య అరెస్టుపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసన,
వెంటనే విడుదల చేయాలని డిమాండ్,

పాటియాలా కోర్టులో దాడులకు తీవ్ర ఖండన,

రాష్ట్రపతిని కలిసి ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ,
జోక్యానికి విజ్ఞప్తి, కేంద్ర హోంమంత్రిని కలిసిన సురవరం

న్యూఢిల్లీ: దేశ ద్రోహం కేసులో అరెస్ట్ చేసిన జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఢిల్లీ,అలీఘడ్ (యుపి), బెగుస రాయ్, పాట్నా (బీహార్), గువహతి (అసోం), చెన్నై (తమిళనాడు) నగరాలలో విద్యార్థులు, రాజకీయ పార్టీ లు, ఉపాధ్యాయులు, కళాకారులు ముక్తకంఠంతో విడు దల చేయాలంటూ ఎలుగెత్తారు. అలీఘడ్ ముస్లిం యూనివర్శిటీలో వేలాది విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో విద్యార్థులు, జర్నలిస్టులపై దాడిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ మాట్లాడుతూ గూండా బలగాల నుంచి యావత్ జ్యుడిషియల్ వ్యవస్థకే బెదిరింపులు వస్తున్నాయని, ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని మండిపడ్డారు. ఇక్కడి కెన్నడీ హాల్ గ్రౌం డ్ వద్ద జరిగిన నిరసన సమావేశంలో విద్యార్థులు, పలు వురు సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు. నిరసన ర్యాలీ కన్వీనర్ మహఫూజ్ ఆలం మాట్లాడుతూ భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించేలా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారని, దేశ రాజధా ని ఢిల్లీలో ఇలాంటి సంఘటనలు జరగడం శోచనీయమ న్నారు. ఇలాంటి ఘటనలను నిరసిస్తూ వేర్వేరు విద్యార్థు లంతా ఏకతాటిపై నిలిచి పోరాటం చేయడం అభినందనీ యమన్నారు. అనంతరం ప్రముఖ చరిత్రకారుడు హబీబ్ ‘పిటిఐ’తో మాట్లాడుతూ కోర్టు ఆవరణలలోనే భారత న్యాయవ్యవస్థను అణిచివేసే కార్యక్రమం జరుగుతోం దని గత కొద్దిరోజుల పరిణామాలు రుజువు చేస్తున్నాయ న్నారు. బుధవారం చోటుచేసుకున్న సంఘటనలో సు ప్రీంకోర్టు పోలీసుల పాత్రను తప్పక లోతుగా పరీక్షించా లని హబీబ్ చెప్పారు. మరోవైపు కన్హయ్య అరెస్ట్‌ను ఖం డిస్తూ గువహతిలో కూడా వందలాది కళాకారులు, ఉపా ధ్యాయులు, విద్యార్థులు, రైతులు అసోం రాజధానిలో బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. కృషక్ ముక్తి సంఘం సమితి (కెఎంఎస్‌ఎస్) ఆధ్వర్యంలో నిర్వ హించిన నిరసన ప్రదర్శనలో అనే క విద్యార్థి సంఘాలు భాగస్వాములయ్యాయి. కోర్టు ఆవరణలలో పదేపదే హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడం ఆర్‌ఎస్ ఎస్-బిజెపి సృష్టిస్తోన్న ‘ఉగ్రవాద వాతావరణం’లో భాగమేనని ఆరోపించారు. కెఎంఎస్‌ఎస్ అధ్యక్షుడు అఖి ల్ గొగోయ్ మాట్లాడుతూ ‘ఈరోజు ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి మనం ఏ దుస్తులు ధరించాలి, ఏం తినాలి, ఏమి చూడా లి, మాట్లాడాలన్న విషయమై నిరంకుశ ధోరణిలో ఆదేశి స్తున్నది’ అని మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
చెన్నైలో వామపక్ష విద్యార్థి సంఘాల ర్యాలీ
జెఎన్‌యు విద్యార్థుల అరెస్టుకు నిరసనగా చెన్నైలో ర్యాలీ నిర్వహించారు. వామపక్ష విద్యార్థి సంఘాలు ఈ ర్యాలీ నిర్వహించాయి. ప్రజాకవి కోవన్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమని ఆయన అన్నారు. అరెస్టు చేసిన జెఎన్‌యు విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ర్యాలీలో పాల్గొన్న వక్తలు డిమాండ్ చేశారు. మరోవైపు పోలీసలు విద్యార్థులు, కోవన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
పాట్నాలో నిరసన-ఘర్షణ
దేశద్రోహం కేసులో కన్హయ్యను అరెస్ట్ చేయడాన్ని నిరసి స్తూ బీహార్ రాజధాని పాట్నాలోని బిజెపి రాష్ట్ర కార్యాల యం ముందు గురువారం అఖిల భారత విద్యార్థి సమా ఖ్య (ఎఐఎస్‌ఎఫ్) నాయకులు, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్ జెడి) కార్యకర్తలు నిరసన చేపట్టారు. అయితే బిజెపి కార్యకర్తలు కూడా నిరసన తెలియజేస్తుండగా ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై మరొకరు నీటి సీసాలను విసురుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నగర ఎస్‌పి చందన్ కుశ్వాహ మీడి యాతో మాట్లాడుతూ సిపిఐ అనుబంధ విద్యార్థి సంఘం ఎఐఎస్‌ఎఫ్ , లాలూ ప్రసాద్ పార్టీకి చెందిన యువజన విభాగం కార్యకర్తలు బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్దకు చేరుకుని కన్హయ్య అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ నిరసన తెలియ జేశారని, ఈ సందర్భంగా ఘర్షణ తలెత్తిందన్నారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టినట్టు నగర ఎస్‌పి చెప్పారు.
కన్హయ్య స్వస్థలంలో సాయుధ పోలీసులు
ఢిల్లీ కోర్టు ఆవరణలో కన్హయ్యపై న్యాయవాదులు దాడి చేసిన నేపథ్యంలో ఆయన స్వస్థలం బిహత్ గ్రామంలోని మక్సాస్‌పూర్ తొలాలో గట్టి పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. కన్హయ్య కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించడం లో భాగంగా గట్టి పోలీస్ భద్రతను ఏర్పాటు చేసినట్టు బెగుసరాయ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌పి) మనోజ్‌కుమార్ తెలిపారు.
‘ఐదుగురు సాయుధ పోలీసు లతో కూడిన ఒక పోలీసు బృందాన్ని మేం కన్హయ్య స్వస్థ లంలో భద్రత కోసం నియమించాం. కన్హయ్య కుమార్ ఇంటి వద్ద ఎఫ్‌సిఐ పోలీస్ స్టేషన్ అధికారిని కూడా అక్కడికి పంపించాం’ అని ఎస్‌పి చెప్పారు. అసోంలోని బోంగాయ్‌గాంలోని ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కన్హయ్య పెద్ద సోదరుడు మనికాంత్‌సింగ్, ఢిల్లీలో చదువుతోన్న ఆయన చిన్న సోదరుడు ప్రిన్స్ కుమార్ స్వస్థలానికి వచ్చి తల్లిదండ్రులకు తోడుగా ఉంటున్నారు. కన్హయ్య తల్లి అంగన్‌వాడీ సేవికగా పనిచేస్తోంది. కొద్దికాలం క్రితమే తండ్రి పక్షవాతంతో మంచం పట్టాడు.