Home ఎడిటోరియల్ రాఫెల్ ఒప్పందం

రాఫెల్ ఒప్పందం

AIRINDIA

మీడియం మల్టీరోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్టులు భారత వైమానిక దళానికి కనీసం 200 కావాలని 2001 నుంచి ఎయిర్ ఫోర్సు కోరుతోంది. యు.పి.ఎ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2007లో ఈ విమానాల కొనుగోలుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వివిధ దేశాలకు చెందిన చాలా కంపెనీ లు విమానాలు సరఫరా చేస్తామని ముందుకు వచ్చాయి. చివరకు ఫ్రాన్సుకు చెందిన డాసాల్ట్ కంపెనీ నుంచి కొనాలని 2012లో నిర్ణయించారు. రక్షణకు సంబంధించిన వ్యవహారం కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచి తూచి కొనుగోలు ఒప్పందం జరిగింది. 126 రాఫెల్ యుద్ధవిమానాలు 10.2 బిలియన్ల అమెరికన్ డాలర్లకు కొనడానికి సిద్ధపడ్డాం. ఒప్పందం ప్రకారం 18 యుద్ధవి మానాలు ఎగరడానికి సిద్ధంగా ఉన్న స్థితిలో కంపెనీ మనకు అందించాలి. మిగిలిన 108 విమానాలను భారతదేశంలోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో తయారు చేయించాలి. అందుకు అవసరమైన సాంకే తిక పరిజ్ఙానాన్ని బదలాయించాలి. ఈ కొనుగోలు ఒప్పందం ద్వారా డాసాల్ట్ కు లభించే రెవెన్యూలో 50 శాతం రెవెన్యూ భారతదేశంలో ఖర్చు పెట్టాలి. టెక్నాల జీ బదిలీ చేయాలి. ఈ ఒప్పందం భారతదేశానికి చాలా అనుకూలంగా ఉన్న ఒప్పందం. ఇలాంటి ఒప్పందానికి డాసాల్ట్ ఎందుకు ఒప్పుకుంది? భారతదేశం ఇతర కంపెనీలను వదిలి ఈ కంపెనీనే ఎందుకు ఎంచు కుంది? ఈ ప్రశ్నలు ఆలోచించదగ్గవి. మన అవసరాల కు రాఫెల్ విమానాలు అనుగుణంగా ఉండడం వల్ల, ఈ కంపెనీ తక్కువ ధరను కోట్ చేయడం వల్ల భారతదేశం ఒప్పుకుంది. ఆర్ధికంగా తీవ్రమైన సంక్షోభంలో ఉన్నందు వల్ల, దాదాపు దివాలా తీసే స్థితిని ఎదుర్కుంటున్నం దువల్ల, ఇంత పెద్ద కాంట్రాక్టుతో మళ్ళీ నిలబడే అవకాశం ఉంది కాబట్టి డాసాల్ట్ కంపెనీ కూడా ఒప్పుకుంది. అంతకు ముందు బ్రెజిల్, యుఎయిలకు ఈ విమానాలు అమ్మాలని డాసాల్ట్ ప్రయత్నించి విఫల మైంది. చివరకు ఈజిప్టుకు అమ్మగలిగింది. ఇప్పుడు ఇండియాకు అమ్ముతుంది.
ఈ ఒప్పందం మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్న ప్పుడు కుదిరిన ఒప్పందం. ఆ తర్వాత ఎన్నికలు జరిగి, మోడీ ప్రధాని అయ్యారు. ఆయన రాగానే ఈ ఒప్పందాన్ని పూర్తిగా మార్చేశారు. పాత ఒప్పందం రద్దు చేసి కొత్త ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు రెండు ఒప్పందాల మధ్య తేడా చూద్దాం. పాత ఒప్పందం ప్రకారం 126 యుద్ధవిమానాలు 10.2 బిలియన్ డాలర్లకు రాఫెల్ అమ్మడానికి సిద్ధపడింది. కొత్త ఒప్పం దం ప్రకారం కేవలం 36 యుద్ధ విమానాలు 8.74 బిలియన్ డాలర్లకు కొనడానికి ఇండియా సిద్ధపడింది. అంటే పాత ఒప్పందం కన్నా దాదాపు మూడురెట్లు అధికధరకు కొంటున్నారు. పాత ఒప్పందం ప్రకారం ఒక్కో విమానం ధర 81 మిలియన్ డాలర్లు, కొత్త ఒప్పందం ప్రకారం ఒక్కో విమానం ధర 243 మిలియన్ డాలర్లు. పాత ఒప్పందం ప్రకారం టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ నిబంధన ఉంది. కొత్త ఒప్పందంలో అది లేదు. రెండు ఒప్పందాల్లోను 50 శాతం రెవెన్యూ ఇండియాలో ఖర్చుపెట్టాలన్న నిబంధన ఉంది. ఇప్పుడు మీకు మేకిన్ ఇండియాకు దీనికి ఉన్న సంబంధం అర్ధమైందా.. అర్ధం కాలేదా.. ఇది మేకిన్ ఇండియాకు బై బై చెప్పడమనుకుంటున్నారా? అయితే మీరు వెంటనే బ్లడ్ ప్రషర్ చెక్ చేయించుకున్నట్లు మీ దేశభక్తిని చెక్ చేయించుకుని అవసరమైన మందులు వాడండి.
దీర్ఘకాలంలో దేశీయ టెక్నాలజీని అభివృద్ధి చేయా లనే ఉద్దేశ్యంతో టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ నిబంధన పెట్టి హెచ్‌ఎఎల్ లో ఈ విమానాలు తయారవ్వాలని మొదటి కాంట్రాక్టులో చెప్పారు. అందుకు కంపెనీ కూడా ఒప్పు కుంది. కాని తర్వాత కంపెనీ ఈ విషయమై పేచీలు మొదలు పెట్టింది. దివాలా స్థితిలో ఉన్న కంపెనీ, ఈ కాంట్రాక్టు దొరకడమే మహాభాగ్యం అనుకునే దశలో ఉన్న కంపెనీ తర్వాత పేచీలెందుకు పెట్టింది? ముఖ్యం గా టెక్నాలజి ట్రాన్స్ ఫర్ విషయంలోను, హెచ్ ఏ ఎల్ లో తయారీ విషయంలోను ఎందుకు మడతపేచీలు మొదలయ్యాయి అనేవి ఆలోచించవలసిన ప్రశ్నలు.
డస్సాల్ట్ కంపెనీతో మొదట డీల్ కుదిరిన రెండు వారాల్లోనే ముఖేష్ అంబానీ అడుగుపెట్టాడు. డసాల్ట్ కంపెనీలో భాగస్వామిగా అయ్యడు. ఆ వెనుకే, అంటే ఈ సంవత్సరం అనిల్ అంబానీ కూడా ఇందులో అడుగుపెట్టాడు. కాని అంబానీల ఎంట్రీ తర్వాత పరిస్థితి మారింది. డసాల్ట్ సంస్థ టెక్నాలజీ ట్రాన్స్ ఫరుకు, విమానాల్లో ఆయుధవ్యవస్థకు అదనంగా సొమ్ము ఇవ్వాలని డీల్ 18 నుంచి 22 బిలియన్ డాలర్లకు పెంచే ప్రయత్నం చేసింది. అంతేకాదు, హెచ్‌ఎఎల్ లో తయారు చేసే విమానాలకు గ్యారంటీ ఇవ్వమని చెప్పింది. మొదట గ్యారంటికి ఒప్పుకుందని గమనించాలి. అంటే అంబానీ అడుగుపెట్టిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. అంటే మొదట డసాల్ట్ కంపెనీ దివాలా స్థితిలో ఉన్న కంపెనీ, మునిగిపోతున్న కంపెనీ, ఈ డీల్ లేకపోతే మనుగడే కష్టంగా ఉన్న కంపెనీ, పైగా అంతర్జాతీయంగా పారదర్శకత విషయం లో ఏమంత మంచి పేరు లేని కంపెనీ, స్వయంగా డసాల్ట్ సి.యి.ఒ.పై ఆర్ధిక అక్రమాల ఆరోపణలున్నా యి. అందువల్ల గత్యంతరం లేని స్థితిలో ఈ డీల్ కు ఒప్పుకుంది. కాని అంబానీ అడుగుపెట్టిన తర్వాత పరిస్థితి మారింది. దేశంలోని వివిధ పార్టీలను ప్రభావితం చేయగలిగిన కార్పోరేట్ దిగ్గజం భాగస్వామి గా అడుగుపెట్టిన తర్వాత డసాల్ట్ బేరసారాలు చేయడం మొదలెట్లింది. డసాల్ట్ తోనే అంబానీ భాగస్వామ్యం ఎందుకు చేసుకున్నాడో వివరాలు చెప్పనవసరం లేదను కుంటాను. ఒక భారీ…కాదు చాలా చాలా భారీ డీల్ డసాల్ట్ కు దొరికింది కాబట్టే ఈ భాగస్వామ్యం. ఆ డీల్ ను మరింత లాభసాటిగా, అంటే తనకు లాభసాటిగా మార్చుకోవడం ఆయనకు బాగా తెలుసు. కాబట్టి డసాల్ట్ మడతపేచీలు మొదలు పెట్టింది. కృష్ణా బేసిన్ సహజ వాయువు వ్యవహారాలను చదివిన వారికి అంబా నీ పలుకుబడి ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కాని డసాల్ట్ మడతపేచీలతో డీల్ పెంచాలని అనుకున్నా రక్షణమంత్రిగా ఏ.కే.ఆంటోనీ ఉండడం వల్ల పెద్ద అడ్డంకి అయ్యింది. ఏ.కే.ఆంటోనీ భారత రాజకీయాల్లో చాలా అరుదైన నాయకుల్లో ఒకడని ప్రత్యర్థులు కూడా ఒప్పుకుంటారు. ఆంటోనీ వంటి నిజాయితీపరులు చాలా తక్కువ. ఆయన రక్షణమంత్రి గా ఉండడం వల్ల, ఈ మడతపేచీల వ్యవహారాన్ని ఆయన ఆపేశాడు. కాబట్టి డసాల్ట్ అంబానీ భాగస్వా మ్యం మరో రెండు సంవత్సరాలు ఆగవలసి వచ్చింది. అంబానీలతో మోడీ సాన్నిహిత్యం అందరికీ తెలిసినదే. జియో ప్రకటనల్లో ప్రధాని మోడీ పేరును, ఫోటోను వాడుకున్నా ఆయనేమీ అనలేదు. మోడీ ప్రధానిగా వచ్చిన తర్వాత ఈ డీల్ కదలడం మళ్ళీ ప్రారంభమైంది. ఒరిజినల్ డీల్ భారతదేశానికి అనుకూ లంగా ఉంటే, దాన్ని మార్చి డసాల్ట్ కంపెనీకి అనుకూల ంగా లాభసాటి గా కొత్త డీల్ చేసుకున్నారు. ఈ నిర్ణయం గురించి కనీసం రక్షణ మంత్రి పరిక్కర్ కి కూడా తెలియదని కొందరి అభిప్రాయం. స్వయంగా బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి ఈ డీల్‌ను బహిరంగంగా విమర్శిం చడమే కాదు దీనిపై ప్రజాప్ర యోజక వ్యాజ్యం వేస్తాన న్నాడు. వెంటనే ఆయనకు రాజ్యసభలో సీటు దొరికింది. ఆ తర్వాత ఆయన మాట్లాడలేదు. కాంగ్రెసు కూడా దీనిపై పెద్దగా మాట్లాడ దు. ఎందుకంటే కాంగ్రెసుకు కూడా అంబానీ వంటి కార్పోరేట్లు చాలా అవసరం. మీడియా కూడా మాట్లాడదు. అందరికీ కార్పోరేట్ ఆశీస్సులు అవసరం.
భారత రక్షణ అవసరాలకు కావలసిన యుద్ధవిమా నాలు కొనడంలో తప్పు పట్టవలసింది ఏమీ లేదు. కాని దాని వెనుక నడుస్తున్న ఈ కథనే మనం గమనించడం అవసరం. దేశానికి అనుకూలంగా ఉన్న డీల్ ను పక్కన పాడేసి, కంపెనీకి అనుకూలంగా డీల్ కుదుర్చుకున్న వైనాన్ని చూడాలి. కాని విచిత్రమేమంటే, రాఫెల్ డీల్ భారత చరిత్రలో గొప్ప ఒప్పందమనీ, మోడీ గారు కాబట్టి ఇలాంటిది సాధించారని హోరెత్తించే ప్రచారం జరుగుతోంది. నమ్మాలి… నమ్మకపోతే .. దేశభక్తి టెస్టు చేయించుకుని, ఏవన్నా మాత్రలు వేసుకుని బాగుపడాలి మరి?
అందుకే రాఫెల్ డీల్ పై ఒక శ్వేతపత్రం ప్రచురిస్తే, మొదట కుదిరిన డీల్, ఆ తర్వాత కొత్తగా వచ్చిన డీల్, మొదటి డీల్ ఎందుకు తుంగల్లో తొక్కారు? కొత్త డీలులో ప్రత్యేకతలేమిటి? ఎందుకు ఖరీదు పెరిగిందన్న వివరాలు అందిస్తే నమ్మకం కుదురుతుందని అనిపించ వచ్చు. కానీ అలా శ్వేతపత్రం డిమాండ్ చేయడం కూడా దేశభక్తి లెవెల్ప్ ప్రమాదకరస్థాయికి పడిపోయాయన డానికి నిదర్శనం. వెంటనే రెండిజక్షన్లు పుచ్చుకోవాలి. అప్పటి బోఫోర్స్ స్కాము 64 కోట్ల రూపాయలు. రాఫెల్ డీల్ 59000 కోట్ల రూపాయలు. బోఫోర్స్ స్కామ్ ఎనభైలలో జరిగింది. అప్పటికి ఇప్పటికీ తేడా లెక్కేసుకుని వందరెట్లు అనుకున్నా అది 6400 కోట్లకు మించదు… ఏమిటో ఈ లెక్కలు.. దేశభక్తి బాబు.. దేశభక్తి…

  • వాహెద్ అబ్దుల్