పారిస్ : స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేశాడు. తనకు ఎంతో అచ్చివచ్చే ఫ్రెంచ్ ఓపెన్‌లో పదకొండో టైటిల్‌ను సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్ క్వాలిఫయింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. మెయిన్ డ్రా పోటీలకు ఆదివారం తెలరలేవనుంది. ఇదిలావుండగా చిరకాల ప్రత్యర్థి, రెండో సీడ్ రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) దూరం కావడం, ఆండీ ముర్రే (బ్రిటన్) బరిలో లేక పోవడం నాదల్కు కలిసి వచ్చే అంశాలు. అంతేగాక, మాజీ నంబర్‌వన్, నొవాక్ జొకొవిచ్ కూడా పేలవమైన సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యలో నాదల్కు గట్టి పోటీ ఇచ్చే వారు దారిదాపుల్లో కనిపించడం లేదు. అంతేగాక, ఇటీవలే రోమ్ ఓపెన్ టైటిల్‌ను సాధించడం ద్వారా నాదల్ జోరుమీదున్నాడు. తిరిగి నంబర్‌వన్ ర్యాంక్ వరించడంతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ పరిస్థితుల్లో నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకోవడం ఖాయమని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. ఇతర ఆటగాళ్లు బరిలో ఉన్నా ఫెదరర్ లేక పోవడం నాదల్కు అతి పెద్ద ఊరటగా చెప్పవచ్చు. ఫెదరర్ ఉంటే నాదల్కు టైటిల్ సాధించడం కాస్త కఠినంగానే ఉండేది. అయితే ఫెదరర్ ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరంగా ఉండాలని చాలా కాలం కిందటే నిర్ణయించాడు. దీంతో నాదల్ టైటిల్ అవకాశాలు గణనీయంగా మెరుగు పడ్డాయి. జొకొవిచ్ ఇప్పటికిప్పుడూ పూర్వ వైభవం సాధించడం కష్టంగానే చెప్పవచ్చు. వరుస గాయాలు ఈ మాజీ చాంపియన్‌ను వేధిస్తున్నాయి. ప్రస్తుతం జొకొవిచ్ టాప్20 ర్యాంక్‌లలో కూడా లేడు. దీంతో అతను పుంజుకొని టైటిల్ సాధించడం అంత సులువుకాదు. అయితే మూడో అలెగ్జాండర్ జ్వరెవ్ (జర్మనీ), నాలుగో సీడ్ మారిన్ సిలిక్ (క్రొయేసియా), ఐదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా), ఆరో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) తదితరులు కూడా టైటిల్ సాధించే సత్తా కలిగిన వారే. కానీ, రొనాల్డ్ గారస్లో ఎదురులేని శక్తిగా పరిగణించే నాదల్‌ను ఎదుర్కొని టైటిల్ సాధించడం మాత్రం దాదాపు అసాధ్యంగానే చెప్పాలి.