Home జాతీయ వార్తలు కన్నతండ్రికి కడసారి సెల్యూట్‌

కన్నతండ్రికి కడసారి సెల్యూట్‌

Immortal Heroesఢిల్లీ :  పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల పార్థివ దేహాలు వారివారి  స్వస్థలానికి చేరుకున్నాయి. కుటుంబసభ్యులు, బంధువుల, ప్రజల అశ్రు నయనాల మధ్య అమర జవాన్లకు వారి వారి స్వస్థలాల్లో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో డెహ్రాడూన్‌కు చేరుకున్న సిఆర్ పిఎఫ్ ఎఎస్‌ఐ మోహన్‌లాల్‌ పార్థివ దేహాన్ని చూసి ఆయన కుటుంబసభ్యుల, గ్రామ ప్రజల రోదనలు మిన్నంటాయి. తండ్రి మృతదేహానికి మోహన్‌లాల్‌ కుమార్తె కడసారిగా కన్నీటి  సెల్యూట్‌ చేసింది. కన్నీటిని దిగమింగుకుని ఆ బాలిక చేసిన సెల్యూట్‌ అందరినీ కలిచివేసింది. ఉత్తరాఖండ్‌ సిఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌, ఇతర అధికారులు, రాజకీయ పార్టీల నేతలు మోహన్‌లాల్‌కు నివాళులర్పించారు.  యుపిలోని తిర్వా కన్నౌజ్‌ ప్రాంతంలో జవాను ప్రదీప్‌ కుమార్‌కి అంత్యక్రియలు చేశారు. బిహార్‌లో జవాన్లు రతక్‌ కుమార్‌ ఠాకూర్‌, సంజయ్‌ కుమార్‌ సిన్హా పార్థివ దేహాలకు ఆ రాష్ట్ర సిఎం నితీశ్‌ కుమార్‌, ఆర్ జెడి  నేత తేజస్వీ యాదవ్‌ నివాళులర్పించారు. పుల్వామా ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పుల్వామాలో ముష్కరుల దాడిలో 49 మంది సిఆర్ పిఎఫ్ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. అమరులైన జవాన్లకు దేశ ప్రజలు పుష్పాంజలి ఘటిస్తున్నారు. వాడవాడలా వారికి నివాళులు అర్పిస్తూ సెల్యూట్ చేస్తున్నారు.

Pulwama Attack : People Tribute to CRPF Immortal Heroes