Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

నాదల్ @ 10

tennis

పారిస్: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ చరిత్ర సృష్టించాడు. కెరీర్‌లో పదో సారి ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుని టెన్నిస్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. మరే ఆటగాడికి సాధ్యం కానీ ఫీట్‌ను ఈ స్పెయిన్ దిగ్గజం సొంతం చేసుకున్నాడు. ఆదివారం ఏకపక్షంగా సాగిన ఫైనల్లో నాలుగో సీడ్ నాదల్ 6-2, 6-3, 6-1 తేడాతో స్టిట్జర్లాండ్ స్టార్, మూడో సీడ్ స్టాన్ వావ్రింకాను చిత్తు చేశాడు. అసాధారణ ఆటతో చెలరేగిన నాదల్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. ప్రారంభం నుంచే నాదల్ చెలరేగి ఆడాడు. అతని ధాటికి వావ్రింకా ఎదురు నిలువలేక పోయాడు. చూడచక్కని షాట్లతో అలరించిన నాదల్ అలవోకగా మొదటి సెట్‌ను దక్కించుకున్నాడు. అతనికి కనీస పోటీని కూడా ఇవ్వడంలో వావ్రింకా విఫలమయ్యాడు. రెండో సెట్‌లో కూడా నాదల్ జోరు కొనసాగించాడు. తన మార్క్ షాట్లతో చెలరేగి పోయాడు. అతని జోరుతో వావ్రింకా ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యాడు. మూడో సెట్‌లోనూ నాదల్‌కు ఎదురులేకుండా పోయింది. కేవలం ఒక గేమ్‌ను మాత్రమే చేజార్చుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇదే క్రమంలో తన ఖాతాలో రికార్డు స్థాయిలో పదో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను జమ చేసుకుకన్నాడు. ఓవరాల్‌గా నాదల్‌కు ఇది 15వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం.
బెతాని-సఫరొవా జంటకు టైటిల్
ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్‌లో టాప్ సీడ్ బెతాని మాటెక్ (అమెరికా), లూసి సఫరొవా (చెక్ రిపబ్లిక్) జోడీ మహిళల డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో అమెరికా-చెక్ జంట 6-2, 6-1 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన అన్‌సీడెడ్ బర్తి-డెలక్వా జోడీని చిత్తు చేసి ఛాంపియన్‌గా నిలిచింది. ప్రారంభం నుంచే టాప్ సీడ్ జంట చెలరేగి ఆడింది. ప్రత్యర్థి జంటకు ఏమాత్రం కోలుకునే అవకాశాన్ని ఇవ్వలేదు. ఇద్దరు చూడచక్కని షాట్లతో ప్రత్యర్థి జోడీని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇదే క్రమంలో ఏమాత్రం ప్రతిఘటన లేకుండానే సునాయాసంగా మొదటి సెట్‌ను దక్కించుకున్నారు. ఇక, రెండో సెట్‌లో మాటెక్ జోడీ మరింత విజృంభించింది. ప్రత్యర్థి జంటను హడలెత్తిస్తూ 6-1 తేడాతో సెట్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుని టైటిల్ విజేతగా అవతరించింది.
డబుల్స్ విజేత హారిసన్ జోడీ
మరోవైపు పురుషుల డబుల్స్ టైటిల్‌ను రియాన్ హారిసన్ (అమెరికా), మైఖేల్ వీనస్ (న్యూజిలాండ్) గెలుచుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో హారిసన్ జోడీ 7-6, 6-7, 6-3 తేడాతో గొంజాలెజ్ (మెక్సికో), యంగ్ (అమెరికా) జంటను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. ప్రారంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. తొలి సెట్‌లో హారిసన్-వీనస్ జంటకు ప్రత్యర్థి జోడీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఇరు జోడీలు కూడా నువ్వానేనా అన్నట్టు పోరాడాయి. దీంతో పోరాటం యుద్ధాన్ని తలపించింది. టైబ్రేకర్ వరకు వెళ్లిన సెట్‌ను వీనస్ జంట కైవసం చేసుకుంది. రెండో సెట్‌లో కూడా హోరాహోరీ తప్పలేదు. అయితే ఇందులో విజయం గొంజాలెజ్ జంటను వరించింది. ఈ సెట్ కూడా టైబ్రేకర్ వరకు సాగింది. కానీ, ఫలితాన్ని తేల్చే కీలక మూడో సెట్‌లో మాత్రం అమెరికా-కివీస్ జోడీ పుంజుకుంది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన హారిసన్ జంట సెట్‌ను గెలిచి ఛాంపియన్‌గా అవతరించింది.

Comments

comments