Home తాజా వార్తలు కిరాతకానికి మారుపేరు రజ్వీ…

కిరాతకానికి మారుపేరు రజ్వీ…

Razwiప్రజల ప్రాణాలు, ప్రత్యేకించి తెలంగాణ సాయుధ పోరాట యోధుల ప్రాణాలు అతడికి లెక్క లేదు. అభం శుభం ఎరుగని ఆడ బిడ్డల మాన ప్రాణాలతో వికృతంగా ఆటలాడుకునే దుర్మార్గపు అలవాటు ఉన్న కిరాతకుడు అతడు.దేశానికి స్వాతంత్య్రం రావడానికి కొద్ది కాలం ముందు నుంచి అతడు సాగించిన కిరాతకాలు అన్నీ ఇన్నీ కావు. అతడి పేరు ఖాసిం రజ్వీ. చిట్ట చివరి నిజాంకు అత్యంత ఆంతరంగికుడుగా ఉంటూ, రాజు అండతో తెలంగాణ గ్రామాలన్నిటా మారణ కాండ సృష్టించిన రజ్వీ, అతడు పెంచి పోషించిన కిరాయి సైన్యం (రజాకార్లు) సాగించినవికృత చేష్టలు పరాకాష్ఠకు చేరుకున్న దశలో భారతీయ సైన్యాలు ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్‌లో ప్రవేశించి నిజాంను లొంగదీసుకున్న దాకా ఖాసిం రజ్వీ ఆడింది ఆట, పాడింది పాట. ఒక రకంగా చెప్పాలంటే ఆపరేషన్ పోలో జరగటానికి మూల కారణం కూడా రజ్వీయే అని చెప్పుకోవచ్చు. భారత స్వాతంత్య్రాన్ని నిజాం ధిక్కరించి తాను స్వతంత్ర ప్రభువుగా ఉండాలని కోరుకున్న దశలో అతడిని తుదకంటా ప్రోత్సహించిన వాడు రజ్వీయే. ఒకనాటి దేశ్‌ముఖ్
లు, జాగీర్దార్లు, ఇనామ్ దార్లు గ్రామాలలో సాగించిన దుర్మార్గాలను మించిన ఘాతుకాలను రజ్వీ ప్రజలకు రుచి చూపించాడు. ఎప్పుడు చేతిలో సిగరెట్‌తో, తాగిన మత్తులో తన రజాకార్ అనుచరులకు ఆదేశాలు ఇస్తూ వచ్చిన రజ్వీ, గ్రామాలలో భీతావహ వాతావరణం సృష్టించాడు.
మహిళలను విచక్షణా రహితంగా మానభంగం చేయించాడు. అడ్డు చెప్పిన వారిని ఉక్కుపాదంతో అణచి వేశాడు. అతడి దుర్మార్గాలను సహించలేక,
ఎదురు నిలిచే బలం లేక పలు గ్రామాల్లో ప్రజలు వలసలు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే అతడి అరాచకాలు ఏ స్థాయిలో సాగాయో
తెలిసిపోతుంది. నిజాంకు అనుకూలంగా వ్యవహరించని ఎవరినీ రజ్వీ వదలిపెట్టలేదు. చనుబాలు ఇస్తున్న బాలింతలను కూడా చూడకుండా రజాకార్ దుర్మార్గులు శారీర కంగా హింసించినట్టు వార్తలు తెలిసినప్పుడల్లా పైశాచికానందంతో వికటాట్టహాసం చేసే వాడట. అనేకమందిని వివస్త్రలను చేసి అవమానించిన రజాకార్ దుర్మార్గుల కండ కావరానికి మరింత నిప్పురాజేసి ఆనందం అనుభవించేవాడట రజ్వీ. ఉత్తరప్రదేశ్‌లో జన్మించి న్యాయవాద వృత్తిలో ఉన్న రజ్వీ అనూహ్యంగా నిజాం పంచన చేరాడు. అనతికాలంలోనే అతడికి ఆంతరంగికుడయ్యాడు. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీని స్థాపించిన రజ్వీ, ఢిల్లీ లాల్‌ఖిలాపై నైజాం పతాకం ఎగురవేస్తానని, యమునా నది జలాలు నిజాం పాదాలను తడిపేలా చేస్తాననీ చెబుతుండేవాడు. అతడి దురాగతాలకు ఒక ఉదాహరణ. వరంగల్ జిల్లా ఎర్రపాలెం గ్రామం అది. సబ్ ఇన్స్‌పెక్టర్ చాంద్‌ఖాన్ నాయకత్వంలో 35 మంది పోలీసులు, ఎనిమిది మంది రజాకార్లు ఒక్కసారిగా ఆ గ్రామంపై పడ్డారు. కనిపించిన ప్రతి ఇంటినీ లూటీ చేశారు. గుడిసెలు తగులబెట్టారు. మహిళలను ఇళ్ళలోంచి వీధుల్లోకి లాగి అవమానించారు. పన్నెండు మందిని చిత్రహింసలకు గురి చేసి నడిబొడ్డున కాల్చి చంపారు. మిగిలిన మహిళలకూ ఆ తర్వాత అదే గతి పట్టింది. ఆ రకంగా మొత్తం గ్రామంలో మహిళలనే వారే లేకుండాపోయారు. వారి దురాగతాలు అంతటితో ఆగలేదు. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు తోస్తే అప్పుడు గ్రామాలపై పడి అందరినీ నిలువునా దోచుకునే వారు. ఇళ్ళు తగులపెట్టటం, పంటలు నాశనం చేయటం, బంగారం, వెండి దోచుకోవటం నిత్యకృత్యాలుగా ఉండేవి. ఇంతటి రాక్షస కాండ సాగించిన రజ్వీని స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం అరెస్టు చేసి షోయబుల్లాఖాన్ హత్యా నేరంపై యావజ్జీవ శిక్ష విధించింది. ఆ తర్వాత రజ్వీ మద్దతుదారుడైన న్యాయవాది అప్పీల్ చేస్తే అది ఎనిమిది సంవత్సరాలకు తగ్గి రజ్వీ చంచల్‌గుడా జైలుకు వచ్చాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత పాకిస్తాన్‌కు పారిపోయి అక్కడే దిక్కులేని చావు చచ్చాడు.