Home తాజా వార్తలు ‘హరితహారం’ మొక్కలు ‘అగ్గి’పాలు…

‘హరితహారం’ మొక్కలు ‘అగ్గి’పాలు…

 Harithaharam

 

కాల్వశ్రీరాంపూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకిరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటినప్పటికీ.. కొందరు రైతుల తప్పిదం వల్ల  హరితహారం మొక్కలు అగ్గిపాలవుతున్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరక పోవడంతోపాటు ప్రజాధనం వృథా అవుతోంది. ఇలాంటి సంఘటనలు తరుచూ జరుగుతున్నప్పటికీ సంబంధితాధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు. రైతులు చేలల్లో వ్యర్థాలను కాల్చడంతో అగ్గికాస్త  రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలకు అంటుకొని పదుల సంఖ్యలో మొక్కలు కాలిపోతున్నాయి.

అసలే వేసవికాలం కావడంతో మొక్కలకు సరైన రక్షణ లేక, నీరుపోసే నాథుడు లేకపోవడంతో ఎండిపోతుండగా, మరికొన్ని మొక్కలు ఇలా అగ్గిపాలై బూడిదవుతున్నాయి. దీంతో మండలంలో హరితహారం లక్ష్యం అటకెక్కినట్లవుతోంది. మరోవైపు ప్రభుత్వం 5వ విడత హరితహారం ప్రారంభానికి సిద్ధమవుతుండగా గతంలో నాటిన మొక్కల పరిస్థితి దయనీయంగా మారుతుండడం విశేషం.

రైతులు తమ పంట పొలాల్లో చెత్తాచెదారం, పత్తి కట్టెలు కాలబెడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు మొక్కలకు అంటుకొని కాలిపోతున్నాయి. వేలాది రూపాయలు ఖర్చు చేసి పెంచిన మొక్కలు నీడనిచ్చే సమయంలో కాలిపోతుంటే కాపాడే వారు కరువయ్యారు. రైతులు జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. అయితే ఈ విషయమై సంబంధితాధికారులు రైతులకు అవగాహన కల్పించకపోవడంతో వందలాది మొక్కలు కాలిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు ఉన్న మొక్కలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Provide protection to Harithaharam plants