Home వరంగల్ ‘పెట్రో’ నిరసనలు

‘పెట్రో’ నిరసనలు

 Protests against petrol price increase
మన తెలంగాణ/ వరంగల్ అర్బన్ జిల్లా ప్రతినిధి : పెట్రోల్ ధర పెంపును నిరసిస్తూ ఓరుగల్లులో నిరసనలు వ్యక్తమయ్యాయి. పలు చోట్ల కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నగరంలో సిపిఐ ఆధ్వర్యంలో హన్మకొండ చౌరస్తాలో జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. వివిధ ప్రజాసంఘాలు పెట్రోల్ ధర పెంపును నిరసించాయి. ఈ సంధర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతోందని మండి పడ్డారు. పెట్రోల్, డిజిల్ ధరలను పెంచుతుందని విమర్శించారు. ఒకేసారి లీటర్ పెట్రోల్ 33 పైసలు, డిజిల్ 26 పైసలు పెంచడంతో దేశంలో ముందెన్నడూ లేని విధంగా ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలతో హెదరాబాద్‌లో రాష్ట్ర పున్నులు కలుపుకొని లీటర్ పెట్రోల్ రూ.80.76, డిజిల్ రూ.73.45కు చేరకుకున్నాయని దీంతో నిత్యవసరాల ధరలు సైతం ఆకాశాన్నంటే ప్రమాదం ఉందన్నారు. సామాన్యులపై భారాలు మోపే విధానాలను ప్రజలు నిరసించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి. వెంకట్రాములు, నాయకులు జ్యోతి, బిక్షపతి, షేక్‌బాష్‌మియా, రాములు, నాగర్జున, ఎల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
సామాన్యులపై పెనుభారం : దొగ్గెల తిరుపతి, డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు
పెట్రోల్, డిజిల్ ధరల పెంపును సామాన్యులపై పెను భారంగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దొగ్గెల తిరుపతి అభివర్ణించారు. మోది ప్రభుత్వం సామాన్యుల నడి విరుస్తోందని ఆరోపించారు. పెంచిన పెట్రోల్ ఉత్పత్తుల ధరలు తగ్గించాలని, వాటిపై విధిస్తోన్న పన్నులను తగ్గించి సామాన్యులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.