Home తాజా వార్తలు రైతు కంట వెలుగు

రైతు కంట వెలుగు

Protest in the Congress regime did not come to power

కాంగ్రెస్ హయాంలో ధర్నాతోనే కరెంటు : హరీశ్‌రావు

మన తెలంగాణ/సిద్దిపేట : కాంగ్రెస్ హయాంలో ధర్నా చేయనిదే కరెంటు సరిగా వచ్చేది కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సిఎం కెసిఆర్ ఎరువులు, విత్తనాల కొరత లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరం అందిస్తూ రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట మండలం, ఇర్కోడు గ్రామంలోని లావణ్య గార్డెన్‌లో ఏర్పాటు చేసిన రైతు బంధు జీవిత బీమా పత్రాల పంపిణీ కార్యక్రమం లో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కాం గ్రెస్ పాలనలో రైతులు పిట్టల్లా చనిపోయారని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సిఎం కెసిఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తూ ఎంతగానో విశ్వాసం కల్పించారన్నారు. దీంతో రైతుల్లో మనో ధైర్యం పెంపొంది ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయని వివరించారు. ప్రస్తుతం బీమా పథకంతో రైతుల్లో మరింత ధీమా పెరిగిందన్నారు.రైతుకు రూపా యి ఖర్చు లేకుండా ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించి రూ.5లక్షల బీమాను అందిస్తుందన్నారు.

ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే వారం రోజుల్లోపే రూ.5 లక్షల బీమా సొమ్మును వ్యవసాయ అధికారులే ఆ కుటుంబానికి అందిస్తారన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అంధకారంలో కూరుకపోయిందన్నా రు. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరెంటు సమస్య తలెత్తుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు కట్టాలంటే కొన్ని దశాబ్దాలు పట్టేదని, టిఆర్‌ఎస్ పాలనలో ప్రాజెక్టు పనులు అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయన్నారు. పది సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ సుమారు 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తే నాలుగేళ్ళలో టిఆర్‌ఎస్ సర్కారు 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందిస్తుందన్నారు. త్వరలో మరో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

రైతే రాజు అని గొప్పగా చెప్పుకునే విధంగా సిఎం కెసిఆర్ పాలన కొనసాగిస్తూ రైతుల్లో విశ్వాసం కల్పిస్తున్నారన్నారు. గోదావరి నుంచి సముద్రంలో వృధాగా కలిసిపోతున్న 500 టిఎంసిల నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రతి ఎకరానికి నీరు అందించడమే లక్షంగా చిత్తశుద్ధ్దితో పని చేస్తున్నామన్నారు. రైతులు పండించిన ప్రతి పంటకు రాష్ట్ర సర్కారే మద్దతుధర అందించి కొనుగోలు చేస్తుందన్నారు. రైతాంగానికి సబ్సిడీపై పని ముట్లు, యంత్రాలు, విత్తనాలు, ఎరువులతోపాటు రైతు బంధు పథకం కింద పంట పెట్టుబడి సహాయం, బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దేనన్నారు. ఏ పంట వేయాలో, అధిక రాబడులు ఎలా వస్తాయో అని చర్చించుకునేలా రైతుల కోసం రైతు వేదికలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిఎం కెసిఆర్‌తోనే రైతుల సంక్షేమం జరుగుతుందన్న నమ్మకం ఏర్పడిందన్నారు.