Home జాతీయ వార్తలు ఇరవైభవం

ఇరవైభవం

20 ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టి భారత కీర్తిజెండాను ఎగురవేసిన పిఎస్‌ఎల్‌వి సి-34

భూ వాతావరణ పరిశోధనకు సంబంధించిన కార్టోశాట్ -2తో పాటు (దీని బరువు 728 కిలోలు), మొత్తం 560 కిలోల బరువున్న మరి 19  ఉప గ్రహాలతో రాకెట్ విజయవంతంగా దూసుకువెళ్లింది. మొత్తం ఉప గ్రహాల బరువు 1288 కిలోలు. భారీస్థాయి సాంకేతిక పరికరాలతో కూడిన పిఎస్‌ఎల్‌వి రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో భారతదేశం ఇప్పు డు వేల కోట్ల డాలర్ల శాటిలైట్ ప్రయోగాల మార్కెట్‌లో అమెరికా, బ్రిటన్, రష్యాల సరసన కీలకస్థానం సంపాదించుకున్నది. షార్ సెంటర్ రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగం జరిగింది. అమెరికా, కెనడా, జర్మనీ, ఇండోనేసియాకు చెందిన శాటిలైట్లు కూడా ఇందులో ఉన్నాయి. 

racketశ్రీహరికోట: ఒకేసారి 20  ఉపగ్రహాలను కక్షలోకి పంపించిన పిఎస్‌ఎల్‌వి సి-34 ప్రయోగం బుధవారం విజయవంతమైంది. దీంతో భారతీయ అంతరిక్ష పరి శోధనా సంస్థ (ఇస్రో) విజయపథం కొనసాగింది. నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 9.25  గంటలకు ఈ స్వదేశీ వాహకనౌక పిఎస్‌ఎల్‌వి సి-34ను 48గంటల పాటు సాగిన కౌంట్‌డౌన్ అనంత రం ప్రయోగించారు. ఈ కీలక ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష ప్రయోగా లలో పలు ప్రత్యేకతలను సంతరించుకుంది. ఏకకాలంలో ఈ వాహక నౌకద్వారా కక్షలోకి మొత్తం 20 శాటిలైట్లను ప్రవేశపెట్టడం ఒకటైతే, ఇందులో అత్యంత వాణిజ్యపరమైన రీతిలో 17 విదేశీ శాటిలైట్లను స్వదేశీ భూ పరిశీలనా శాటిలైట్‌తో పాటు ఇతర శాటిలైట్లను ఎలాంటి సాంకేతిక ఇబ్బందులూ లేకుండా ప్రయోగించారు. ఇస్రోకు చెందిన అంతరిక్ష జవనాశ్వం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ నిర్మలమైన ఆకాశంలో నిప్పులు చిమ్ముకు ంటూ దూసుకువెళ్లింది. ఈ క్షణం కోసం చాలా కాలంగా శ్రమిస్తూ వస్తున్న శాస్త్రజ్ఞులు, సాంకేతిక నిపుణులకు అంతులేని ఆనందాన్ని మిగిల్చింది. 44.4 మీటర్ల ఎత్తు ఉన్న రాకెట్‌ను ఎక్సెల్ స్ట్రాపన్ బూస్టర్ల సాయంతో నాలుగు దశలలో పలు సాంకేతిక జాగ్రత్తల నడుమ ప్రయోగించారు. భూ వాతావరణ పరిశోధనకు సంబంధించిన కార్టోశాట్- 2తో పాటు (దీని బరువు 728 కిలోలు), మొత్తం 560 కిలోల బరువు ఉన్న మరి 19 ఉపగ్రహాలు విజయవంతంగా దూసుకువెళ్లాయి. మొత్తం ఉపగ్రహాల బరువు 1288 కిలోలు. భారీ స్థాయి సాంకేతిక పరికరాలతో నిండుకుని ఉన్న పిఎస్‌ఎల్‌వి రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో భారతదేశం ఇప్పుడు వేల కోట్ల డాలర్ల శాటిలైట్ ప్రయోగాల మార్కెట్‌లో అమెరికా , బ్రిటన్, రష్యాలతో పాటు కీలక స్థానంలో పోటీకి దూసుకువచ్చింది. షార్ సెంటర్ రెండవ లాంఛ్ ప్యాడ్ నుంచి ప్రయోగం జరిగింది. భారత్ ఉపగ్రహాలతో పాటు అమెరికా, కెనడా, జర్మనీ, ఇండోనేసియాకు చెందిన శాటిలైట్లు కూడా ఉండటంతో ఈ ప్రయోగానికి అంతర్జాతీయ ప్రాముఖ్యత దక్కింది. అత్యంత కీలకంగా ఈ ప్రయోగంలో నూతన తరం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (కార్టోశాట్ 2) ఇతర ఉపగ్రహాలు నిర్థేశిత పోలార్ సన్ సింక్రోనస్ ఆర్బిట్ (ఎస్‌ఎస్‌ఒ)లోకి 26 నిమిషాల తరువాత వెళ్లింది. ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టేందుకు మొత్తం 26 నిమిషాల సమయం పట్టింది . ఎంసిసి నుంచి ఇస్రో ఛైర్మన్ కిరణ్‌కుమార్ , సీనియర్ శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని వీక్షించారు. ప్రయోగించిన శాటిలైట్ల లో మొత్తం 13 అమెరికా శాటిలైట్లు ఉండటం విశేషం. ఇందు లో ప్లానెట్ లాబ్స్‌కు చెందిన డజన్ ఎర్త్ ఇమేజింగ్ డోవ్ శాటి లైట్లు ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి దాదాపు ఐదుకిలోల బరువుతో ఉన్నాయి. ఇక స్కైశాట్ శాటిలైట్ రెండో జనరేషన్‌ను గూగుల్ సొంత కంపెనీ వారు రూపొందించారు . రెండు కెనడా శాటిలై ట్లు, జర్మనీ, ఇండోనేసియాకు చెందిన ఒక్కో శాటిలైట్ కూడా ఉండటంతో ఈ ప్రయోగం విశ్వ సార్వత్రికం అయింది.
పక్షులను ఎగురవేసినట్లుగా ఉంది ః ఇస్రో అధినేత
ఒకేసారి ఇన్ని ఉపగ్రహాలను ప్రయోగించడం ఆకాశంలోకి పక్షులను ఎగరవేసినట్లుగా ఉందని ఇస్రో ఛైర్మన్ కిరణ్‌కుమార్ ఆనందంతో వ్యాఖ్యానించారు. పిఎస్‌ఎల్‌వి తన పని తాను సక్సెస్‌గాచేసుకుంటూ పోయిందని అన్నారు. ఒకేసారి పది ఉపగ్రహాలను ఇస్రో 2008లో ప్రయోగించింది. ఇక ఏకకాలం లో శాటిలైట్లను అత్యధిక సంఖ్యలో ప్రయోగించిన రికార్డులో రష్యా తొలిస్థానంలో ఉంది. ఏకంగా 37 శాటిలైట్ల ప్రయోగం రికార్డు ఇది. తరువాతి స్థానంలో అమెరికా అంత రిక్ష సంస్థ – నాసా 29 శాటిలైట్లను ప్రయోగించింది. తరువా త ఇప్పుడు భారతదేశం ఈ రికార్డులో మూడో స్థానంలోకి వచ్చింది. పేలోడ్ సామర్థంలో శాటిలైట్ల వారిగా అత్యధికమై నవి 700 కిలోల నుంచి అత్యల్ప బరువు కిలోన్నర వరకూ ఉన్నాయి. భూ పరిశోధనకు సంబంధించిన కార్టోశాట్ రెండో సీరిస్ భారత వాతావరణ పరిశోధననలకు అత్యంత కీలకమై నదని కిరణ్‌కుమార్ తెలిపారు.
కార్టోశాట్ ప్రత్యేకతలు ఎన్నో
కార్టోశాట్ శాటిలైట్‌తో దేశ సైనిక సామర్థం పెరుగుతుంది. నిఘా వినిమయంలో ఉపకరిస్తుంది. ఇప్పటివరకూ ఇలాంటి శాటిలైట్లు అమెరికా, చైనా, ఇజ్రాయిల్ వద్దనే ఉన్నాయి. తాజాగా భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని సంతరించుకుంది. ఖచ్చితమైన చిత్రాలను, వీడియోలను అంతరిక్షం నుంచి భూమికి చేరవేస్తుంది. ఇందులో గల ప్యాన్‌క్రొమోటిక్ కెమెరా, మల్టీ స్పెక్ట్రల్ పరికరంతో దీని సామర్థం పెరిగింది. ప్రకృతి వైపరీత్య కాలంలో సేవలు అందిస్తుంది. విపత్తు విస్తృతిని తగు విధంగా అంచనా వేయడం ద్వారా సహాయ చర్యల సమన్వయానికి ఉపకరిస్తుంది.
పిఎస్‌ఎల్‌వి 35వ విజయం
వరసగా 35 విజయాలు పిఎస్‌ఎల్‌వి స్వదేశీ రాకెట్లతో ఇస్రో మరింతగా పటిష్టం అయిందని షార్ డైరెక్టర్ పి కున్హికృష్ణన్ స్పందించారు. ఇస్రోకు భారత్‌కు పిఎస్‌ఎల్‌వి విజయసం కేతంగా మారిందన్నారు. ఇలాంటి ప్రయోగాలతో ఇస్రో అత్యున్నత స్థాయిలో వృత్తి నైపుణ్యతను పటిష్టం చేసుకొం టోందని తెలిపారు. పిఎస్‌ఎల్‌వి ప్రస్తుత ప్రయోగంలో ఎలాంటి ఒడుదుడుకులు లేవని, నౌక పనితీరు బాగా ఉందని మిషన్ డైరెక్టర్ డి జయకుమార్ చెప్పారు.
ప్రముఖుల హర్షం, అభినందనలు
ఒకేసారి 20 ఉపగ్రహాలను పిఎస్‌ఎల్‌వి ద్వారా విజయవంత ంగా ప్రయోగించడం పట్ల ఇస్రోకు అభినందనలు వెలువడ్డా యి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, పలు వురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో బృందా నికి హృదయపూర్వక అభినందనలు అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. ఇస్రో ఎల్లలు దాటి విజయపథంలోకి దూసుకుపోతు న్నదని ఇందుకు ఈ శాటిలైట్ల ప్రయోగం మరో మైలురాయి అని ప్రధాని తెలిపారు. ప్రతిష్టాత్మక విజయం సాధించినందు కు శాస్త్రజ్ఞుల బృందానికి అభినందనలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతికరంగాలను ప్రజల జీవన ప్రమాణా ల బాగు కోసం తగు విధంగా మలిచే దిశలో మన అంతరిక్ష కార్యక్రమం మరో మారు విజయం సాధించిందని తెలిపారు. ఇతర దేశాల శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన పటిష్టతకు కూడా భారతీయ సైంటిస్టులు తగు విధంగా సామర్థంతో తమ నైపు ణ్యతను తోడ్పాటుగా అందించడం కీలక పరిణామం అని తెలి పారు. కేంద్ర సమాచార, ప్రసారాల సహాయ మంత్రి రాజ్యవ ర్థన్ రాథోడ్, వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్, పిఎంఒ మంత్రి జితేంద్ర సింగ్ , తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖ ర రావు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో చరిత్రలో ఈ ప్రయోగం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు సిఎం కెసిఆర్ అభినందనలు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబునాయుడు ఇతరులు కూడా ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
కాలేజీ విద్యార్థుల ఆనందం
పుణేకు చెందిన కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొం దించిన స్వయం, చెన్నైకు చెందిన సత్యభామ యూనివర్శిటీ వారు రూపొందించిన సత్యభామ్‌శాట్‌లు కూడా కక్షలోకి విజయవంతంగా పిఎస్‌ఎల్‌వి ప్రయోగ దశలో దూసుకువె ళ్లాయి. అతి చిన్న శాటిలైల్లను రూపొందించిన ఆయా విద్యాసంస్థల ఆనందానికి అవధులు లేకుండా పొయ్యా యి. మిగిలిన ఉపగ్రహాలతో పాటు తాము రూపొందించిన కేవలం కిలో బరువు శాటిలైట్ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని, ప్రత్యేకించి మారుమూల ప్రాంతాలలో కమ్యూనికేషన్ వ్యవస్థ సమాచారానికి ఇది ఉపకరిస్తుందని , తమ కృషికి ఇస్రో తగు గుర్తింపును తీసుకువచ్చిందని విద్యార్థులు తెలిపారు. పుణే కాలేజీకి చెందిన విద్యార్థులు దాదాపు ఎనిమిది సంవత్స రాలుగా అతి చిన్న శాటిలైట్ తయారీకి కృషి చేస్తూ వస్తున్నారు. తమ విద్యార్థులకు ఇది ఓ ఉద్విగ్నభరిత ఘట్టం అని ఈ విద్యాలయం డైరెక్టర్ డాక్టర్ పిబి అహూజా తెలిపారు. క్యూబ్ ఆకారంలో ఈ శాటిలైట్‌ను రూపొందించారు.