Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

రఫెల్ నాదల్ నంబర్‌వన్

ముర్రే రెండు.. ఫెదరర్ మూడో స్థానం
ఎటిపి ర్యాంకింగ్స్‌లో వెల్లడి

Nadal

పారిస్ : స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. సోమవారం తాజాగా విడుదల చేసిన ఎటిపి ర్యాంకింగ్స్‌లో నాదల్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. 2014 జులైలో పురుషుల సింగిల్స్‌లో టాప్ ర్యాంకులో నిలిచిన 31 ఏళ్ల టెన్నిస్ స్టార్ మూడేళ్ల విరామం తరువాత తొలిసారిగా నంబర్‌వన్ స్థానంలో నిలిచాడు. గతవారం ఓహియోలో జరిగిన సిన్సినాటి టోర్నీ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన రఫెల్ 2–65-7 తేడాతో ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీ నుంచి ప్రస్తుత ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ ఆండీ ముర్రేతో పాటు స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెదరర్ గాయం కారణంగా తప్పుకోవడంతో నాదల్ నంబర్‌వన్ స్థానానికి మార్గం సుగమమైంది. ఈ ఏడాది రోలాండ్ గారోస్ టోర్నీలో 15వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్న నాదల్ ముర్రేను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. దీంతో తరువాతి స్థానాల్లో ముర్రే 7,150 పాయింట్లతో రెండో ర్యాంకుకు పడిపోగా, రోజర్ ఫెదరర్ 7,145 పాయింట్లతో మూడో ర్యాంకులో నిలిచాడు. టాప్ పది ర్యాంకులలో మిగతా టెన్నిస్ ఆటగాళ్లు సిట్జర్లాండ్ స్టాన్ వావ్రింకా 5, 690 పాయింట్లతో నాల్గో ర్యాంకులో నిలవగా, సెర్బియా ఆటగాడు నోవాక్ జొకోవిక్ 5,325 పాయింట్లతో ఐదో ర్యాంకులో నిలిచాడు. జర్మనీ టెన్నీస్ క్రీడాకారుడు అలెగ్జాండర్ జ్వెరావ్ 4,470 పాయింట్లతో ఆరో ర్యాంకులో ఉండగా, మారిన్ కిలిక్ (క్రోయేషియా) 4,155 పాయింట్లతో ఏడో ర్యాంకు, డొమినిక్ థిమ్ (ఆస్ట్రియా) 4, 030 పాయింట్లతో ఎనిమిదవ ర్యాంకులో నిలవగా, బల్గేరియా టెన్నిస్ ఆటగాడు గ్రిగోర్ డిమిట్రోవ్ సిన్సినాటి ఫైనల్ పోరులో నిక్ కిర్గియోస్‌పై విజయం సాధించడంతో ఏకంగా 18 స్థానాలను ఎగబాకి ఎటిపి ర్యాంకింగ్స్‌లో 9వ ర్యాంకులో నిలిచాడు. జపాన్ క్రీడాకారుడు కీ నిషికోరి 10వ ర్యాంకులో నిలిచాడు.

Comments

comments