Home సంగారెడ్డి చింతకుంట పాఠశాలలో కలకలం రేపిన కొండచిలువ

చింతకుంట పాఠశాలలో కలకలం రేపిన కొండచిలువ

సమాచారం ఇచ్చినా స్పందించని జోగిపేట ఆటవీ శాఖ అధికారులు
భయంతో కొట్టిచంపిన గ్రామస్థులు
PYTHAN

మన తెలంగాణ/జోగిపేట : సంగారెడ్డి జిల్లా అందోలు మండలం చింతకుంటలోని ప్రాథమిక పాఠశాలలో కొండ చిలువ కలకలం రేపింది. పాఠశాల చుట్టూ పరిసరాలలో పంట పొలాలు ఉండడంతో ఆటవీ ప్రాంతం నుంచి ఆహారం కోసం వచ్చిన కొండచిలువ పాఠశాలలోని ప్రధానోపాధ్యాయుడి కార్యాలయం పక్కనే ఉన్న తరగతి గది కిటికీ వద్ద శనివారం విద్యార్థులకు కనిపించింది. అప్పటికే ఏదో ఆహారంను భుజించి చుట్టగా చుట్టుకొని తరగతి గది కిటికీ పక్కన నిద్రిస్తున్న కొండచిలువ నుంచి శ్వాస శబ్ధం వినిపించడంతో ఏదో శబ్ధం వస్తుందని విద్యార్థులు గ్రహించి ఆటు వైపుగా చూశారు. దీంతో వారికి కొండచిలువ కనిపించింది. ఈ విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయులకు తెలపడంతో వారు జోగిపేట ఆటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినప్పటికీ వారు పాఠశాలకు చేరుకోలేదు. పైగా వారి సెల్‌ఫోన్‌లు అందు బాటులో లేకపోవడంతో భయాందోళనకు గురైన గ్రామస్థులు కొండచిలువను చంపివేశారు. జోగిపేట ఆటవీ శాఖ అధికారులు సకాలంలో స్పందించి పాఠశాలకు వచ్చి ఉంటే కొండచిలువను ప్రాణాలతో పట్టుకొని ఆటవీ ప్రాంతంలో వదిలే వారు. కానీ, ఆటవీ శాఖ అధికారుల నిర్లక్షం, ప్రజలలో నెలకొన్న భయం వల్ల వారు దానిని చంపివేశారు. సకాలంలో ఆటవీ శాఖ అధికారులు స్పందించక పోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగు తున్నాయని, సమాచారం తెలియగానే ఆటవీ శాఖ అధికారులు సంఘటన స్థలాలకు చేరుకుని ఉంటే కొండచిలువను ప్రాణాలతో తీసుకువెళ్లే వారు. ఆటవీ శాఖ అధికారుల నిర్లక్షం వల్ల వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోతుందని వన్యప్రాణుల ప్రియులు వాపోతున్నారు. ఈ సంఘటన గ్రామంతా దావానలంలా వ్యాపించడంతో కొండచిలువను చూసేందుకు ప్రజలు పాఠశాలకు తరలివచ్చారు.