Home జాతీయ వార్తలు అమర జవానుకు అంతిమ వీడ్కోలు

అమర జవానుకు అంతిమ వీడ్కోలు

 

పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సిఆర్‌పిఎఫ్ జవాన్లలో ఒకరైన రమేష్ యాదవ్‌కు వారణాసిలో అంతిమ వీడ్కోలు
నివాళులర్పించిన అశేష జనం

న్యూఢిలీ : అత్యంత ఉద్విగ్నభరిత, ఆద్యంత ఆవేదనభరిత వాతావరణంలో పుల్వామా వీర జవాన్లకు అంతిమ వీడ్కోలు ఘట్టం ముగిసింది. భీకర ఉగ్రవాద దాడిలో గురువారం 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు బలి అయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు వారి భౌతిక కాయాలు చేరుకున్నాయి. వేలాది మంది జనం నివాళులు, కన్న వారు, ఆప్తుల రోదనలు కన్నీటి వీడ్కోలు మధ్య శనివారం వారికి అంత్యక్రియలు జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో జవాను ప్రదీప్ సింగ్ యాదవ్ చితికి నిప్పంటించారు. జవాన్ అమర్ రహే నినాదాలతో ఈ ఘట్టం ముగిసింది. అయితే అక్కడే ఉన్న ప్రదీప్ సింగ్ కూతురు సుప్రియా తండ్రి ఎడబాటును తట్టుకోలేక స్పృహ తప్పిపడిపోయింది. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఇక యాదవ్ రెండున్నర ఏళ్ల కూతురు చట్టూ ఏమి జరుగుతున్నదో తెలియక ఉక్కిరిబిక్కిరి అయింది. చుట్టూ ఉన్న వారు తండ్రి ధైర్యాన్ని ప్రస్తుతిస్తూ నినాదాలకు దిగడం, సోదరి వెక్కివెక్కి ఎడుస్తూ ఉండటంతో నివ్వెరపోయింది.

 

బలి అయిన 40 మంది జవాన్లలో మరికొందరి అంత్యక్రియలు మహారాజ్‌గంజ్, ఆగ్రా, మెయిన్‌పురి, ఉన్నావో, కాన్పూర్ దేహత్, చందౌలీ జిల్లాల్లో జరిగాయి. ఇక్కడ కూడా ఇదే విధమైన వాతావరణం నెలకొని ఉంది. ఉత్తరప్రదేశ్ అంతటా వేలాది మంది జవాన్లకు నివాళులు అర్పించారు. వీరి త్యాగాలు వృధాకాన్విబోమని ప్రతిన వహించారు. దాడికి దిగిన వారిపై తగు విధంగా ప్రతీకారం తీసుకోవాలని జవాన్ల కుటుంబాలు అంత్యక్రియలకు వచ్చిన మంత్రులు, అధికారులు, ప్రజలను డిమాండ్ చేశారు. కాన్పూర్ దేహత్‌లో షహీద్ శ్యామ్ బాబు అమర్ రహే నినాదాలు మిన్నంటాయి. యుపిలో అంత్యక్రియల కార్యక్రమానికి కేంద్రం తరఫున మంత్రి స్మృతి ఇరానీ హాజరయ్యారు. జవాన్ల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆగ్రాలోని కర్హారీ గ్రామంలో కౌశల్ కుమార్ రావత్‌కు అంత్యక్రియలు జరిగాయి. ఈ గ్రామంలో రావత్ స్మారక స్థూప నిర్మాణానికి అక్కడి ప్రజలు భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. డియోరియా జిల్లాలో జవాను విజయ్ మౌర్యకు తుది వీడ్కోలు పలికారు. ఉన్నావోలో సిఆర్‌పిఎఫ్ జవాను అజిత్ కుమార్ ఆజాద్ భౌతిక కాయానికి ఆయన సోదరుడు రంజిత్ నిప్పంటించారు.

ఒడిషాకు చెందిన సిఆర్‌పిఎఫ్ జవాన్లకు శనివారం అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సిఎం నవీన్ పట్నాయక్, పలువురు మంత్రులు, సీనియర్ అధికారులు వచ్చారు. ఇద్దరు జవాన్లు ప్రసన్న కుమార్ సాహూ, మనోజ్ కుమార్ బెహెరాల ప్రాణత్యాగానికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం పాతిక లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. కేంద్రం తరఫున జువాల్ ఓరామ్, ధర్మేంద్ర ప్రధాన్ ఇతరులు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్‌ల ఇద్దరు జవాన్లకు తుది వీడ్కోలు పలుకుతూ అంత్యక్రియలు జరిగాయి. శనివారం ఇద్దరు జవాన్లు బాబూ సంత్రా, సుదీప్ బిశ్వాస్‌ల భౌతిక కాయాలు కోల్‌కతా విమానాశ్రయానికి తొలుత చేరాయి. తరువాత సంత్రా స్వస్థలం చక్కాషీ రాజ్‌బంగ్‌షిపారాకు, బిశ్వాస్ భౌతిక కాయాన్ని నదియా జిల్లాని తెహత్తాకు తరలించారు. అక్కడ వారికి నివాళుల తరువాత అంత్యక్రియలు జరిగాయి. 27 ఏళ్ల బిశ్వాస్ త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నారు. ఆయనది రైతు కుటుంబం. రాజస్థాన్‌లో ఐదుగురు జవాన్లకు అంత్యక్రియలు జరిగాయి. త్రివర్ణ పతాకాలతో కప్పి ఉంచిన శవపేటికలను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. వారివారి స్వ గ్రామాలలో వారికి అంత్యక్రియలు నిర్వహించారు. జవాన్లకు గౌరవ సూచకంగా రాష్ట్రంలో పలు చోట్ల దుకాణాలు, విద్యా వ్యాపార సంస్థలు కార్యాలయాలను మూసివేశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన సిఆర్‌పిఎఫ్ జవాను వీరేంద్ర సింగ్‌కు మెహమ్మద్‌పూర్ భూరియా గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. మూడేళ్ల కుమారుడు తండ్రి చితికి నిప్పంటించారు. జవాను నివాసానికి వేలాదిగా జనం తరలివచ్చి అంతిమ నివాళులు అర్పించారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు జవాన్లు జి సుబ్రమణియన్, సి శివచంద్రన్‌ల అంత్యక్రియలు వారి స్వస్థలాల్లో జరిగాయి. అరియాలూరు జిల్లాలో శివచంద్రన్ రెండేళ్ల కుమారుడు ఆర్మీ యూనిఫాం వేసుకుని తండ్రి చితికి నిప్పంటిచారు. ఈ తరుణంలో హృదయవిదారక వాతావరణం చోటుచేసుకుంది. ఇక ట్యూటికొరన్ జిల్లాలోని సవాలాపేరి గ్రామంలో సుబ్రమణియన్ భౌతిక కాయాన్ని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేశారు.

Pulwama Attack : Tribute to CRPF jawans