Search
Wednesday 26 September 2018
  • :
  • :

ప్రిక్వార్టర్ ఫైనల్లో నాదల్, వోజ్నియాకి

ఒస్టాపెంకొ, సొంగా ఔట్, ఆస్ట్రేలియా ఓపెన్

మెల్‌బోర్న్: స్పెయిన్ బుల్, టాప్ సీడ్ రఫెల్ నాదల్ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ కరొలైన్ వోజ్నియాకి, నాలుగో సీడ్ ఎలినా స్విటోలినా (ఉక్రెయిన్) మూడో రౌండ్‌లో విజయం సాధించారు. మరోవైపు మూడో సీడ్ గ్రిగొర్ డిమిత్రొవ్ (బెల్జియం), ఆరో సీడ్ మారిన్ సిలిక్ (క్రొయేసియా), 17వ సీడ్ నిక్  కిర్గియాస్ నాలుగో రౌండ్‌లో ప్రవేశించారు. కాగా, మహిళల విభాగంలో ఏడో సీడ్ జెలెనా ఒస్టాపెంకొ (లాత్వియా), బొండారెండో (ఉక్రెయిన్) ఓటమి పాలయ్యారు. పురుషుల సింగిల్స్‌లో       గిల్స్ ముల్లర్, వెల్ఫ్రెడ్ సొంగా మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు.

nadal

నాదల్ అలవోకగా…
పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్, కిందటి రన్నరప్ రఫెల్ నాదల్ జోరు కొనసాగిస్తున్నాడు. వరుసగా మూడో మ్యాచ్‌లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌లో నాదల్ 61, 63, 61 దామిర్ జుముర్(బోస్నియా)ను ఓడించాడు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన నాదల్ ఏ దశలోనూ ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. తనకు మాత్రమే సాధ్యమే షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. నాదల్ జోరుతో జుముర్ వద్ద సమాధానం లేకుండా పోయింది. వరుసగా మూడు సెట్లలో కూడా గెలిచి నాదల్ నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లాడు. ఇంతకు ముందు జరిగిన రెండు మ్యాచుల్లో కూడా నాదల్ సునాయాస విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, మూడో రౌండ్‌లో నాదల్ మరింత విజృంభించి ఆడాడు. అసాధారణ షాట్లతో ప్రత్యర్థిని హడలెత్తించాడు. చివరి వరకు దూకుడును ప్రదర్శిస్తూ మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మరో పోటీలో మూడో సీడ్ డిమిత్రొవ్ విజయం సాధించాడు. రష్యా ఆటగాడు ఆండీ రుబ్లెవ్‌తో జరిగిన పోరులో దిమిత్రొవ్ 63, 46, 64, 64తో విజయం సాధించాడు. తొలి సెట్‌ను సునాయాసంగా గెలిచిన దిమిత్రొవ్‌కు రెండో సెట్‌లో ఓటమి ఎదురైంది. అయితే తర్వాతి రెండు సెట్లలో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. మరోవైపు ఆరో సీడ్ మారిన్ సిలిక్ కూడా నాలుగో రౌండ్‌లో ప్రవేశించాడు. మూడు సెట్ల సమరంలో అమెరికా ఆటగాడు రియాన్ హారిసన్‌ను కంగుతినిపించాడు. అద్భుత ఆటను కనబరిచిన సిలిక్ 76, 63, 76 తేడాతో విజయం సాధించాడు. తొలి, మూడు సెట్లు టైబ్రేకర్ వరకు వెళ్లినా సిలిక్ పట్టు సడలించలేదు. చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకొని విజయాన్ని అందుకున్నాడు.
సొంగా ఔట్…
మరోవైపు ఫ్రాన్స్‌కు చెందిన 15వ సీడ్ జో వెల్ఫ్రెడ్ సొంగా మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. ఆస్ట్రేలియా ఆటగాడు, 17వ సీడ్ నిక్ కిర్గియాస్ చేతిలో కంగుతిన్నాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో కిర్గియాస్ 76, 46, 76, 76 తేడాతో సొంగాను ఓడించాడు. ఇద్దరు కూడా ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డి పోరాడారు. తొలి సెట్‌ను గెలిచిన కిర్గియాస్‌కు రెండో సెట్‌లో చుక్కెదురైంది. అయితే తర్వాతి రెండు సెట్లలో గెలిచి కిర్గియాస్ మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మ్యాచ్‌లో మూడు సెట్‌లు టైబ్రేకర్ వరకు వెళ్లాయి. దీన్ని బట్టి పోరు ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో ఊహించవచ్చు. కీలక సమయంలో సొంగా ఒత్తిడికి గురయ్యాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న కిర్గియాస్ నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లాడు. ఇతర పోటీల్లో పదో సీడ్ పాబ్లొ కర్రెనొ బుస్తా (స్పెయిన్), ఆండ్రిస్ సెప్పి (ఇటలీ) విజయం సాధించి నాలుగో రౌండ్‌కు చేరుకున్నారు.
ఎదురులేని వోజ్నియాకి..
మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ వోజ్నియాకి (డెన్మార్క్) సునాయాస విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌లో వోజ్నియాకి 63, 64తో కికి బెర్టెన్స్(నెదర్లాండ్స్)ను ఓడించింది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన వోజ్నియాకి ఏ దశలోనూ ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. చివరి వరకు దూకుడుగా ఆడుతూ మ్యాచ్‌ను సొంతం చేసుకంది. నాలుగో సీడ్ ఎలినా స్విటోలినా (ఉక్రెయిన్) కూడా సునాయాస విజయంతో నాలుగో రౌండ్‌కు చేరుకుంది. తన దేశానికే చెందిన మార్తా కొస్తుయుక్‌తో జరిగిన పోరులో స్విటోలినా విజయం సాధించింది. ఏకపక్ష పోరులో స్విటోలినా 62, 62తో జయకేతనం ఎగుర వేసింది. మరో పోటీలో 19వ సీడ్ రిబరికొవా (స్లోవేకియా) విజయం సాధించింది. ఉక్రెయిన్ క్రీడాకారిణి బొండారెంకొతో జరిగిన పోరులో రిబరికొవా విజయాన్ని అందుకుంది. మూడు సెట్ల పోరాటంలో రిబరికొవా 75, 36, 61 తేడాతో విజయం సాధించింది. పెట్రా మార్టిక్ (క్రొయేసియా) కూడా నాలుగో రౌండ్‌కు చేరుకుంది. మూడు సెట్ల హోరాహోరీ సమరంలో మార్టిక్ 63, 36, 75తో థాయిలాండ్‌కు చెందిన లుసికా కుంకుమ్‌ను ఓడించింది.
ఒస్టాపెంకొకు షాక్…
మరోవైపు ఏడో సీడ్ జెలెనా ఒస్టాపెంకొ (లాత్వియా)కు మూడో రౌండ్‌లోనే షాక్ తగిలింది. ఇస్టోనియాకు చెందిన కొంటావెల్ట్ 63, 16, 63తో ఒస్టాపెంకొను కంగుతినిపించింది. ప్రారంభం నుంచే కొంటావెల్ట్ పైచేయి సాధించింది. చూడచక్కని షాట్లతో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టింది. ఇదే క్రమంలో సునాయాసంగా తొలి సెట్‌ను దక్కించుకుంది. కానీ రెండో సెట్‌లో ఒస్టాపెంకొ పుంజుకుంది. అద్భుత షాట్లతో విరుచుకు పడిన ఒస్టాపెంకొ సెట్‌ను సొంతం చేసుకుంది. కానీ, కీలకమైన మూడో సెట్‌లో మళ్లీ కొంటావెల్ట్ ఆధిపత్యం చెలాయించింది. చివరి వరకు దీన్ని కాపాడుకున్న కొంటావెల్ట్ మ్యాచ్‌ను దక్కించుకొని నాలుగో రౌండ్‌కు చేరుకుంది.

Comments

comments