Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

టైటిలే లక్ష్యంగా నాదల్

  • నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్

nadal

పారిస్: స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ తనకు అచ్చివచ్చే రొలాన్డ్ గారొస్ (ఫ్రెంచ్ ఓపెన్)లో మరోసారి టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు. మట్టి కోర్టులపై ఆకాశమే హద్దుగా చెలరేగే నాదల్ ఇప్పటివరకు రికార్డు స్థాయిలో తొమ్మిది సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెలుచుకున్నాడు. ఆదివారం ప్రారంభమయ్యే సీజన్ రెండోగ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ అయిన ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ గెలవడమే లక్షంగా పెట్టుకున్నాడు. తనకు ఎంతో ప్రత్యేకమైన ఫ్రెంచ్ ఓపెన్‌లో పదో టైటిల్‌ను గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. కిందటిసారి గాయం వల్ల అర్ధాంతరంగా టోర్నీకి దూరమైన నాదల్ ఈసారి విజయమే లక్షంగా పెట్టుకున్నాడు. అయితే అతనికి డిఫెండింగ్ ఛాంపియన్ సెర్బియా స్టార్ నొవాక్ జొకొవిచ్ నుంచి గట్టి పోటీ తప్పెలా లేదు. 2015లో జొకొవిచ్ చేతిలో నాదల్ ఓటమి పాలయ్యాడు. కిందటి ఏడాది గాయం వల్ల టోర్నీకి దూరమయ్యాడు. కాగా, ఇప్పటివరకు ఫ్రెంచ్ ఓపెన్‌లో 72 మ్యాచుల్లో గెలిచిన నాదల్ కేవలం రెండింటిలో మాత్రమే ఓటమి పాలయ్యాడు. దీన్ని బట్టి రొలాన్డ్ గారొస్‌లో నాదల్ ఆధిపత్యం ఎలా సాగిందో అర్థమవుతోంది. కాగా, సెమీఫైనల్లో నాదల్‌కు జొకొవిచ్ ఎదురుకానున్నాడు. అతన్ని ఓడిస్తే పదో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకోవడం స్పెయిన్ దిగ్గజానికి కష్టం కాకపోవచ్చు. మరోవైపు చిరకాల ప్రత్యర్థి రోజర్ ఫెదరర్ కూడా గాయం వల్ల టోర్నీకి దూరమయ్యాడు. దీంతో నాదల్ పని మరింత తేలిక అయ్యింది. అంతేగాక, ఈ ఏడాది ఇప్పటికే పది టైటిల్స్ సాధించిన నాదల్ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇదే సమయంలో ప్రపంచ నెంబర్ వన్ ఆండీ ముర్రే, రెండో సీడ్ జొకొవిచ్‌లు పేలవమైన ఫాంతో సతమతమవుతున్నారు. ఇది కూడా నాదల్‌కు అనుకూలించే పరిణామమే. అనుకున్నట్టు సాగితే నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో కొత్త ఆధ్యాయానికి తెరలేపడం ఖాయం. నాదల్ తొలి రౌండ్‌లో టెనోయిట్ పెయిర్(ఫ్రాన్స్)తో తలపడనున్నాడు.
ఇద్దరికీ పరీక్షే!
మరోవైపు అగ్రశ్రేణి ఆటగాళ్లు ముర్రే, జకొవిచ్‌లకు ఫ్రెంచ్ ఓపెన్‌లో కఠిన పరీక్ష తప్పెలా లేదు. అంతంత మాత్రం ఆటతో ఇద్దరు సతమతమవుతున్నారు. ఈ ఏడాది వీరిద్దరూ వరసు ఓటములు చవిచూస్తున్నారు. దీంతో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకోవడం అనుకున్నంత సులువుకాదని విశ్లేషకులు అంటున్నారు. అసాధారణ ఆటతో చెలరేగుతున్న నాదల్ జోరును తట్టుకుని ముందుకు సాగడం వీరిద్దరి పరీక్ష లాంటిదేనని చెప్పక తప్పదు. అయితే ఎటువంటి పరిస్థితినైన తట్టుకుని ముందుకు సాగే సత్తా కలిగిన వీరిని తక్కువ అంచన వేయలేం. ఇక, మహిళల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ గార్బిస్ ముగురుజా (స్పెయిన్) ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. టాప్ సీడ్ ఎంజెలిక్ కెర్బర్(జర్మనీ) కూడా టైటిల్‌పై కన్నేసింది. ఇద్దరు ఒకే పార్శంలో ఉండడంతో సెమీఫైనల్లోనే తలపడే అవకాశాలున్నాయి. ఈసారి మహిళలు, పురుషుల సింగిల్స్‌లో ఉత్కంఠ పోరు సాగడం ఖాయంగా మారింది. దీంతో అభిమానులకు అద్భుతమైన మ్యాచ్‌లు చూసే అవకాశం దొరకనుంది.

Comments

comments