Search
Sunday 18 November 2018
  • :
  • :

నాదల్, వోజ్నియాకి ముందంజ

మూడో రౌండ్‌లో డిమిత్రొవ్, సొంగా, ఒస్టాపెంకొ

 ఆస్ట్రేలియా  ఓపెన్

tennis

మెల్‌బోర్న్: టాప్ సీడ్ రఫెల్ నాదల్ (స్పెయిన్) ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ కరోలినా వోజ్నియాకి (డెన్మార్క్), నాలుగో సీడ్ ఎలినా స్విటోలోనా (ఉక్రెయిన్), ఏడో సీడ్ జెలినా ఒస్టాపెంకో(లాత్వియా) రెండో రౌండ్‌లో విజయం సాధించారు. పురుషుల విభాగంలో మూడో సీడ్ గ్రిస్సర్ డిమిత్రోవ్ (బల్గేరియా), ఐదో సీడ్ మారిన్ సిలిక్ (క్రోయేసియా), విల్‌ఫ్రెడ్ సొంగా (ఫ్రాన్స్) మూడో రౌండ్‌కు దూసుకెళ్లారు. బుధవారం జరిగిన రెండో రౌండ్‌లో అగ్రశ్రేణి ఆటగాడు, కిందటి రన్నరప్ నాదల్ వరుస సెట్లలో విజయం సాధించాడు. అర్జెంటీనా ఆటగాడు లియోనార్డొ మేయర్‌తో జరిగిన పోరులో నాదల్ 63, 64, 76తో విజయం సాధించాడు. తొలి రెండు సెట్లు సునాయాసంగా గెలిచిన నాదల్ గాయం వల్ల మూడో సెట్‌లో కాస్త ఇబ్బంది ఎదుర్కొన్నాడు. అయితే చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ విజయాన్ని అందుకున్నాడు. మరోవైపు మూడో సీడ్ డిమిత్రోవ్ చెమటోడ్చి విజయం సాధించాడు. అమెరికా ఆటగాడు మెక్‌డొనాల్డ్‌తో జరిగిన మారథాన్ సమరంలో డిమిత్రోవ్ 46, 62, 64, 06, 86 తేడాతో కష్టపడి నెగ్గాడు. తొలి సెట్‌లో ఓటమి పాలైన డిమిత్రోవ్ తర్వాత వరుసగా రెండు సెట్లు గెలిచి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. కానీ, కీలకమైన నాలుగో సెట్‌లో మెక్‌డొనాల్డ్ అసాధారణ రీతిలో చెలరేగి పోయాడు. ప్రత్యర్థి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడిన మెక్‌డొనాల్డ్ ఒక్క గేమ్ కూడా కోల్పోకుండానే సెట్‌ను దక్కించుకున్నాడు. ఇక, ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో కూడా సమరం యుద్ధాన్ని తలపించింది. ఇందులో కూడా ఇద్దరు సర్వం ఒడ్డి పోరాడారు. చివరికి డిమిత్రోవ్ పట్టు నిలుపుకొని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మరో పోటీలో ఫ్రాన్స్ స్టార్ సొంగా కూడా చెమటోడ్చాడు. కెనడా స్టార్ షా పొవాలొవ్‌తో జరిగిన హోరాహోరీ పోరులో సొంగా 36, 63, 16, 76, 75తో విజయం సాధించాడు. తొలి సెట్‌లో షా విజయం దక్కించుకున్నాడు. చూడచక్కని షాట్లతో అలరించిన షా సునాయాసంగా విజయం అందుకున్నాడు. అయితే రెండో సెట్‌లో సొంగా పుంజుకున్నాడు. తనదైన షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్‌లో షా పైచేయి సాధించాడు. ఈ సెట్ అతని ఖాతాలోకి వెళ్లింది. అయితే తర్వాతి రెండు సెట్లను గెలుచుకున్న సొంగా మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. ఇక, ఐదో సీడ్ సిలిక్ సునాయాస విజయంతో మూడో రౌండ్‌లో ప్రవేశించాడు. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సిలిక్ 61, 75, 62తో సౌసా (పోర్చుగల్)ను చిత్తు చేశాడు.
వోజ్నియాకి ముందంజ…
మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ వోజ్నియాకి (డెన్మార్క్) మూడో రౌండ్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన రెండో రౌండ్‌లో వోజ్నియాకి 36, 62, 75 తేడాతో క్రొయేసియా క్రీడాకారిణి జానా ఫెట్‌ను ఓడించింది. తొలి సెట్‌లో ఫెట్ విజయం సాధించింది. అయితే తర్వాతి రెండు సెట్లను గెలుచుకున్న వోజ్నియాకి ముందంజ వేసింది. మరో పోటీలో ఏడో సీడ్ ఒస్టాపెంకొ (లాత్వియా) జయకేతనం ఎగుర వేసింది. మూడు సెట్ల సమరంలో ఒస్టాపెంకొ 63, 36, 64తో చైనా క్రీడాకారిణి ఇంగ్ ఇంగ్ డౌన్‌ను ఓడించింది. మరోవైపు నాలుగో సీడ్ స్విటోలినా (ఉక్రెయిన్) విజయం సాధించింది. సినియా కొవా (చెక్)తో జరిగిన పోరులో స్విటోలినా 46, 62, 61తో విజయం సాధించి మూడో రౌండ్‌కు చేరుకుంది.

Comments

comments