Home జాతీయ వార్తలు మోడీ అవినీతిపై ప్రజా ఉద్యమం

మోడీ అవినీతిపై ప్రజా ఉద్యమం

Rahul-gandhi-image

సిడబ్లుసి కీలక నిర్ణయం                                                                                                                                        రాఫెల్, ఎన్‌ఆర్‌సిపై నిలదీత                                                                                                                              అనారోగ్యంతో సోనియా గైర్హాజరు!

న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్లుసి) రెండో కీలక సమావేశం శనివారం ఇక్కడ జరిగింది. పార్టీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ సారథ్యంలో ఈ భేటీ జరిగింది. అవినీతి అంశాన్ని ప్రధానాస్త్రంగా మల్చుకుని మోడీ సర్కారు తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నిర్ణయించింది. రాఫెల్ డీల్, అసోం పౌర జాబితా (ఎన్‌ఆర్‌సి)పై ప్రజలలోకి వెళ్లాలని నిర్ణయించారు. బ్యాంక్ స్కామ్స్, రాఫెల్ డీల్, దేశ ఆర్థిక దుస్థితి వంటి అంశాలపై ప్రజలలో చైతన్యం తీసుకురావాలని సంకల్పించారు. వివిధ స్థాయిలలో మోడీ సర్కారు అవినీతి సాగుతోందని, దీనిని అడ్డుకునేందుకు వీధుల్లోకి వెళ్లాల్సి ఉందని నిర్ణయించారు. శనివారం జరిగిన సమావేశంలో దేశంలో రాజకీయ పరిస్థితి గురించి సమీక్షించారు. రాఫెల్ ఫైటర్ ఒప్పందం, అసోం పౌరసత్వ చిట్టా (ఎన్‌ఆర్‌సి), వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీ విదేశాలకు ఉడాయింపు సంబంధిత పిఎన్‌బి స్కామ్ వంటి అంశాలపై క్షుణ్ణంగా చర్చ జరిగింది.

పార్టీ మాజీ అధ్యక్షులు, యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఈ సమావేశానికి హాజరు కాలేకపొయ్యారు. పార్టీ అత్యున్నత నిర్ణయాధికారిక కార్యవర్గం అయిన సిడబ్లుసికి మాజీ ప్రధాని మన్మోహన్, ఎకె ఆంటోనీ, గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే, అహ్మద్ పటేల్, అశోక్ గెహ్లోట్ హాజరయ్యారు. వేలాది కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌కు సంబంధించి నీరవ్ మోడీ, చోక్సీలపై చర్యల విషయంలో అసమర్థత. రాఫెల్ ఫైటర్ విమానాల వాస్తవ ధరలపై బుకాయింపు, వివాదాస్పద రీతిలో ఎన్‌ఆర్‌సిని చేపట్టడం ..వంటివి ప్రభుత్వ అసమర్థతకు తార్కాణం అని, వీటి గురించి ప్రజలలోకి వెళ్లాల్సి ఉందని పార్టీ కీలక భేటీలో నిర్ణయించారు. ఎన్‌ఆర్‌సిని కాంగ్రెస్ పార్టీయే తొలుత తీసుకువచ్చిందని, అయితే ఎన్‌ఆర్‌సిని బిజెపి తన విభజించి పాలించే విధానానికి అనుగుణంగా వినియోగించుకొంటోందని, రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తోందని సిడబ్లుసి విమర్శించింది. ఎన్‌ఆర్‌సికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. అయితే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో కుదిరిన అస్సాం ఒప్పందానికి అనుగుణంగా దీనిని చేపట్టాల్సి ఉందని స్పష్టం చేశారు. అత్యంత సున్నితమైన ఎన్‌ఆర్‌సి పట్ల మోడీ ప్రభుత్వం తీవ్రస్థాయి అలసత్వ ధోరణిని అవలంభించిందని, దీనితో అసోంలో భారీ స్థాయి అభద్రతనెలకొందని తెలిపారు. పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సాగే కాంగ్రెస్ ప్రజా ఉద్యమానికి ప్రజానీకం మద్దతు కూడగట్టేందుకు పార్టీ నేతలు, కార్యవర్గ సభ్యులు, కేడర్స్ తగు విధంగా కృషి చేయాలని సిడబ్లుసి పిలుపు నిచ్చింది. ఈ ఉద్యమానికి సంబంధించిన సమగ్ర రూపం త్వరలోనే వెల్లడిస్తారని తెలిపారు.

పరారీలకు తోడు పరారీలకు ప్రగతి
నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్లించిన సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ నినాదం ఆచరణలో చిత్తశుద్ధి లేక చివరికి భాగోరోన్ కా సాథ్, భాగోరోన్‌కా వికాస్‌గా మారిందని తెలిపారు. స్కామ్‌లు చేసి విదేశాలకు చెక్కేసిన దిగ్గజాలపై కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలు చేసింది. పిఎన్‌బి స్కామ్‌లో ఒక మోసగాడు మెహుల్ చోక్సీ ఆంటిగువా పౌరసత్వం పొందినట్లు, ఇక స్కామ్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి కీలక నిందితుడు నీరవ్ మోడీ జాడ లేకుండా పోయిందని సిడబ్లుసి విమర్శించింది. మోడీ ప్రభుత్వం కొన్ని వర్గాల పట్ల కనబరుస్తోన్న లోపాయికారి వ్యవహారాలతో దేశంలో 74 వేల కోట్ల రూపాయల మేర బ్యాంక్ స్కామ్ లు జరిగాయని, బ్యాంకుల నుంచి అధిక మొత్తాలలో రుణాలు పొంది ఎగ్గొట్టిన వారు దర్జాగా తిరుగుతున్నారని పార్టీ కమిటీ విమర్శించింది.

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై చర్చ
ఈ ఏడాది చివరిలో నాలుగు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీపరంగా సన్నాహాలు, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు అంశంపై కమిటీ సభ్యులు చర్చించారు. అయితే ఎన్నికల పొత్తుపై, ప్రతిపక్షాల ఐక్య త విషయంపై జరిగిన చర్చల వివరాలు వెల్లడి కాలేదు. సిడబ్లుసి భేటీ వివరాలను ఆ తరువాత కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా విలేకరులకు తెలిపారు. కాంగ్రెస్ చేపట్టే జన్ ఆందోళన్ గురించి త్వరలోనే వివరిస్తామని తెలిపారు. ఒక జట్టుగా సిడబ్లుసి భేటీలో దేశం లో రాజకీయ పరిస్థితిని సమీక్షించడం జరిగింది. ఈ ప్రభుత్వ హయాంలో అవినీతి తారాస్థాయికి చేరుతోంది. మరోవైపు యువతకు ఉద్యోగావకాశాల ఆశ పాతాళానికి జారుతోంది. పలు కీలక అంశాలపై కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఉద్యమం ప్రజా ఉద్యమంగా సాగుతుందని వివరించారు.

రాఫెల్‌తో రూ 48వేల కోట్ల నష్టం
రాఫెల్ డీల్‌లో తీవ్రస్థాయిలో అవినీతి జరిగిందని, అం దుకే ప్రధాని మోడీ , కానీ రక్షణ మంత్రి కానీ అసలు ఫ్రాన్స్ నుంచి ఈ రాఫెల్ ఫైటర్స్‌ను ఏ ధరలకు కొనుగోలు చేసింది చెప్పడం లేదని సూర్జేవాలా చెప్పారు. యుపిఎ హయాంలో ఈ జెట్ ఫైటర్స్‌కు ఒక్కింటికి రూ 526 కోట్లుగా ఖరారు చేశారు. అయితే ఎన్‌డిఎ హయాం లో వీటిని రూ 1,676 కోట్లకు పెట్టి కొన్నారు. దీనితో ఖజానాకు రూ 48వేల కోట్ల వరకూ గండి పడింది. ఈ సొమ్ము ప్రజలకు భారం అవుతోందని చెప్పారు. ఎన్‌ఆర్‌సి ప్రతిపాదన తమ పార్టీదే అని, అయితే పౌరసత్వ నిర్థారణ సరైన రీతిలో జరగాల్సి ఉందన్నారు. ఇదిలావుండగా ఈ సమావేశానికి అనారోగ్య కారణాల వల్ల సోనియా హాజరుకాలేదని సమాచారం