Home జాతీయ వార్తలు పుల్వామా ఘటనకు వ్యూహ రచన మోడీదే: మాజీ గవర్నర్

పుల్వామా ఘటనకు వ్యూహ రచన మోడీదే: మాజీ గవర్నర్

 

శ్రీనగర్: పార్లమెంట్ ఎన్నికలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పుల్వామా ఘటనకు ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహరచన చేశాడని మిజోరాం మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ పరోక్షంగా ఆరోపణలు చేశారు. అత్యంత భద్రత ఉండే జమ్మూ కశ్మీర్‌లోనికి పేలుడు పదార్థాలు కలిగిన కారు ఎలా? వచ్చిందని మోడీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల ముందు భారత్‌లో భావోద్వేగ వాతావరణం సృష్టించి మోడీ విజయం సాధించాలని చూశారని, ప్రజలు ఇలాంటి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పదుల సంఖ్యలో జవాన్లు చనిపోతే అమర వీరుల పేరు చెప్పుకొని ఓట్లు దండుకొని గెలుద్దామనుకున్నాడని మోడీపై కాంగ్రెస్ నేత అజీజ్ విమర్శలు గుప్పించారు. మధ్య ప్రదేశ్‌లోని భోపాల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్‌పై బిజెపి ఎందుకు అభ్యర్థిని ప్రకటించలేదని ప్రశ్నించారు. దిగ్విజయ్‌పై ఓడిపోతామన్న భయంతోనే బిజెపి నేతలు అభ్యర్థి కోసం వెతుకుతున్నారని దుయ్యబట్టారు. గతంలో సమాజీ వాది పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ కూడా పుల్వామా దాడిలో కుట్ర ఉందని ఆరోపణలు చేశారు. నలబై మంది అమర వీరుల పేరు చెప్పుకొని ప్రజలతో ఓట్లు దండుకోవాలని బిజెపి నేతలు దాడికి ప్లాన్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

 

Pulwama Attack was Pre Planned by Modi: Aziz Qureshi