Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

పుస్తకాలు రెడీ

BOOK

బడి ప్రారంభం రోజు విద్యార్థులకు పంపిణీకి ఏర్పాట్లు
పుస్తకాలు పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వేసవి సెలవుల అనంతరం సర్కార్ బడులు ప్రారంభించిన మొదటి రోజు విద్యార్థులకు పుస్తకాలను అందచేయడానికి విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, కస్తూర్భా, మైనార్టీ, బిసి గురుకులాలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలలు జూన్ 1 నుంచి పునః ప్రారంభం కానుండటంతో ఆలోపు ప్రతి పాఠశాలకు పుస్తకాలు తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సంబంధించిన పుస్తకాలను ఇప్పటికే రామంతాపూర్‌లోని గోదాంలో ఉంచి ఆయా మండలాలకు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పుస్తకాలను ఇప్పటికే వికారాబాద్‌లో నిల్వచేశారు. రంగారెడ్డి జిల్లాకు 2018-19 విద్యాసంవత్సరంకు గాను 9.70 లక్షల పుస్తకాలు అవసరం కాగా ఇప్పటికే 9 లక్షల పుస్తకాలు జిల్లాకు వచ్చాయి. జిల్లా గోదాంలకు వచ్చిన పుస్తకాలను ఆయా మండల విద్యావనరుల కేంద్రంకు తరలించడానికి కావలసిన ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు పూర్తిచేశారు. మే చివరివారంలోపు మండల విద్యావనరుల కేంద్రాల నుంచి ప్రతి పాఠశాలకు పుస్తకాలను తరలించి పాఠశాల ప్రారంభం అయిన మొదటి రోజు నుంచే పుస్తకాలను అందచేయనున్నారు. జిల్లా అధికారులు మండల కేంద్రాలకు పుస్తకాలను తీసుకుపోవాలని ఆదేశాలు జారీచేసినా కొంత మంది మండల విద్యాధికారులు నిర్లక్షం చూపడం మూలంగా ఆలస్యం జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాలు గతంలో బ్లాక్ మార్కెట్‌కు తరలించి విక్రయిస్తారన్న ప్రచారంతో ప్రస్తుతం విద్యా సంవత్సరంలో నయా టెక్నాలజీని వినియోగించారు. ప్రతి పుస్తకంకు అధికారికంగా లెక్క చెప్పాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించడంతో ప్రతి పుస్తకంపై ప్రత్యేకంగా నంబర్ ముద్రించారు. బడులు ప్రారంభించిన అనంతరం విద్యార్థులకు పుస్తకాలు అందచేసి విద్యార్థుల ఆధార్ నంబర్‌కు పుస్తకాల నంబర్ కలిపి ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. పుస్తకాలు పక్కదారి పట్టకుండా పక్కాగా చర్యలు చేపడుతుండటంపై అధికారులపై ప్రశంసల జల్లు కురుస్తుంది.
యూనిఫామ్‌లు సైతం…
ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించిన ఆరు నెలలకు సైతం విద్యార్థులకు యూనిఫామ్‌లు అందక ఇబ్బందులు పడుతున్న సందర్బాల నుంచి జూన్‌లోనే ప్రతి విద్యార్థికి యూనిఫామ్ అందచేసే స్థాయికి పరిస్థితులు వచ్చాయి. ప్రతి విద్యార్థికి రెండు యూనిఫామ్‌లు అందచేయాలన్న ప్రభుత్వ లక్షం మేరకు అధికారులు అడుగులు వేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలో విద్యార్దులకు కావలసిన యూనిఫామ్‌లు అందచేయడానికి కావలసిన బట్టలను ఇప్పటికే అధికారులు కొనుగోలు చేసి సిద్దంగా ఉంచారు. పాఠశాల విద్యాకమిటిల ద్వారానే యూనిఫామ్‌లు కుట్టించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంబించేలోపు మెజారీటి యూనిఫామ్‌లు సిద్దం చేసి అందచేయాలన్న లక్షంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం నుంచి బట్టలు కుట్టడానికి సైతం డబ్బులు మంజూరు చేయడంతో త్వరితగతిన పూర్తి చేయవలసిన భాద్యత పాఠశాల కమిటిలపై ఉంది. విద్యాసంవత్సరం ప్రారంబం నుంచి కొత్త యూనిఫామ్‌లు, కొత్త పుస్తకాలు అందచేయడంతో పాటు పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు చేపట్టవలసిన అవసరం చాలా వరకు ఉంది. విద్యావాలంటీర్‌లను నియమిస్తామని జిల్లా అధికారులు చెప్పుతున్న ఇప్పటివరకు దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదు. పేద ప్రజలు విద్యనభ్యసించే సర్కార్ బడులలో విద్యాప్రమాణాలు మరింత పెంచవలసిన అవసరం చాలా వరకు ఉంది.

Comments

comments