Home ఎడిటోరియల్ నిరసనకారులపై నిప్పులవాన

నిరసనకారులపై నిప్పులవాన

Article about Modi china tour

తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంత గ్రూపుకుచెందిన రాగి తయారీ స్టెర్‌లైట్ కర్మాగారానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలకు దిగిన, హింసాయుత చర్యలకు పాల్పడిన ఆందోళనకారులపై సోమవారం పోలీసులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 11మంది ప్రాణాలు కోల్పోవటం ప్రజాందోళనల సందర్భంలో ఇటీవల కాలంలో కనీవినీఎరుగని విషాదం. బుధ వారం జరిగిన కాల్పుల్లో మరోవ్యక్తి మరణించాడు. దీనితో మృతుల సంఖ్య 12కి పెరిగింది. అనేక డజన్ల మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్టెర్‌లైట్ కర్మాగారం పర్యావరణ నిబంధనలు పాటించనందున భూగర్భ జలాలు కలుషితమై తమ ఆరోగ్యాలకు ప్రాణాంతంగా మారినందున దాన్ని మూసివేయాలన్న డిమాండ్‌తో 99 రోజులుగా నిరసన సాగిస్తున్న పరిసర గ్రామీణులు, మత్సకారులు 100 రోజున కలెక్టరేట్ ముట్టడి తలపెట్టిన సందర్భంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మూడు మాసాలకు పైబడి ఆందోళన సాగుతుండగా, వారితో చర్చించి సమస్య పరిష్కారానికి అడ్మినిస్ట్రేటివ్, లీగల్ చర్యలు తీసుకోని జిల్లా పాలనా యంత్రాంగం, నిరసనకారులకు గుణపాఠం చెప్పాలని ముందుగా నిర్ణయించుకుని కాల్పులకు ఒడిగట్టినట్లు భావించాల్సి వుంటుంది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లురువ్వటం, కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు నిప్పుపెట్టటం వంటి హింసా చర్యలకు పాల్పడినట్లు విదితమవుతున్నది. అయితే పోలీసు ప్రతిస్పందన ఆ హింసకు తగిన మోతాదులోనే ఉందా? గుంపులను చెదరగొట్టేందుకు తీసుకున్న ముందస్తు చర్యలేమిటి? గుంపులు అదుపు తప్పినపుడు ముందుగా బాష్పవాయువు ప్రయోగించారా? గాలిలోకి కాల్పులు జరిపారా? ప్లాస్టిక్ బుల్లెట్లు ఎందుకు వాడలేదు? కాల్పులు జరపవలసిన పరిస్థితి ఉత్పన్నమైతే మోకాళ్ల దిగువకు తుపాకులు ఎక్కుపెట్టాలన్న స్టాండర్ట్ నియమాలను గాలికొదిలి నేరుగా జనంపైకి, అది కూడా పోలీసు వాహనంపైకి ఎక్కి గురిపెట్టి ఎకె 47 వంటి ఎసాల్ట్ రైఫిల్స్‌తో కాల్పులు జరిపారన్న ఆరోపణ అత్యంత తీవ్రమైంది. టెర్రరిస్టులు, మిలిటెంట్లలాగా సామాన్య ప్రజలను పరిగణించిన క్రౌర్యం ప్రజాస్వామ్యవాదులందరూ ముక్తకంఠంతో ఖండించదగింది. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. అదే సమయంలో, 99 రోజులుగా శాంతియుతంగా సాగుతున్న నిరసన కార్యక్రమం 100 వ రోజున ఎందుకు హింసాయుతంగా మారిందో ఆలోచించాల్సిన విషయం. కొన్ని బాహ్యశక్తులు ప్రవేశించినట్లు అనుమానించటానికి అవకాశముంది. ఇది కంపెనీ నియోగించిన అసాంఘిక శక్తుల దుశ్చర్య కావచ్చు, కంపెనీ అధికారులతో పోలీసుల కుమ్మక్కు కావచ్చు, మాఫియా ముఠాల పని కావచ్చు, రాజకీయ గ్రూపుల ముసుగులోని అరాచక శక్తుల పని కావచ్చు.
కావేరీ జలాల సమస్యను పురస్కరించుకుని ఐపిఎల్ మ్యాచ్‌లు చెన్నై నగరం నుంచి పూనె తరలివెళ్లటానికి కూడా ఇటువంటి చిల్లర గుంపులే కారణం. అందువల్ల తూత్తుకుడి ఘటనపై సమగ్ర న్యాయ విచారణ ఒక్కటే వాస్తవాలను వెలుగులోకి తేగలదు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించటంతోపాటు రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను నియమించింది. అయితే జిల్లా కలెక్టర్, ఎస్‌పిలను సస్పెండ్ చేయకుండా బదిలీ చేయటం విమర్శలకు గురవుతున్నది. ఇదిలా ఉండగా, కాల్పులకు ఎవరు ఆదేశించారో నిర్ధారణకాకపోవటం ప్రభుత్వం ఏదో దాస్తున్నదన్న అనుమానాలకు తావిస్తున్నది. డిజిపియే ఆదేశాలు జారీ చేశారన్న వార్తలు నిజమైతే అందులో ప్రభుత్వ పాత్ర ఉన్నట్లే.
స్టెర్‌లైట్ తొలి యూనిట్ ప్రస్తుతం లీగల్ వివాదంతో పని చేయటం లేదు. పర్యావరణ విభాగం లైసెన్స్ పునరుద్ధరించనందున కంపెనీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు వెళ్లింది. కాగా రెండవ యూనిట్ నిర్మాణ పనులు మొదలుపెట్టిందన్న వార్తలు నిరసనకారులను రెచ్చగొట్టాయంటున్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బంద్‌కు పిలుపు ఇచ్చాయి. ఏమైనా, తూత్తుకుడి ఘటన కార్మిక అశాంతి సమస్య కాదు. చట్టాలు పాటించని విదేశీ కంపెనీ చర్యలవల్ల తలెత్తిన పర్యావరణ, ప్రజారోగ్య పరిరక్షణ సమస్య. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి నివారించేబడేది.