Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

మానసిక ఒత్తిడికి మందు ‘యోగా’

Yoga-image

మన తెలంగాణ/మహబూబాబాద్: యోగాతో మానసిక ఒత్తిడి దూరం అవుతుందని, మనస్సు ప్రశాంతత ఏర్పడుతుందని, ఆత్మను ఏకం చేసే ఏకైక సాధనం యోగానే అని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అన్నారు. 4వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని గురువారం ఆయుష్, జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక ఎన్‌టిఆర్ స్టేడియంలో నారాయణ ప్రకాష్ లోయ శిక్షణలో ఏర్పాటుచేసిన యోగా కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాను ప్రతి ఒక్కరూ అనుసరించాలని, యోగా వల్ల జరిగే లాభాలను విశ్వవ్యాప్తం చేయడానికే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. పని భారం, మానసిక ఒత్తిడి వల్ల మనిషి అనారోగ్యంపాలు అవుతున్నారని, మన దేశంలో పురాతన కాలం నుండి యోగాకు మంచి గుర్తింపు ఉందని, ఆయుర్వేదం, యునాని, హోమియో, నాచరోపతి లాంటి వైద్యాలు ప్రకృతిలో ఒక భాగమైనవే అన్నారు. మన సాంప్రదాయాలు, విధానాలు ప్రపంచమే అనుసరిస్తుందని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించవచ్చన్నారు. చిన్నారులకు విద్యార్ధి దశ నుండి యోగాభ్యాసం అలవరిస్తే ఆరోగ్యవంతమైన సమాజం ఆవిర్భవిస్తుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యగా మార్చుకుని ఆరోగ్యవంతమైన జీవితాలను అనుభవించాలని, ఒత్తిడికి, విముక్తి మార్గం యోగానేనని గుర్తించాలని కలెక్టర్ అన్నారు.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం: ఎస్‌పి కోటిరెడ్డి
యోగాతో మనిషి సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటాడని, దాంతోపాటు క్రమశిక్షణ ఇంద్రియాలపై నిగ్రహాన్ని సమకూరుస్తుందని జిల్లా ఎస్‌పి నంద్యాల కోటిరెడ్డి అన్నారు. స్వీయ రక్షణ వ్యక్తిత్తవం పెంపొందించుకుని సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదుగుదలకు యోగా తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కట్కూరి దామోదర్‌రెడ్డి, అడిషనల్ ఎస్‌పి గిరిధర్, ఆయుష్ జిల్లా కో-ఆర్డినేటర్, కాళోజి, ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments