Search
Saturday 22 September 2018
  • :
  • :

నిన్నటి దాకా బడిబాట నేడు పాఠశాలల మూత

Public schools in the joint Karimnagar district are closed

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూతపడుతున్న ప్రభుత్వ పాఠశాలలు

మన తెలంగాణ/కరీంనగర్: విద్యాసంవత్సరం ఆరంభమై నెల రోజులు గడవక ముందే సర్కారీ పాఠశాలలు ఒక్కొక్కటిగా మూతపడుతూ వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో విద్యను ప్రోత్సహించడం, ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేయడం లక్షంతో నిన్న మొన్నటి వరకు నిర్వహించిన బడిబాట స్పూర్తికి విరుద్దంగా విద్యార్థుల సంఖ్య లేదనే సాకుతో పాఠశాలలను మూసివేయడం విమర్శలకు తావిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే అవకాశం ఉన్నప్పటికీ ఇదేమి పట్టించుకోని విద్యాశాఖ అధికారుల తీరుతో కొన్ని ప్రభుత్వ పాఠశాలకు తాళాలు వేయాల్సిన పరిస్థితి ఉత్పన్నంకాగా, మరి కొన్నింటిని విలీనం చేయడంతో సర్కారీ విద్య గ్రామీణ ప్రజలకు ముఖ్యంగా చదువు “కొన”లేని వారికి అందుబాటులో లేకుండా పోయింది. విద్యార్థులను పాఠశాలలలో చేర్పించేందుకు విద్యాసంవత్సరం ఆరంభంలో అటు ప్రైవేటు, ఇటు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించడం  అది కాస్తా రెండు యాజమాన్యాల మధ్య ఘర్షణకు దారితీయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. పాఠశాలల వైపు విద్యార్థులను ఆకర్షించడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు పడిన తపన పాఠశాలల మూతతో బూడిదలో పోసిన పన్నీరయ్యింది. పాఠశాలలను మూసి వేయడానికి జీరో సంఖ్యలో విద్యార్థులే కారణమని మండల, జిల్లా విద్యాధికారులు సమర్ధించుకుంటుండగా ఆయా గ్రామాల్లోని ప్రజలు తమ పిల్లలకు ప్రభుత్వ విద్య అందుబాటులో లేక, ప్రైవేట్ పాఠశాలలకు పంపి ఫీజులు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా పరిధిలోని చొప్పదండి మండలంలో మొత్తం 42 ప్రభుత్వ పాఠశాలలకుగాను కొనేరుపల్లిలోని పాఠశాలను విద్యార్థుల సంఖ్య లేదన్న సాకుతో మూసివేశారు. రామడుగు మండలంలో 41 ప్రభుత్వ పాఠశాలలకు గాను గోపాల్‌రావుపేటలోని మైనార్టీ ఉర్ధు పాఠశాలను ఇదే కారణంతో మూసివేశారు. గంగాధర మండలంలోని 42 ప్రభుత్వ పాఠశాలలకు గాను సర్వారెడ్డిపల్లి, పెండలోనిపల్లి పాఠశాలలను మూసివేశారు.జగిత్యాల జిల్లాలో మొత్తం 783 ప్రభుత్వ పాఠశాలలకు గాను ఇప్పటి వరకు 26 పాఠశాలలు విద్యార్థుల సంఖ్య లేని కారణంగా మూతపడ్డాయి. కొడిమ్యాల మండలంలో పోతారం, ఇందిరానగర్ పాఠశాలలతో  పాటు మరో రెండింటిని ఇప్పటికే మూసివేశారు. ఇందులో పోతారం పాఠశాలను తిరుమలా‚పూర్ ప్రాథమికోన్నత పాఠశాల, ఇందిరానగర్ పాఠశాలను కొడిమ్యాల జిల్లా పరిషత్  పాఠశాలల్లో విలీనం చేశారు. ఈ జిల్లాలో ధర్మపురిలో 5, బుగ్గారంలో 1, జగిత్యాల గ్రామీణంలో 1, జగిత్యాల పట్టణంలో 1, గొల్లపల్లిలో 2, కథలాపూర్‌లో 1, కొడిమ్యాలలో 3, మల్లాపూర్‌లో 4, మెట్‌పల్లిలో 4, పెగడపల్లిలో 4 చొప్పున పాఠశాలలు మూతపడ్డాయి. కథలాపూర్ మండలం అంబారిపేట తండాలోని ఏకోపాధ్యాయ పాఠశాల విద్యార్థుల కోసం నియమించిన విద్యా వాలీంటర్ సరిగా విధులకు రాకపోవడంతో ఆ పాఠశాల ద్వారాలు తెరుచుకోవడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రుద్రంగి మండలం కొచ్చగుట్ట తండాలోని ఏకోపాధ్యాయ పాఠశాల విద్యార్థులు లేక మూతపడింది. ఇదే జిల్లాలోని బోయినిపల్లి మండలంలో శాభాష్‌పల్లి, దున్నపల్లి గ్రామాల్లోని పాఠశాలలను విద్యార్థుల సంఖ్య లేని కారణంగా తెరవడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించకపోవడం, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం దానినే కారణంగా చూపి పాఠశాలలను మూసివేయడం విమర్శలకు తావునిస్తున్నది.

Comments

comments